Someshwara Temple: బెంగళూరు నగరంలోని అత్యంత పురాతన దేవాలయాల్లో చోళుల కాలానికి చెందిన సోమేశ్వర స్వామి ఆలయం ఒకటి. అయితే ఈ ఆలయంలో గత కొంత కాలంగా వివాహాలు జరిపించడం లేదు. ఆలయ పురోహితులు పూజల్లో కంటే కోర్టుల చుట్టూ ఎక్కువగా తిరుగుతుండటంతో ఆలయంలో వివాహాలపై అప్రకటిత నిషేధాన్ని విధించారు. దశాబ్దాల కాలంగా వేలాది జంటలను ఒక్కటి చేసిన ఈ ఆలయంలో ఇటీవల కాలంలో ఒక్క వివాహం జరిపించకపోవడం భక్తులను గందరగోళానికి గురిచేస్తోంది.
2 ఏళ్లలో 50 పైగా విడాకులు
12వ శతాబ్దానికి చెందిన హలసూరు సోమేశ్వర ఆలయం.. శైవ భక్తులకు ఎంతో పవిత్రమైనది. గతంలో ఏటా వందలాది వివాహాలు ఈ ఆలయంలో జరుగుతుండేవి. అయితే ఇటీవల కాలంలో ఇక్కడ పెళ్లి చేసుకున్న జంటలు.. విడాకుల కోసం కోర్టులకు వెళ్తుండటంతో దాని ప్రభావం ఆలయంలోని అర్చకులపై పడింది. గత రెండేళ్లలో 50కి పైగా విడాకులకు సంబంధించిన ఫిర్యాదులను ఆలయ అధికారులు స్వీకరించవలసి వచ్చింది. దీంతో ఆలయ ప్రతిష్టను కాపాడటంలో భాగంగా ఇకపై సోమేశ్వర దేవాలయంలో పెళ్లిళ్లు జరిపించరాదని దేవాలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
నకిలీ పత్రాలతో పెళ్లిళ్లు
పెళ్లిళ్లపై అప్రకటిత నిషేధంపై ఆలయ కమిటీ ప్రధాన పరిపాలన అధికారి వి. గోవింద రాజు స్పందించారు. ముఖ్యంగా ప్రేమ వివాహాల కారణంగా మరిన్ని సమస్యలను తాము ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ‘చాలా జంటలు ఇంటి నుండి పారిపోయి నకిలీ పత్రాలతో పెళ్లి చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల తర్వాత వారి తల్లి దండ్రులు వచ్చి గొడవకు దిగుతున్నారు. కొన్ని సందర్భాల్లో కోర్టు కేసులు కూడా దాఖలవుతున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీసే అవకాశమున్నందున ఆలయంలో వివాహాలు జరిపించడం లేదని వి. గోవింద రాజు స్పష్టం చేశారు.
Also Read: CM Revanth Convoy: సీఎం కాన్వాయ్‌లో ప్రమాదం.. రేవంత్‌కు త్రుటిలో తప్పిన ముప్పు
అపవాదు తొలగించడంలో భాగంగా..
అంతేకాదు తమ నిర్ణయాన్ని తెలియజేస్తూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు సైతం ఆలయ అధికారులు ప్రత్యేక లేఖను పంపారు. అందులో మరికొన్ని అంశాలను ప్రస్తావించారు. ‘విడాకుల కేసుల్లో సాక్షులుగా పురోహితులను పిలవడం వల్ల తరుచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భక్తుల్లోనూ దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయంలో పెళ్లి చేసుకుంటే విడాకులు తీసుకుంటారన్న అపవాదు కూడా స్థానికంగా పెరిగిపోతోంది. ఆలయ ప్రతిష్ఠను కాపాడే చర్యల్లో భాగంగా వివాహాలు చేయకూడదని నిర్ణయించాం’ అని ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు తెలియజేశారు.

