Bihar Election Results: బీహార్ ఎన్నికల ఫలితాల్లో (Bihar Election Result) మహాఘట్ బంధన్ కూటమి ఘోర ఓటమిని చవిచూడడం, కాంగ్రెస్ పార్టీ కేవలం 6 సీట్లకే పరిమితం కావడంపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, హస్తం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శుక్రవారం పొద్దుపోయాక తొలిసారి స్పందించారు. బీహార్ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయని, ఈ ఎన్నికలు తొలి నుంచీ సరైన రీతిలో జరగలేదని ఆయన ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు పెద్ద పోరాటమే చేశామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. మహాఘట్ బంధన్‌పై నమ్మకంతో ఓట్లు వేసిన బీహారీలకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. బీహార్ ఎన్నికల ఫలితం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నారు. ఈ ఫలితంపై కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి లోతుగా సమీక్ష జరుపుతాయని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తామని ఆయన చెప్పారు.
శుక్రవారం వెలువడిన బీహార్ ఫలితాలో మహాకూటమికి కేవలం 35 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే, రాష్ట్రంలో మొత్తం 243 స్థానాలు ఉండగా ఎన్డీయే కూటమి ఏకంగా 202 సీట్లు గెలుచుకుంది. గెలుపోటములు ఖరారైన తర్వాత రాహుల్ గాంధీ ఈ విధంగా స్పందించారు. ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ ప్రస్తావించలేదు. కానీ, ఈ ఎన్నికలు మొదటి నుంచి సరైన రీతిలో జరగలేదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
ఖర్గే నోటా అదేమాట
రాహుల్ గాంధీ మాదిరిగానే బీహార్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (mallikarjun kharge) కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. దాదాపు రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన సమయంలోనే ఖర్గే కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపించారు. బీహార్ ప్రజల తీర్పును తాము గౌరవిస్తామని ఆయన అంగీకరించారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్న శక్తులకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన చెప్పారు. బీహార్ ఎన్నికల ఎన్నికల ఫలితాలను సంపూర్ణంగా పరిశీలించుకుంటామని, ఈ విధమైన ఫలితాలకు గల కారణాలను అర్థం చేసుకొని, ఆ తర్వాత ఒక వివరానికి వస్తామని ఖర్గే పేర్కొన్నారు.
Read Also- Raja Singh: నేను బీజేపీలో చేరను.. పార్టీని సర్వనాశనం చేస్తున్నారు.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..!
నిరుత్సాహ పడొద్దు
బీహార్ ఎన్నికల ఫలితాలను చూసి నిరుత్సాహ పడొద్దని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మల్లికార్జున ఖర్గే ధైర్యం చెప్పారు. నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, కార్యకర్తలే తమకు గర్వకారణమని చెప్పారు. జనాల్లో అవగాహన పెంపొందించేందుకు ఎలాంటి ప్రయత్నాన్నీ వదులుకోవద్దని కార్యకర్తలకు సూచించారు. ప్రజల్లోనే ఉంటూ రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటాన్ని కొనసాగించాలన్నారు. ఈ పోరాటం సుదీర్ఘమైనదని, అంకితభావం, ధైర్యం, నిజాయితీతో పోరాడదామని ఆయన పేర్కొన్నారు.
కాగా, శుక్రవారం వెల్లడైన బీహార్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 6 సీట్లు మాత్రమే వచ్చాయి. 2020 ఎన్నికలలో పోటీ చేసిన 70 స్థానాలలో 19 మాత్రమైనా గెలిచిన హస్తం పార్టీ ఈసారి కనీసం రెండంకెల సీట్లను కూడా అందుకోలేకపోవడంతో, కూటమి ఓటమికి ప్రధాన కారణమనే అపవాదును ఎదుర్కొంటుంది. ఈసారి పోటీ చేసిన 61 స్థానాలలో పోటీ చేయగా మరీ 6 స్థానాలకు పడిపోవడం ఏమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమిలోని మరో ప్రధాన పార్టీ అయిన ఆర్జేడీ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 144 స్థానాలలో పోటీ చేసి 75 సీట్లు గెలుచుకోగా, ఈసారి కేటాయించిన 143 స్థానాలలో కేవలం 25 మాత్రమే గెలిచి బొక్కబోర్లా పడింది.
Read Also- KTR: జూబ్లీహిల్స్ ఫలితంపై ..ఆత్మ విమర్శ చేసుకుంటాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
