Uttarakhand Accident: ఉత్తరాఖండ్ లో మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. టెహ్రీ జిల్లా (Tehri district)లోని నరేందర్ నగర్ (Narendra Nagar) సమీపంలో భక్తులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. కుంజాపురి ఆలయానికి (Kunjapuri Temple) వెళ్తున్న క్రమంలో ఈ బస్సు ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలిపారు.
70 మీటర్ల లోతులో..
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బలగాలు, రెస్క్యూ బృందాలు హుటాహుటీనా ఘటనాస్థలికి చేరుకున్నాయి. రహదారిపై నుంచి 70 మీటర్ల లోయలో పడ్డ బస్సు వద్దకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని రహదారి పైకి తీసుకొచ్చి.. అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించాయి. ప్రమాద ఘటనపై టెహ్రీ జిల్లా కలెక్టర్ స్పందించారు. కమాండెంట్ అర్పణ్ యదవంశీ నేతృత్వంలోని ఎస్డీఆర్ఎఫ్ బృందాలను వెంటనే ఘటనాస్థలికి పంపినట్లు చెప్పారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై సమగ్ర దర్యాప్తు జరుగుతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
ప్రస్తుతం ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయి. గాయపడ్డ వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. బాధితులు.. దిల్లీ, గుజరాత్ ప్రాంతాలకు చెందినవారని పేర్కొన్నారు. అయితే ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని ప్రమాదకర రోడ్డు మార్గాలను మరోమారు చర్చకు తీసుకొచ్చింది. ఎత్తైన కొండ ప్రాంతాల్లో మలుపులు తిరుగుతూ ఉన్న రోడ్లు ప్రమాదాలకు కారణాలుగా నిలుస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన బస్సు, ఐదుగురు మృతి
తెహ్రీ జిల్లాలో నరేంద్రనగర్ వద్ద లోయలో పడిన బస్సు
ప్రమాదంలో ఐదుగురు మృతి, పలువురికి గాయాలు
ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు pic.twitter.com/UBhDu3gTZH— ChotaNews App (@ChotaNewsApp) November 24, 2025
Also Read: Gang Wars – Sajjanar: హైదరాబాద్‌లో గ్యాంగ్ వార్స్.. రంగంలోకి సజ్జనార్.. రౌడీలకు మాస్ వార్నింగ్!
తమిళనాడులో ఘోర ప్రమాదం
ఇదిలా ఉంటే సోమవారం తమిళనాడు రాష్ట్రంలోని టెంకాసి జిల్లాలోనూ ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. కామరాజపురం – ఇడైకల్ సమీపంలో రెండు ప్రైవేట్ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
