KTR on Jubilee Hills Result: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారి (KTR on Jubilee Hills Result) స్పందించారు. ‘‘ బీఆర్ఎస్ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పాయి. కానీ, ఆఖరి మూడు రోజుల్లో ఏం జరిగిందో అందరూ చూశారు. ఆ విషయాల గురించి నేను మాట్లాడను. ఈ ఎన్నిక మాకు కచ్చితంగా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కొత్త బలాన్ని ఇచ్చింది. ఎందుకంటే, ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఆ విషయంలో ఎలాంటి అనుమానాలు లేకుండా ప్రజలు స్పష్టంగా చెప్పారు. జూబ్లీహిల్స్ ఫలితాన్ని సానుకూలంగా చూస్తాం. ఈ ఎన్నికల్లో అధికార యంత్రాంగం ఏవిధంగా పనిచేసిందనేది మీరంతా చూశారు. వాటిలోకి ఎక్కువగా పోను. 2014 నుంచి 2023 వరకు మన రాష్ట్రంలో చాలా ఉపఎన్నికలు జరిగాయి. ఏడు ఉపఎన్నికలు జరిగాయి. పాలేరు, నారాయణఖేడ్, హుజూర్‌నగర్, దుబ్బాక, నాగార్జున సాగర్, హుజురాబాద్, మనుగోడు.. ఈ అన్ని ఉపఎన్నికల్లో అప్పటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్. హస్తం పార్టీ ఒక్క ఉపఎన్నిక కూడా గెలవలేదు’’ అని అన్నారు. జూబ్లీహిల్స్ ఫలితం వెలువడిన (TS Politics) తర్వాత ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ గారు ఎప్పుడూ చెబుతుంటారు. గెలవాల్సింది పార్టీలు కాదు, ప్రజలు అని. ప్రజాస్వామ్యంలో చర్చ జరగాల్సిందే. మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఎన్నిక ఎట్లా జరిగిందనేది దానిపై చర్చ జరగాలి. ఎందుకంటే, మేము నెల రోజుల ముందే చెప్పాం. కాంగ్రెస్ ఎన్ని రకాల అక్రమాలకు తెరలేపిందో చెప్పాం. నకిలీ ఓట్లను బయటపెట్టాం. ఆధారాలతో సహా బయటపెట్టాం. ఎన్నికల కమిషన్‌ను అడిగాం. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు పారదర్శకంగా చేశాం. అక్రమాలు, ప్రలోభాలు, ఒత్తిళ్లు వీటన్నింటి మీద చర్చ జరగాల్సిందే. ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పు శిరోధార్యం. బీఆర్ఎస్‌కు ఓట్లు వేసినవారికి ధన్యావాదాలు చెబుతున్నాం. బీఆర్ఎస్‌ను ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు కోరుకున్నారు. మేము గెలుస్తామనే అనుకున్నాం. గెలవాలని కోరుకున్నాం. ఓడిపోయినప్పటికీ మాకు ఎలాంటి నిరాశ లేదు. మా పని మేము చేసుకుంటూనే పోతూ ఉంటాం’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
Read Also- Kalvakuntla Kavitha: జూబ్లీహిల్స్ ఎన్నికల కౌంటింగ్.. షాకింగ్ కామెంట్స్ చేసిన కవిత
లెక్కలతో సహా వివరించాం
‘‘అధికారంలో ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం చేశామనేది లెక్కలతో సహా జనాలకు వివరించాం. చాలా పారదర్శకంగా పనిచేశాం. కాంగ్రెస్ ఎగ్గొట్టినవాటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాం. హైడ్రా విధ్వంసం మీద. ప్రభుత్వ పెద్దల ద్వంద్వ ప్రమాణాలపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. ఆటో అన్నల సమస్యలపై కూడా గట్టిగా మాట్లాడాం. మా పార్టీ ఎన్నికల ప్రచారాన్ని చాలా హుందాగా నిర్వహించింది. తద్వారా ప్రభుత్వం కూడా మాట్లాడక తప్పని అనివార్యత కల్పించాం. ఇదివరకు రెండేళ్లలో ఒక్కసారిగా సమీక్ష చేయని ముఖ్యమంత్రి ఉపఎన్నిక నేపథ్యంలో ఆరు గ్యాంటీలపై సమీక్ష చేశారంటే మా విజయమే. అజహారుద్దీన్‌కి మంత్రి పదవి ఇచ్చింది కూడా మా ఒత్తిడితోనే’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
హుందాగా పోరాడం
‘‘బీఆర్ఎస్ పార్టీ 5 ఉప ఎన్నికల్లో గెలిచింది. ఒక రెండింట్లో మాత్రం ఓడిపోయాం. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఉపఎన్నిక గెలవకపోయినా 2023 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మధ్యలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఒకటి, రెండు కార్పొరేటర్ స్థానాలు మాత్రమే గెలిచింది. వీటన్నింటినీ ఒకసారి గుర్తుచేసుకోవాలి. ఈ ఎన్నికలో ప్రజల వాదనను బలంగా వినిపించగలిగాం. ప్రజల సమస్యలు, ఆరు గ్యారంటీల అమలు విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాం. హామీలను ఎగవేతను బాకీకార్డుల రూపంలో జనాల్లోకి తీసుకెళ్లాం. ప్రజల సమస్యలపై చర్చ జరిగేలా చేశాం. అది బీఆర్ఎస్ సాధించిన విజయంగా భావిస్తున్నాం. మేము అనవసర అంశాల జోలికి పోలేదు. కులం, మతం పేరిట డైవర్సన్ పాలిటిక్స్ చేయలేదు. బూతులు మాట్లాడాలేదు. చాలా హుందాగా కొట్లాడాం. ప్రజలకు అవసరమైన పాయింట్లను చర్చకు పెట్టాం. కాంగ్రెస్, బీజేపీ ఎంత కవ్వించినా సంయమనం పాటించాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Also- Rashmi Gautam: జూబ్లీహిల్స్ బై పోల్ రిజల్ట్స్.. సంచలన పోస్ట్ పెట్టిన యాంకర్ రష్మి
