CBI Notices Vijay: తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత, తమిళ దిగ్గజ నటుడు విజయ్‌కి (TVK Vijay) అనూహ్య పరిణామం ఎదురైంది. 41 మందికిపైగా ప్రాణాలు బలిగొన్న కరూర్ తొక్కిసలాట కేసులో (Karur stampede Case) సీబీఐ నోటీసులు జారీ (CBI Notices Vijay) చేసింది. జనవరి 12న ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో హాజరవ్వాలని కోరింది. కాగా, యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన కరూర్ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు జరపాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ ఇప్పటికే పలువురు టీవీకే పార్టీ నాయకులను ప్రశ్నించి, స్టేట్‌మెంట్లను రికార్డ్ చేసింది. ఇక, పార్టీ అధినేత విజయ్‌ని కూడా విచారించాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. అనంతరం ఛార్జిషీట్ దాఖలు చేయాలని సీబీఐ భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
నిజానికి కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తును తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టేందుకు సిట్ ఏర్పాటు చేసింది. రాష్ట్ర పరిధిలోని లా అండ్ ఆర్డర్స్‌కు సంబంధించిన విషయం కాబట్టి, దీనిపై దర్యాప్తునకు సిట్ సరిపోతుందని వాదించింది. అయితే, సీబీఐ దర్యాప్తు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా ప్రజల మనస్సును కలిచివేసిందని, కాబట్టి ఈ ఘటనలో స్వతంత్ర, నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది. సిట్ దర్యాప్తు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో, సీబీఐ రంగంలోకి దిగింది.
సీబీఐ అధికారులు రంగంలోకి దిగి, కరూర్‌లో సభ నిర్వహణకు జారీ అయిన అనుమతులు, ఏర్పాట్లు, రద్దీ నియంత్రణకు చేపట్టిన చర్యలు, పోలీసుల మోహరింపు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్స్ సహా సమగ్రమైన వివరాలు అన్నింటినీ సేకరించారు. ఈ క్రమంలోనే టీవీకే పార్టీ కీలక నేతలను సైతం ప్రశ్నించారు.
తొక్కిసలాటలో 41 మంది మృతి
గతేడాది సెప్టెంబర్ 27న విజయ్ ర్యాలీ చేపట్టగా తొక్కిసలాసట జరిగింది. ఈ ఘటనలో 41 మంది చనిపోగా, 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కేవలం 10 వేల మంది పట్టే ఇరుకైన రోడ్డు మీదకు ఏకంగా 30 వేల మంది తరలి రావడం తొక్కిసలాటకు దారితీసింది. భద్రతాపరమైన నిబంధనలు కూడా ఉల్లంఘించి పార్టీ సభ ఏర్పాటు చేశారని, ఆహారం, తాగు నీరు విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. ఈ పరిస్థితులే తొక్కిసలాటకు దారితీశాయంటూ అభియోగాలు నమోదయ్యాయి.
వాస్తవానికి మధ్యాహ్నం 12 గంటలకు విజయ్ వేదిక వద్దకు చేరుకోవాల్సి ఉంది. కానీ, తీవ్రమైన ఆలస్యం జరిగి రాత్రి 7 గంటలకు వేదిక వద్దకు చేరుకున్నాడు. దీంతో, ఆ సమయానికి జనాల రద్దీ రెండు రెట్లు పెరిగిపోయింది. అంత రద్దీలో కూడా విజయ్ బస్సు వేదిక వద్దకు వెళ్లింది. విజయ్‌ని చూసేందుకు అభిమానులు చుట్టుపక్కల ఉన్న బిల్డింగులు, చెట్లు ఎక్కారు. కొందరైతే విద్యుత్ స్థంభాలు కూడా ఎక్కారు. దీంతో, విద్యుతాఘాతాన్ని తప్పించేందుకు కరెంట్ సరఫరాను కూడా నిలిపివేయాల్సి వచ్చింది. మొత్తంగా ఈ పరిస్థితులన్నీ తీవ్ర తొక్కిసలాటకు దారితీశాయి.

