Damodar Raja Narasimha: కులమతాలకు అతీతంగా విద్యార్థులందరూ ఒకే చోట చదువుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల’ నిర్మాణాన్ని రానున్న 18 నెలల నుంచి రెండేళ్లలో పూర్తి చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) అసెంబ్లీలో వెల్లడించారు. శాసనసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. గత ప్రభుత్వం విద్యాశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, గురుకులాల పేరుతో విద్యార్థులను కులాల వారీగా విభజించిందని మంత్రి విమర్శించారు. 2014- 2023 వరకు ఉన్న 1023 భవనాల్లో కేవలం 400 మాత్రమే సొంత భవనాలని, మిగిలిన 617 పాఠశాలలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని సభకు వివరించారు.
76 స్కూళ్లకు త్వరలోనే టెండర్లు
ఈ దుస్థితిని మార్చేందుకు తమ ప్రభుత్వం మొత్తం 105 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ప్రతిపాదించిందని పేర్కొన్నారు. ఒక్కో పాఠశాలను సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో రూ. 150 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం 12 పాఠశాలల పనులు వివిధ దశల్లో ఉన్నాయని, మరో 76 స్కూళ్లకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని వెల్లడించారు. టీచర్లు కనీసం ఐదు నుంచి ఆరేళ్ల పాటు గ్రామీణ ప్రాంతాల్లో పని చేసేలా సభ్యులు ఇచ్చిన సూచనను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. విద్యా రంగానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగానే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ. 1000 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. సభ్యుడు దానం నాగేందర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, బంజారాహిల్స్ ఉదయ్ నగర్ పాఠశాల భవనానికి అదనపు అంతస్తు నిర్మాణాన్ని పరిశీలిస్తామన్నారు. అలాగే భారతీయ విద్యా భవన్‌లో అడ్మిషన్ల ప్రక్రియ, నిబంధనల అమలుపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Also Read: Damodar Raja Narasimha: పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహా!
విప్లవాత్మక మార్పులు
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. అదనంగా 490 వెంటిలేటర్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాజనర్సింహ వెల్లడించారు. సోమవారం శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1790 వెంటిలేటర్ బెడ్లు ఉన్నాయని, పెరిగిన రోగుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొత్తగా వీటిని కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి ఇతర ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల నుండి కూడా రోగులు వస్తున్నారని, అక్కడ రద్దీని తగ్గించేందుకు అదనంగా 125 వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా నిమ్స్‌లో మెరుగైన సేవల కోసం కొత్తగా సుమారు 850 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం గాంధీ, ఉస్మానియా వంటి పరిమిత ఆసుపత్రుల్లోనే ఉన్న ఎంఆర్ఐ సదుపాయాన్ని మరో 9 ప్రభుత్వ ఆసుపత్రులకు విస్తరిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: Damodar Raja Narasimha: హరే కృష్ణ సెంటర్ ఆధ్యాత్మిక ప్రారంభోత్సవంలో.. మంత్రి దామోదర్ రాజనర్సింహా

