PM CM Removal Bill: లోక్‌సభలో బుధవారం తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రులు తీవ్ర నేర కేసుల్లో 30 రోజుల పాటు నిర్భందంలో ఉంటే వారి పదవులు తొలగించే 3 బిల్లులను లోక్ సభలో హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఇది జరిగిన కొద్ది నిమిషాలకే విపక్ష ఎంపీలు.. బిల్లులకు సంబంధించిన ప్రతులను చించేశారు. కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో బిల్లుల గురించి ప్రసంగిస్తున్న అమిత్ షా పైకి చింపేసిన పేపర్లను విసిరేశారు. దీంతో సభలో తీవ్ర కలకలం రేగింది.
అమిత్ షా ఏమన్నారంటే?
బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా లోక్ సభను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే కేంద్రం బిల్లులను ప్రవేశపెట్టిందన్న విపక్ష సభ్యులు ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపిస్తామని.. అక్కడ ప్రతిపక్షం సహా రెండు సభల సభ్యులు సూచనలు చేసే అవకాశం ఉంటుందని షా హామీ ఇచ్చారు. ‘తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ రాజ్యాంగ పదవుల్లో కొనసాగడం సిగ్గుచేటు’ అని ఈ సందర్భంగా అమిత్ షా అన్నారు.
VIDEO | Parliament Monsoon Session: Opposition MPs tear copies of three bills introduced by Union Home Minister Amit Shah and throw paper bits towards him in Lok Sabha. Speaker Om Birla adjourns the House amid uproar. #ParliamentMonsoonSession #MonsoonSession
(Source: Third… pic.twitter.com/aAY12oBIFV
— Press Trust of India (@PTI_News) August 20, 2025
ఆ రోజు నేనూ రాజీనామా చేశా: షా
అంతేకాదు తన స్వీయ అనుభవాన్ని సైతం అమిత్ షా లోక్ సభలో ప్రస్తావించారు. గుజరాత్ హోంమంత్రిగా ఉన్నప్పుడు తను అరెస్ట్ అయిన విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లేవనెత్తగా దానిపై షా మాట్లాడారు. తాను ఏ తప్పు చేయకపోయినా అరెస్టుకు ముందే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశానని షా అన్నారు. కోర్టు నిర్దోషిగా ప్రకటించిన తర్వాతే తిరిగి ప్రభుత్వంలోకి చేరానని గుర్తుచేశారు. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ రాజ్యాంగ పదవుల్లో కొనసాగడం సమంజసం కాదని షా పునరుద్ఘటించారు. మరోవైపు AIMIM నేత అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ నేతలు మనీష్ తివారి, కే.సి. వేణుగోపాల్ తదితరులు బిల్లులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ.. ఇవి రాజ్యాంగ విరుద్ధమని, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమని అభిప్రాయపడ్డారు. విపక్ష ఎంపీల ఆందోళనలు పలుమార్లు కొనసాగడంతో సభను మొదట మధ్యాహ్నం 3 గంటల వరకు, తర్వాత 5 గంటల వరకు వాయిదా వేశారు.
బిల్లు ఏం చెబుతోందంటే?
తీవ్రమైన నేర ఆరోపణలతో 30 రోజులపాటు జైలులో ఉంటే ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రులను పదవి నుంచి తొలగించేందుకు కేంద్రం ప్రవేశపెట్టే బిల్లు వీలు కల్పించనుంది. దీని ప్రకారం అరెస్ట్ అయ్యి 30 రోజులపాటు కస్టడీలో ఉన్న అనంతరం 31వ రోజు ఆటోమేటిక్ గా పదవిని కోల్పోనున్నారు. అయితే దీనిని కాంగ్రెస్ తో పాటు విపక్ష పార్టీ ఎంపీలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. హేయమైన బిల్లుగా అభివర్ణిస్తున్నారు. దేశాన్ని పోలీసుల రాజ్యంగా మార్చడం బీజేపీ ఉద్దేశ్యమని ఆరోపిస్తున్నారు.
Also Read: CM Revanth Reddy: హైదరాబాద్ పాతబస్తీ.. ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ.. సీఎం రేవంత్
విపక్ష ఎంపీల రియాక్షన్స్
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ ‘ఇది పూర్తిగా అన్యాయమైన నిర్ణయం. ఇది రాజ్యాంగానికి విరుద్ధం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. రేపు ఏ ముఖ్యమంత్రిపైన అయినా కేసు పెట్టి 30 రోజులు జైలులో ఉంచితే ఆయన పదవి కోల్పోతారు. ఇది అత్యంత దురదృష్టకరం’ అని వ్యాఖ్యానించారు. AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ ‘ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం. ప్రధానమంత్రిని ఎవరు అరెస్టు చేస్తారు? మొత్తంగా దేశాన్ని పోలీస్ రాజ్యంగా మార్చడమే బీజేపీ ఉద్దేశం. మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం’ అని అన్నారు. ‘ప్రభుత్వం కేవలం అధికార, సంపద నియంత్రణ కోసం మాత్రమే ప్రయత్నిస్తోంది. బాధ్యతా రాహిత్య ధోరణిని మేము ఖండిస్తున్నాం’ అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఎక్స్‌లో (Twitter) పోస్ట్ చేశారు.