GSAT 7R satellite: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రతిష్టాత్మక ప్రయోగాలకు వేదికగా నిలిచే ఏపీలోని శ్రీహరికోట మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. ఇస్రో శాస్త్రవేత్తలు బాహుబలిగా అభివర్ణించే శక్తిమంతమైన ఎల్‌వీఎం3-ఎం5 (లాంచ్ వెహికల్ మార్క్-3 – మిషన్ 5) రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. భారత అంతరిక్ష రంగంలో మైలురాయిగా నిలవబోతున్న ఈ ప్రయోగం ఆదివారం (నవంబర్ 2) సాయంత్రం సరిగ్గా 5:26 గంటలకు జరగనుంది. జీశాట్-7ఆర్ (GSAT 7R satellite:) అనే అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఈ మిషన్ ముఖ్య లక్ష్యమని ఇస్రో వెల్లడించింది. జీశాట్-7ఆర్ ఉపగ్రహాన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో ఇంజనీర్లు, శాస్త్రవేత్తల బృందంచే తయారు చేసింది. ఈ ప్రయోగం దేశ రక్షణ, కమ్యూనికేషన్ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషించనుంది.
కౌంట్‌డౌన్ మొదలు..
ప్రతిష్టాత్మకమైన ఈ ప్రయోగం కోసం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని (SDSC SHAR) రెండో ప్రయోగ వేదికపై ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రాకెట్, శాటిలైట్ స్థితిని శాస్త్రవేత్తలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 5.26 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది.
Read Also- Bigg Boss Telugu 9: మాధురి అలక.. ప్యాక్ యువర్ బ్యాగ్ పవన్.. రామూ రాథోడ్ నవ్వుల నజరానా
జీశాట్-7ఆర్ శాటిలైట్ ప్రత్యేకతలు ఇవే
జీశాట్-7ఆర్ కమ్యూనికేషన్ శాటిలైట్ సుమారుగా పదేళ్లపాటు మన దేశానికి సేవలు అందించనుంది. ప్రధానంగా భారత సాయుధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లకు చెందిన కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. ఈ ఉపగ్రహం ద్వారా మెరుగైన బ్యాండ్‌విడ్త్, సురక్షితమైన, నిరంతర ఇంటర్నెట్ సేవలు అందుతాయి. అంతేకాదు, కమ్యూనికేషన్ లింక్‌లు కూడా అందుబాటులోకి వస్తాయి. దేశవ్యాప్తంగా, సరిహద్దు ప్రాంతాలలో, సముద్ర జలాల్లో కూడా మెరుగైన కమ్యూనికేషన్ సదుపాయాలను అందించగల సామర్థ్యం ఈ శాటిలైట్‌కు ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ శాటిలైట్ సేవలు అందుబాటులోకి వస్తే, భారత రక్షణ వ్యవస్థ పర్యవేక్షణ, ఆపరేషన్ సామర్థ్యాలు మరింత మెరుగవుతాయి. ఈ ప్రయోగంలో విజయం సాధిస్తే అంతరిక్ష సాంకేతికతలో భారతదేశం సాధించిన స్వావలంబనకు నిదర్శనగా నిలుస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అలాగే, ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత సామర్థ్యానికి దర్పణంగా నిలుస్తుందని అంటున్నారు.
Read Also- Yadadri Collector: జిల్లా కలెక్టర్ చిత్రపటానికి పాలాభిషేకం.. ఆయన చేసిన మంచిపని ఏంటో తెలుసా?
‘బాహుబలి’ ప్రత్యేకతలు ఇవే
శక్తిమంతమైన ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు బాహుబలి అని అభివర్ణిస్తుంటారు. ఇస్రోకు చెందిన అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన లాంచర్లలో ఇదొకటి. సుమారు 4 టన్నుల బరువున్న ఉపగ్రహాలను సైతం మోసుకెళ్లి జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టగలిగే సామర్థ్యం దీనికి ఉంది. ఈ శక్తి సామర్థ్యం కారణంగానే దీనిని బాహుబలి రాకెట్ అని అభివర్ణించారు. ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్ 3 దశలుగా ఉంటుంది. మొదటి దశలో ఘన ఇంధనం ఉండే రెండు బూస్టర్‌లు భారీ థ్రస్ట్‌ను అందిస్తాయి. రెండో దశలో ద్రవ ఇంధనంతో కూడిన కోర్ స్టేజ్, మూడో దశలో క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ ఉంటాయి. క్రయోజెనిక్ ఇంజన్ అత్యంత ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తుంది.
