KTR: జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితంపై ఆత్మ విమర్శ చేసుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తామన్నారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు అన్నారు. వారికి తోడుగా ప్రతి బూత్‌లో స్థానిక జూబ్లీహిల్స్ పార్టీ శ్రేణులు, నాయకులు కూడా కష్టపడ్డారని, వారు కూడా మా అభ్యర్థికి రాజకీయ అనుభవం లేకపోయినా, చాలా కష్టపడి ఎన్నికల్లో గెలుపు కోసం పోరాటం చేశారన్నారు. మాగంటి సునీతకు కూడా అభినందనలు చెప్పారు. ఎన్నికల్లో పార్టీకి గణనీయమైన ఓటు శాతం నమోదైందన్నారు.
Also Read: KTR on Jubilee Hills Result: జూబ్లీహిల్స్ ఫలితంపై కేటీఆర్ తొలి స్పందన ఇదే
కాంగ్రెస్ ఒక్క ఉప ఎన్నికల్లోనూ గెలవలేదు
ప్రతి ఎన్నికల్లో గెలవాలని పోటీ చేస్తామని తెలిపారు. గత రెండేళ్లుగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ఎత్తిచూపడంలో, ఎన్నికల్లో మా పార్టీ నిజాయితీగా, చిత్తశుద్ధిగా పోరాడిందన్నారు. ప్రతి సర్వేలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అన్ని సర్వే ఏజెన్సీలు చెప్పాయని, ఈ ఎన్నిక కొత్త ఉత్సాహాన్ని, కొత్త బలాన్ని ఇచ్చిందన్నారు. ఈ ఎన్నిక ద్వారా స్పష్టమైన ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అని ప్రజలు తీర్పునిచ్చారన్నారు. 2014 నుంచి 2023 వరకు 7 ఉప ఎన్నికలు జరిగాయని, అన్ని ఉప ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఒక్క ఉప ఎన్నికల్లోనూ గెలవలేదన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా ఒకటి, రెండు సీట్లకే పరిమితమైందన్నారు. ఒక్క ఉప ఎన్నికల్లో గెలవకపోయినా, డిపాజిట్లు కోల్పోయినా అప్పటి ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను, ఆరు గ్యారెంటీల అమలును, ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయామన్నారు.
5300 కోట్ల అభివృద్ధిని నియోజకవర్గానికి చేశాం
10ఏళ్లు ప్రభుత్వాన్ని నడిపిన పార్టీగా మేము చేసిన అభివృద్ధిని చూపించామని, 5300 కోట్ల అభివృద్ధిని నియోజకవర్గానికి చేశామని ప్రజల ముందుకు పెట్టామని, మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎగ్గొట్టిన ప్రతి ఒక్క అంశాన్ని ‘బాకీ కార్డు’ రూపంలో ప్రజల ముందుకు తీసుకుపోయామన్నారు. హైడ్రా నుంచి మొదలుకొని, ఆటో కార్మికుల సమస్యల వరకు అనేక అంశాలను వివరించామన్నారు. మా ఒత్తిడి కారణంగానే గ్యారెంటీల అమలుపైన సీఎం, రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేసే స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చామన్నారు. మంత్రివర్గంలో మైనారిటీలకు స్థానం లేదని, ఆటోలకు జరుగుతున్న అన్యాయం పైన మా పార్టీ గళమెత్తితే, ప్రభుత్వం ఒత్తిడికి లోనై వారికి స్థానం కల్పించాల్సి వచ్చిందన్నారు. గెలవాల్సింది పార్టీలు కాదు, గెలవాల్సింది ప్రజలు అని నమ్మే పార్టీ మాది అని అన్నారు.
డిపాజిట్ బీజేపీ కోల్పోయింది
ఎలక్షన్ కమిషన్, పోలీస్ పనితీరుపైనా చర్చ జరగాలన్నారు. ఎన్నికలు జరిగిన తీరుపైన ప్రజాక్షేత్రంలో చర్చ జరగవలసిన అవసరం ఉన్నదని, ఏదేమైనా ప్రజా తీర్పుని మేము గౌరవిస్తాం అన్నారు. ఈ ఎన్నికల్లో మరింత ఓటింగ్ జరిగి ఉండాల్సిందని, మాకు ఈ ఎన్నికల్లో మంచి ఓటింగ్ వచ్చిందన్నారు. సింగిల్ డిజిట్‌లో ఉండి డిపాజిట్ బీజేపీ కోల్పోయిందని, ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం ఫలించినట్టుగానే కనిపిస్తున్నదన్నారు. ఆర్ఎస్ బ్రదర్స్ సమీకరణం బానే వర్కౌట్ అయినట్టు కనిపించిందని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీనే ప్రత్యామ్నాయం అని ప్రజలు నిరూపించారన్నారు. ఎన్నికల ఫలితం వలన నిరాశ చెందమని, మా పనిని ప్రధాన ప్రతిపక్షంగా చేసుకుంటూ పోతూనే ఉంటామన్నారు.
ప్రయత్నం చేసిన పార్టీ నేతలకు కార్యకర్తకు ధన్యవాదాలు
ప్రజలతోనే ఉంటాం.. ప్రజల కోసమే ఉంటాం.. ప్రజల్లోనే ఉంటాం. తిరిగి కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసుకునేదాకా పోరాటం చేస్తూనే ఉంటామని వెల్లడించారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పనిచేసుకొని ముందుకు వెళ్తామన్నారు. ఈ ఎన్నికతో నిరాశ చెందవలసిన అవసరం లేదన్నారు. జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ బీహార్‌లో ఉనికి కోల్పోయే పరిస్థితిలో ప్రజలు తీర్పునిచ్చారన్నారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన మాదిరి ఇక్కడ కూడా పార్టీ మారిన నేతలను డిస్క్వాలిఫై చేసి ఉప ఎన్నికలు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. ఒక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకే ఇన్ని అపసోపాలు పడిన కాంగ్రెస్ పార్టీ, 10 ఉప ఎన్నికలు వస్తే ఎలా ఎదుర్కొంటుందో చూస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే బలంగా కొట్లాడతామన్నారు. మా పార్టీ సీనియర్ నేత హరీష్ రావు తండ్రి మరణం తర్వాత కూడా ఎప్పటికప్పుడు ఇంటి నుంచి ఎన్నికల కోసం పనిచేశారన్నారు. దీపావళి లాంటి పండగను సైతం పక్కనపెట్టి పార్టీ విజయం కోసం ప్రయత్నం చేసిన పార్టీ నేతలకు, కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read: KTR Resign Posters: కేటీఆర్ రాజీనామా!.. జూబ్లీహిల్స్‌లో పోస్టర్ల కలకలం
