Bihar Election Results: ఎన్నికల్లో కొన్నిసార్లు ఓడిపోయినప్పటికీ ఓటర్ల మద్దతు తగ్గిందని భావించాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో పార్టీలు పెద్దగా సీట్లు గెలుచుకోలేకపోయినా, ఓట్లను మాత్రం భారీగా పొందుతుంటాయి. సదరు పార్టీకి ఉన్న నిశ్చలమైన ఓటు బ్యాంక్, పార్టీ నడిపించేవారిపై జనాల్లో ఉండే నమ్మకం, లేదా క్షేత్రస్థాయిలో పనిచేసే అభ్యర్థుల పనితీరు ప్రభావం కూడా అయ్యి ఉండొచ్చు. అలాంటి పార్టీల ఫలితం ఎలా ఉన్నా ఓట్లు మాత్రం సాలీడ్‌గా వస్తుంటాయి. శుక్రవారం వెలువడిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ (Bihar Election Results) ఈ సరళి కనిపించింది.
బీహార్‌లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) సారధ్యంలోని ఎన్డీయే కూటమి (NDA) అఖండ విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఎన్డీయేకి 202 సీట్లు (ఒకటి రెండు అటు ఇటు మారవచ్చు) వచ్చాయి. మహాఘట్ బంధన్ కూటమి ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. ముఖ్యంగా గెలుపును ఆశించిన ప్రతిపక్ష రాష్ట్రీయ జనతా దళ్ (RJD) పార్టీ భంగపాటుకు గురైంది. 2010 తర్వాత ఆ పార్టీకి ఇదే అత్యంత దారుణమైన ఓటమి అయినప్పటికీ, ఆ పార్టీకి కాస్త ఊరట కలిగించే ఒక అంశం ఈ ఫలితాల్లో కనిపించింది. అదేంటంటే, బీహార్‌లో అత్యధిక ఓట్ షేర్ దక్కించుకున్న పార్టీగా ఆర్జేడీ నిలిచినట్టు ఎన్నికల సంఘం డేటా చెబుతోంది.
అన్ని పార్టీల కంటే ఎక్కువ ఓట్లు
ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం, తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీ దాదాపు 23 శాతం ఓటు షేర్ సాధించింది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో (కౌంటింగ్ కొనసాగుతోంది) ఆ పార్టీకి 22.98 శాతం ఓట్లు పడ్డాయి. 90కి పైగా స్థానాలు సాధించిన బీజేపీ కంటే 2.29 శాతం ఓట్లు ఆర్జేడీకి ఎక్కువ వచ్చాయి. ఇక, సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతా దళ్ యునైటెడ్ (JDU) కంటే ఆర్జేడీకి 3.8 శాతం ఓట్ షేర్ ఎక్కువగా వచ్చింది.
మిగతా పార్టీల ఓటు షేర్ విషయానికి వస్తే, కాంగ్రెస్‌కు 8.72 శాతం, బీఎస్పీకి 1.62 శాతం, ఎల్జేపీకి 4.98 శాతం, ఇతరులకు 13.97 శాతం, మిగతా ఓటు శాతం మరికొన్ని పార్టీలకు పడింది. ఓటు షేర్ అన్ని పార్టీల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ ఆర్జేడీ 25 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది. ఆ పార్టీ మొత్తం 143 స్థానాల్లో పోటీ చేసింది. దీంతో, 22 సీట్లు గెలిచిన 2010 ఎన్నికల తర్వాత ఆర్జేడీకి ఇదే అత్యంత చెత్త ఓటమి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా భావించిన తేజస్వి యాదవ్ కూడా కానకష్టంగా గెలిచారు. రాఘోపూర్ స్థానంలో చాలా రౌండ్లపాటు వెనుకబడ్డారు. చివరికి స్వల్ప తేడాతో మాత్రమే గెలవగలిగారు.
