Shubhanshu Shukla: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆక్సియమ్ 4 మిషన్ లో భాగంగా ఆయన రోదసిలో అడుగుపెట్టారు. ఈ మిషన్ కు శుభాంశు గ్రూప్ కెప్టెన్ కాగా.. పెగ్గి విట్నస్, స్లావోష్ ఉజ్నాంస్కీ, టిబోర్ కపు ఆయన బృందంలో సభ్యులుగా ఉన్నారు. అయితే ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఐఎస్ఎస్ లో పరిశోధనల అనంతరం జులై 10న శుభాంశు భూమికి తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. అయితే వారి రాక పోస్ట్ పోన్ అయినట్లు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) ప్రకటించింది.
వాయిదాకు కారణాలు ఇవే
శుభాంశు శుక్లా చేపట్టిన ఆక్సియమ్ 4 మిషన్ (Axiom‑4 Mission)ను అనూహ్యంగా పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం 14 రోజుల అనంతరం శుభాంశు బృందం భూమికి తిరిగి రావాల్సి ఉండగా.. దానిని 18 రోజులకు పొడిగించినట్లు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) వెల్లడించింది. వారి బృందం జూలై 14 వరకు అంతరిక్ష కేంద్రం (ISS)లోనే ఉండనున్నట్లు పేర్కొంది. ఫ్లోరిడా తీరంలోని ప్రతికూల వాతావరణ పరిస్థితులు, స్పేస్‌క్రాఫ్ట్ సంసిద్ధంగా లేకపోవడం, ISSలో సాంకేతిక సమస్యలు (ప్రెషర్ లీక్‌లు వంటివి) కారణాలతో శుభాంశు టీమ్ రాక వాయిదా పడినట్లు ఈఎస్ఏ అంచనా వేసింది.
రైతుగా మారిన శుభాంశు
ఆక్సియమ్ 4 మిషన్ లో భాగంగా అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన శుభాంశు.. అక్కడ వివిధ పరిశోధనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఆయన రైతు అవతారం ఎత్తారు. రోదసిలో గురుత్వాకర్షణ లేని పరిస్థితుల్లో మెంతి, పెసర సాగుపై ఉండే ప్రభావాలపై అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా చిన్నపాటి గాజు పాత్రల్లో మెంతి, పెసర విత్తనాలను వేసి.. ఐఎస్‌ఎస్‌లోని నిల్వ ఫ్రీజర్‌లోఉంచి, జీరో గ్రావిటీలో అవి ఏ విధంగా మొలకెత్తుతాయనే విషయాన్ని అధ్యయనం చేశారు. వాటికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. ధార్వాడ్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల సహకారంతో శుక్లా ఈ ప్రయోగాన్ని చేశారు.
Also Read: Budget friendly Luxury Interior: మీ ఇంటికి రిచ్ లుక్ కావాలా? ఈ టాప్-10 చిట్కాలు ఫాలో అవ్వండి!
దేశం గర్వించేలా
అంతకుముందు యాక్సియం-4 మిషన్ ప్రయోగం ద్వారా.. భారత శుభాంశు శుక్లా భారత్ తరపున కొత్త చరిత్ర సృష్టించారు. 41 ఏళ్ల తర్వాత రోదసిలో అడుగుపెట్టబోతున్న తొలి వ్యోమగామిగా నిలిచారు. 1984లో సోవియట్ యూనియన్‌కు చెందిన ఇంటర్‌కాస్మోస్ కార్యక్రమం కింద సోయుజ్ టి-11 వ్యోమనౌకలో రాకేశ్‌శర్మ (Rakesh Sharma) అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. ఆ తర్వాత భారత పౌరుడొకరు రోదసియానం చేయడం ఇదే తొలిసారి. ఆక్సియం 4 మిషన్.. నాసా – ఆక్సియం స్పేస్ సంస్థ మధ్య ఒక వాణిజ్య వెంచర్ కాగా.. ఇందులో శుంభాశు శుక్లాను పంపేందుకు ఇస్రో రూ.550 కోట్లు చెల్లించింది.