Telangana Panchayat Elections 2025: తెలంగాణలో గ్రామ పంచాయతీ తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఫేజ్ – 1 లో భాగంగా ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకూ కొనసాగనుంది. తొలి విడుతలో మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ పలు స్థానాలు ఏకగ్రీవం కావడంతో వాటిని మినహాయించి మిగిలిన 3,834 సర్పంచ్, 27,628 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. 3,834 సర్పంచ్ స్థానాలకు 12,960 మంది. 27,628 వార్డులకు గాను 65,455 మంది పోటీపడుతున్నారు.
కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య ఘర్షణ
తొలి విడత పోలింగ్ సందర్భంగా భద్రాద్రి కొత్తకూడెం జిల్లా మణుగూరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరినొకరు తోసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఒకరిపై ఒకరు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా అడ్డుకున్నారు. అటు నల్గొండ జిల్లా ఉరుమడ్ల గ్రామంలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, డెయిరీ కార్పొరేషన్ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది.
బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ
నల్గొండ జిల్లా కొర్లపహాడ్లో పరస్పరం దాడి చేసుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు
దాడిలో పలువురికి తీవ్ర గాయాలు
గాయపడిన వారిని నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
ఈ మేరకు కొర్లపహాడ్ గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులు pic.twitter.com/7pxWwlGG2V
— BIG TV Breaking News (@bigtvtelugu) December 11, 2025
పోలింగ్ కేంద్రం వద్ద తోపులాట
భద్రాద్రి కొత్తగూడెం-మణుగూరు ZPHS ఎడ్యుకేషన్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఘటన
పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నికల గుర్తులు చూపిస్తూ ప్రచారం చేసినట్లు సమాచారం
పోలీసులు చెప్పినా వినకుండా తిరగబడిన కార్యకర్తలు
ఈ క్రమంలో పోలీసులకు,… pic.twitter.com/Xfl8NylxKC
— BIG TV Breaking News (@bigtvtelugu) December 11, 2025
9 గంటల వరకూ పోలింగ్ శాతం
తెలంగాణలోని పల్లెల్లో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య 18.37 శాతం ఓటింగ్ నమోదయ్యింది. మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 28.87 శాతం పోలింగ్ నమోదు కాగా.. కొమురంభీం ఆసిఫాబాద్ లో అత్యల్పంగా 7.85 శాతం మంది ఓటు వేశారు.
నిలిచిన పోలింగ్..
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల పదో వార్డులో పోలింగ్ కొద్ది సేపు నిలిచిపోయింది. బ్యాలెట్ పేపపర్ పై వార్డు అభ్యర్థి డేరాంగుల యాదమ్మకు గుర్తు కేటాయించకపోవడంతో అధికారులు పోలింగ్ నిలివేశారు. 30 నిమిషాల తర్వాత వేరే బ్యాలెట్ పేపర్లు తీసుకువచ్చి పోలింగ్ కొనసాగించారు.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
పోలింగ్ ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి, అక్కడ అదనపు బలగాలను మోహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 243 సమస్యత్మాక ప్రాంతాలను అధికారులు గుర్తించారు. సమస్యత్మాక ప్రాంతాల్లో బందోబస్తును రెండింతలు పెంచారు. ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు సమన్వయంతో పనిచేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
3,214 ఎఫ్ఐఆర్లు
ఫస్ట్ ఫేజ్ లో భాగంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద 3,214 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కాగా ఎన్నికలకు ఎవరైనా విఘాతం కలిగించే అవకాశముందని భావించి భారత న్యాయ సంహిత ప్రకారం 31,428 మందిని బైండోవర్ చేసినట్లు స్పష్టంచేశారు. 902 లైసెన్స్ డ్ ఆయుధాలను పోలీసుల వద్ద డిపాజిట్ చేశారు. దాదాపు రూ.1,70,58,340 నగదును సీజ్ చేశారు. రూ.2,84,97,631 విలువైన మద్యం సీజ్ చేశారు. అలాగే రూ.2,22,91,714 విలువైన డ్రగ్స్ ను సీజ్ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.
Also Read: New Business Survey: చిన్న వ్యాపారాల డిజిటల్ మార్పుపై ప్రభుత్వం దృష్టి.. 2026 నుంచి ఈ-కామర్స్, సోషల్ మీడియా డేటా ట్రాక్
9,633 వార్డు స్థానాలు ఏకగ్రీవం
ఈ తొలి దశ పోలింగ్‌లో మొత్తం 56,19,430 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 27,41,070 మంది పురుష ఓటర్లు ఉండగా, మహిళా ఓటర్లు 28,78,159 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళల సంఖ్య అధికంగా ఉండటం గమనార్హం. రాష్ట్రంలో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరిగే 5 గ్రామ పంచాయతీల్లో ఒక్కటంటే ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. అలాగే 169 వార్డుల్లోనూ ఒక్క నామినేషన్ దాఖలు కాకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ఒక గ్రామపంచాయతీలో ఎన్నికలు నిలిచిపోయాయి.

