CM Revanth Reddy: అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ గుర్తింపు పొందడానికి ఆనాటి కూలీ కుతుబ్ షాహీ నుంచి ఈనాటి వరకు ఎంతోమంది కృషి చేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. అనంతరం మాట్లాడారు. హైదరాబాద్ నగరం చారిత్రాత్మక నగరమన్న రేవంత్.. వారి కృషి వల్లే ప్రపంచ చిత్ర పటంలో ఒక గొప్పనగరంగా హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలు సాధించిందని చెప్పారు. ఆనాడు రాజీవ్ గాంధీ చేసిన కృషి వల్లే దేశంలో ఐటీ రంగం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.
హైదరాబాద్ కు వాటితోనే పోటీ
హైదరాబాద్ లో హైటెక్ సిటీ అభివృద్ధికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పునాది వేసిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ‘ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన కంపెనీలు ఇక్కడికి వచ్చాయంటే ఆనాటి ముఖ్యమంత్రుల దూరదృష్టినే కారణం. మూసీ ప్రక్షాళన, భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం కొంతమందికి ఇష్టం లేదు. ఆనాడు హైటెక్ సిటీ నిర్మాణాన్ని కూడా కొంతమంది అవహేళన చేశారు. హైదరాబాద్ నగరానికి బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలతో కాదు పోటీ.. టోక్యో, న్యూయార్క్ లాంటి నగరాలతో హైదరాబాద్ పోటీపడుతుంది’ అని రేవంత్ అన్నారు.
Also Read: BRS Party: బీఆర్ఎస్‌లో జూబ్లీహిల్స్ టెన్షన్.. సర్వేలకే పరిమితం.. గ్రౌండ్‌లోకి దిగేదెప్పుడు?
‘ఓల్డ్ సిటీకి పూర్వ వైభవం తీసుకొస్తాం’
తెలంగాణ సమగ్ర అభివృద్ధికి 2047 ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.హైదరాబాద్ పాతబస్తీ.. ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ అని పేర్కొన్నారు. ‘మూసీ ప్రక్షాళనతో ఓల్డ్ సిటీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం. గోదావరి జలాలను తీసుకొచ్చి 365 రోజులు మూసీలో నీరుండేలా రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తాం. మధ్యతరగతి ప్రజల కోసం నగరంలో రాజీవ్ స్వగృహ భవనాలను నిర్మించాలని నిర్ణయించాం. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగాలంటే నగర అభివృద్ధితో పాటు నగర విస్తరణ జరగాలి. ఇంటిగ్రేటెడ్ సబ్- రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చెప్పబోతున్నాం’ అని రేవంత్ అన్నారు.
Also Read: Drishyam Style Murder: దేశ రాజధానిలో సంచలన మర్డర్.. దృశ్యం తరహాలో భార్యను లేపేసిన భర్త!
వారు మనకు శత్రువే: సీఎం రేవంత్
ఆదాయాన్ని ఇచ్చే రిజిస్ట్రేషన్ కార్యాలయాల రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘సకల సౌకర్యాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్మించబోతున్నాం. ఫైవ్ స్టార్ హోటల్, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ స్థాయిలో సౌకర్యాలతో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు నిర్మిస్తాం. ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా కార్యాలయాలు నిర్మిస్తున్నాం. రాష్ట్ర అవతరణ దినోత్సవ నాటికి 11 ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి గారికి సూచిస్తున్నా. 2034 ప్రపంచమంతా హైదరాబాద్ నగరంవైపు చూస్తుంది. ఆ స్థాయిలో నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. నగర అభివృద్ధిని అడ్డుకునే వారు మనకు శత్రువే. అలాంటి దొంగల పని పట్టాల్సింది మీరే’ అని రేవంత్ అన్నారు.