Delhi Blast:ఎక్కడైనా ఏదైనా ప్రమాదమో, లేక ప్రకృతి విపత్తుకు సంబంధించిన వార్త విన్న వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న తమ బంధువులు, స్నేహితులు సురక్షితంగా ఉన్నారా? అనే ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. ఫోన్ కాల్స్, ఇతర మార్గాల ద్వారా వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. సురక్షితంగా ఉన్నట్టు అవతలి వైపు నుంచి వెంటనే సమాధానం వస్తే ఫర్వాలేదు. కానీ, స్పందన ఆలస్యమవుతున్నా కొద్దీ గుండె వేగం పెరగడం ఖాయం. నెమ్మదిగా భయం మొదలై, విషాదఛాయలు అలుముకుంటుంటాయి. ఆ తర్వాత చేదువార్తలు కూడా వినాల్సి ఉంటుంది. ఢిల్లీకి సుమారుగా 600 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉత్తరప్రదేశ్‌లోని శ్రవస్తికి చెందిన భూరే మిశ్రా అనే వ్యక్తికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. సోమవారం రాత్రి ఢిల్లీలో పేలుడు ఘటన (Delhi Blast) తర్వాత, ఆ ఘటనకు సంబంధించి టీవీ ఛానళ్లలో వార్తలు, సోషల్ మీడియాలో వీడియో క్లిప్‌లను చూసిన ఆయన ఆందోళనకు గురయ్యారు.
ఎందుకంటే, ఆయన ముగ్గురు కొడుకులు ఢిల్లీలోనే ఉంటున్నారు. పేలుడు ఘటన గురించి తెలిసి, ఆందోళనకు గురైన ఆయన, ముగ్గురికీ వరుసబెట్టి ఫోన్ల చేశారు. ఇద్దరు కొడుకులు ఫోన్లు లిఫ్ట్ చేశారు. కానీ, దినేష్ అనే కొడుకు మాత్రం ఫోన్ ఎత్తలేదు. ఎంతసేపు ట్రై చేసినా స్విచ్ఛాఫ్ అని వస్తుండడంతో, భూరేలో భయం మొదలైంది. ఎలాంటి సమాచారం లేకుండా టైమ్ గడిచిపోతుండడంతో ఆయనలో టెన్షన్ పెరిగిపోయింది. ఆ తర్వాత ఏదో తెలియని విషాదఛాయలు ఆయనను అలుముకున్నాయి. ఆఖరికి ఆయన అనుకున్నదే జరిగింది. కొన్ని గంటలు గడిచిపోయిన తర్వాత ఢిల్లీ పేలుడు ఘటనలో దినేష్ చనిపోయినట్టు నిర్ధారణ అయింది.
Read Also- The Girlfriend: సక్సెస్ సెలబ్రేషన్స్‌కి సిద్ధమవుతున్న‘ది గర్ల్‌ఫ్రెండ్’ టీమ్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?
మృతుడు దినేష్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత పదేళ్లుగా ఆయన ఓల్డ్ ఢిల్లీలోనే ఉంటున్నాడు. ఇన్విటేషన్ కార్డులు విక్రయించే ఒక షాప్‌లో పని చేసేవాడు. అతడితో పాటు ఇద్దరూ సోదరులు కూడా ఢిల్లీలోనే ఉంటున్నారు. దినేష్ తన ఎనిమిదేళ్ల వయసున్న కొడుకును ఢిల్లీలో తన వద్ద ఉంచుకుంటున్నాడు. అతడి ఇద్దరు కూతుళ్లతో కలిసి భార్య రీనా వారి స్వస్థలం శ్రవస్థిలో ఉంటుంది. తన కొడుకు వారం రోజుల క్రితమే ఇంటికి వచ్చి వెళ్లాడని తండ్రి భూరే మిశ్రా విచారం వ్యక్తం చేశారు.
తాను సోమవారం రాత్రి 8 గంటల సమయంలో టీవీ చూస్తున్నానని, పేలుడు ఘటన గురించి అప్పుడే తెలిసిందన్నారు. అప్పుడు ముగ్గురికీ ఫోన్ చేయడం మొదలుపెట్టానని, దినేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని ఆయన చెప్పారు. కొన్ని గంటలు గడిచిన తర్వాత దినేష్ పేలుడులో చనిపోయాడంటూ పెద్ద కొడుకు ఫోన్ చేసి చెప్పాడని వెల్లడించారు. ఒక్కసారిగా దినేష్ భార్య రీనా, తల్లి సావిత్రి దుఃఖసాగరంలో మునిగిపోయారని, తాము సర్వస్వం కోల్పోయినట్టుగా అనిపిస్తోందని ఆయన వాపోయారు.
Read Also- Jatadhara: బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిన ‘జటాధర’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?
