Air India Crash: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఘోర విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. కుప్పకూలిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో ప్రయాణించిన 242 మంది ప్రయాణికుల్లో ఒక్కరు మినహా మిగతా వారంతా ప్రాణాలు కోల్పోయారు. విమానం కూలిన జేబీ మెడికల్ కాలేజీ విద్యార్థులు కూడా 30 మందికి పైగా చనిపోయారు. హాస్టల్ భవనాన్ని తాకిన వెంటనే విమానం ఒక్కసారిగా పేలిపోవడం, అందులో సుమారుగా 80-90 టన్నుల ఇంధనం ఉండడంతో భారీగా మంటలు ఎగసిపడి ప్రయాణికులంతా అగ్నికి ఆహుతయ్యారు. మృతదేహాలన్నీ కాలిపోవడంతో ఎవర్నీ గుర్తుపట్టే పరిస్థితి లేదు. అందుకే, డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా మృతుల గుర్తింపును నిర్ధారిస్తున్నారు.
మృతదేహాల గుర్తింపు ప్రక్రియలో భాగంగా గడిచిన ఆదివారం (జూన్ 15 ) ఓ కుటుంబం తీరని బాధతో తల్లిడిల్లింది. ఎయిరిండియా ప్రమాదంలో చనిపోయిన తన తల్లిదండ్రుల మృతదేహాలు సరిగ్గా ‘ఫాదర్స్ డే’ నాడే (గత ఆదివారం) నిర్ధారణ అయ్యాయని మింటెన్ పటేల్ అనే వ్యక్తి విచారం వ్యక్తం చేశాడు. తాము గుజరాత్‌కు చెందినవారిమని, 1978 నుంచి బ్రిటన్‌లోనే నివసిస్తున్నామని తెలిపాడు. విమాన ప్రమాదంలో తల్లిదండ్రులు అశోక్ భాయ్, శోభానబెన్ పటేల్ ఇద్దరూ చనిపోయారని వెల్లడించాడు. మరణం కూడా అమ్మానాన్నలను విడదీయలేకపోయిందని ఆయన కళ్లు చెమర్చాడు.
Read this- Suniel Narang: సినిమాలే చూడను.. వారి ముందు నేను ఎంత?.. కుబేర నిర్మాత సంచలన కామెంట్స్
మృతదేహాల గుర్తింపు ప్రక్రియలో భాగంగా, అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్‌లో డీఎన్ఏ టెస్టులు నిర్వహించారని మింటెన్ పటేల్ వివరించాడు. హాస్పిటల్ కంట్రోల్ రూమ్ వాళ్లు తనను లండన్ నుంచి ఇక్కడికి పిలిపించారని చెప్పాడు. తన సోదరుడు హెమెన్‌తో కలిసి ఇక్కడకు వచ్చానని, మృతదేహాల గుర్తింపు కోసం డీఎన్ఏ శాంపుల్స్ ఇచ్చామని తెలిపాడు.
ఫాదర్స్ డే నాడు నిర్ధారణ
ఫాదర్స్ డే అయిన జూన్ 15న తండ్రి అశోక్‌భాయ్‌తో తన డీఎన్ఏ శాంపుల్స్ సరిపోలాయంటూ హాస్పిటల్ నుంచి సమాచారం ఇచ్చారని మింటెన్ పటేల్ తెలిపాడు. ‘‘మృతదేహాన్ని ఇక్కడి నుంచి లండన్‌కు తీసుకెళ్లేందుకు ఫార్మాలిటీ ప్రక్రియలను పూర్తి చేశాం. అమ్మ శోభనాబెన్ పటేల్‌కు సంబంధించిన సమాచారం తెలియకపోవడంతో భారమైన హృదయంతో అక్కడి నుంచి కదిలాం. బయలుదేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో హాస్పిటల్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అమ్మ మృతదేహాన్ని కూడా గుర్తించారంటూ సమాచారం ఇచ్చారు. నాన్నది 98వ డీఎన్ఏ టెస్ట్ ఫలితం. అమ్మది 99వ టెస్ట్ రిపోర్ట్. డీఎన్ఏ టెస్ట్ ఫలితం తేలడానికి సహజంగానే సమయం ఎక్కువ పడుతుంది. అందుకే ఆలస్యమవుతోంది’’ అని మింటెన్ పటేల్ వివరించాడు.
Read this- Telangana Government: పెరుగుతున్న విద్యుత్ డిమాండ్.. సీఎండీలతో సమీక్ష
సమాచారం అందిన వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి బులిటెన్ బోర్డులో అమ్మ పేరుని చూసి కన్ఫార్మ్ చేసుకున్నామని చెప్పారు. కాలిపోయిన అమ్మ శరీర భాగాలు చూసి కళ్లలో నీళ్లు ఆగలేదని చెప్పారు. కాగా, మింటెన్ పటేల్, హెమెన్ తల్లితండ్రుల మృతదేహాలు యాదృశ్ఛికంగా వరుసగా 98వ, 99వ టెస్టుల్లో గుర్తింపు నిర్ధారణ జరిగింది. దీంతో, మరణంలో కూడా దంపతులు ఇద్దరూ పక్కపక్కనే ఉన్నారంటూ కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. ఘోర ప్రమాదమే అయినప్పటికీ ఏదైనా అద్భుతం జరుగుతుందని ఆశించామని, కానీ, అలాంటిదేమీ జరగలేదని చెప్పారు. తల్లిదండ్రులకు తమకు ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకాలు ఇచ్చారని చెప్పారు. విమానం ఎక్కడానికి ముందు కూడా మాట్లాడారని వివరించారు.