KA Paul: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై తాజాగా ఈడీ కేసులు నమోదు చేసింది. సినీ నటులు రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల, నిధి అగర్వాల్, శ్రీముఖి వంటి తదితరులపై సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. అయితే తారలపై ఈడీ కేసు పెట్టడాన్ని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్వాగతించారు. రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ వంటి వారిపై కేసులు పెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ (Nandamuri Bala Krishna) ప్రస్తావన తీసుకొచ్చిన ఆయన.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాలయ్య గురించి ఏమన్నారంటే?
సెలబ్రిటీలు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ కారణంగా కోట్లాది మంది యువకుల జీవితాలు నాశనమయ్యాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. బెట్టింగ్ యాప్ (Betting Apps) లపై చర్యలు తీసుకోవాలని తాను సుప్రీంకోర్టు (Supreme Court)లో కేసు వేసినట్లు గుర్తుచేశారు. ఈ సందర్భంగా బాలయ్య గురించి ప్రస్తావిస్తూ.. బీజేపీతో ఉండే వాళ్లను వదిలిపెట్టడం ఏంటని పాల్ ప్రశ్నించారు. బాలకృష్ణ పైన కేసు ఎందుకు నమోదు చేయలేదని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కూని చేసిందని ఆరోపించారు.
బాధ్యులపై చర్యలకు డిమాండ్
మరోవైపు హైదరాబాద్ లో జరిగిన సిగాచి ఘటన గురించి కేఏ పాల్ ప్రస్తావించారు. ఈ దుర్ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ సర్కార్ (CM Revanth Reddy)ను డిమాండ్ చేశారు. ఘటన జరిగి ఇన్ని రోజులు గడిచిన కంపెనీ ఓనర్లను ఎందుకు అరెస్ట్ చెయ్యలేదని పాల్ ప్రశ్నించారు. ఇదే ఘటన యూరోపియన్ దేశాల్లో జరిగి ఉంటే కఠిన చర్యలు ఉండేవని.. ఇండియాలో మాత్రం బెయిల్స్ వస్తాయని పేర్కొన్నారు.
ప్రధాని మోదీపై ఫైర్
ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi)పై సైతం కేఏ పాల్ విమర్శలు చేశారు. ‘ఢిల్లీ హైకోర్టు అవినీతి జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు దొరికితే చర్యలు తీసుకోవాల్సిందిపోయి సొంత రాష్ట్రానికి (గుజరాత్) బదిలీ చేశారు. గుజరాత్ లో వంతెన కూలి మరణిస్తే రూ. 2 లక్షల రూపాయలు మాత్రమే నష్టపరిహారం ప్రకటిస్తారా? పేద ప్రజల ప్రాణాలకు విలువ రూ.2 లక్షలేనా?. ఆధాని, అంబానీలకు రూ.15 లక్ష కోట్లు రుణమాఫీ చేస్తారు. కానీ పేదలకు మాత్రం ఏం చేయరు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు అమ్ముడు పోయారు’ అని అన్నారు.
Also Read: Damodara Rajanarsimha: పేదల వైద్యానికి ప్రజా సర్కార్ భరోసా.. 230 కోట్లతో నూతన ఆస్పత్రికి శంకుస్థాపన!
జూబ్లీహిల్స్ ఎన్నికలపై
మరోవైపు తెలంగాణలో సూపర్ సిక్స్ గురించి మాట్లాడితే నాలుక కోస్తామన్న రీతిలో ప్రవర్తిస్తారా అంటూ కేఏ పాల్ ఫైర్ అయ్యారు. ప్రజలు కోరుకుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిని నిలబెడతానని అన్నారు. ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ (BRS) తో పొత్తుపెట్టుకుంటే బీజేపీ (BJP)తో పెట్టుకున్నట్లేనని.. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని కేఏ పాల్ అన్నారు. 5 శాతం ఓటింగ్ కూడా లేని బీజేపీ 8 సీట్లు ఎలా గెలిచిందని ప్రశ్నించారు.