Delhi Blast: ఢిల్లీలోని ప్రఖ్యాత ఎర్రకోట దగ్గరలో సోమవారం సాయంత్రం జరిగిన భారీ పేలుడు ఘటనలో (Delhi Blast) అనుమానితులను దర్యాప్తు ఏజెన్సీలు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నాయి. పేలుడు కోసం వాడిన కారును నడిపిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్‌ను ఆత్మాహుతి బాంబర్‌గా అనుమానిస్తున్న నేపథ్యంలో, అతడి తల్లి, ఇద్దరు సోదరులు ఆషిక్ అహ్మద్, జహూర్ అహ్మద్‌లను ఢిల్లీ పోలీసులు సోమవారం రాత్రే అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉమర్ మొహమ్మద్ కుటుంబ సభ్యులు తొలిసారి స్పందించారు.
డాక్టర్ మొహమ్మద్ ఉమర్ ఒక పుస్తకాల పురుగు అని, అధ్యయనం చేస్తూ, ఎక్కువ సమయం పుస్తకాలతో గడిపేవాడని, అలాంటి యువకుడు ఉగ్రదాడిలో ఎలా పాల్గొంటాడని అతడి కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. ఢిల్లీ పేలుడు కేసులో అతడి పేరు రావడంతో కుటుంబం షాక్‌కు గురైందని చెప్పారు. తమ కుటుంబానికి ఏకైక ఆశ అతడేనని, అతడితో గత శుక్రవారమే తాను మాట్లాడానని, పరీక్షలు జరుగుతున్నాయని, లైబ్రరీలో చదువుకుంటున్నట్టు చెప్పాడని మొహమ్మద్ ఉమర్ వదిన చెప్పింది. ఆమె ఫరీదాబాద్‌లోని అల్ ఫలా యూనివర్సిటీ అండ్ హాస్పిటల్‌లో పనిచేస్తోంది. ఉమర్ చివరిసారిగా రెండు నెలలక్రితం పుల్వామాలోని కోయిల్ గ్రామానికి వచ్చాడని ఆమె తెలిపింది. అతను ఇంటికి వచ్చినప్పుడల్లా చదువుకోవాలంటూ తమను కోరేవాడని, ఢిల్లీ బ్లాస్ట్‌లో అతడి పేరు రావడం విని షాక్‌కు గురయ్యామని ఆమె పేర్కొంది. డాక్టర్ ఉమర్ అరెస్టుతో కుటుంబం కుంగిపోయిందని ఆమె విచారం వ్యక్తం చేసింది.
కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేసేందుకు మొహమ్మద్ ఉమర్ తల్లి ఎంతగానో కష్టపడిందని, తమ ఏకైక ఆశ ఉమర్ అని ఆమె పేర్కొంది. కాగా, ఉమర్ సోదరుల్లో ఒకరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా, మరొకరు స్టెనోగ్రఫీ చదువుతున్నారు.
Read Also- Islamabad Blast: ఇస్లామాబాద్ కోర్టు ప్రాంగణంలో భారీ పేలుడు.. 12 మంది మృతి, 20 మందికి గాయాలు
సహచరుడి అరెస్ట్‌తో భయపడ్డ ఉమర్
గతవారం ఫరీదాబాద్‌లో భారీ ఉగ్రవాదులను నెట్‌వర్క్‌ను దర్యాప్తు సంస్థలు బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఉగ్ర ముఠాలో డాక్టర్ ఉమర్ కూడా సభ్యుడిగా భావిస్తున్నారు. తన సహచరుడైన డాక్టర్ షకీల్ అరెస్టు తర్వాత మొహమ్మద్ ఉమర్ భయాందోళన చెంది, ఎర్రకోట సమీపంలో పేలుడుకు పాల్పడి ఉంటారని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి. ఈ భారీ పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్, లేదా ఏఎన్ఎఫ్‌వో (పరిశ్రమల్లో పేలుడు కోసం వాడేది) ఉపయోగించి ఉంటారని చెబుతున్నారు. ఢిల్లీ బ్లాస్ దాడి జరిగిన సోమవారమే జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇతర ఏజెన్సీలు జైషే మహమ్మద్, అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్‌తో సంబంధాలున్న ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలను బయటపెట్టారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఏకంగా 2,900 కేజీల తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అదే ప్రదేశంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అల్-ఫలా యూనివర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్ ముజమ్మిల్ షకీల్ నివాసంలో ఇవన్నీ బయటపడ్డాయి.
పెరిగిన మృతుల సంఖ్య
సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు జరిగిన విషయం తెలిసిందే. హ్యుందాయ్ ఐ20 కారు పేలిన ఈ ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. ఈ మేరకు తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఒకరు మంగళవారం సాయంత్రం చనిపోయారు. దీంతో, మృతుల సంఖ్య 10కి చేరింది. ఇక, గాయపడిన 25 మంది చికిత్స పొందుతున్నారు.
Read Also- Rabi Season: రబీ సాగుకు రైతులు సమాయత్తం.. జోరుగా మొదలైన రబీ సాగు పనులు
