Air India plane Crash: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దుర్ఘటనలో 274 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదం అనంతరం భారీగా అగ్నికీలలు ఎగసిపడటంతో మృతదేహాలు ఎవరూ గుర్తుపట్టలేనంతగా కాలి పోయాయి. దీంతో కుటుంబ సభ్యుల డీఎన్ఏ ఆధారంగా బాడీలను గుర్తిస్తున్నారు. అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి (Ahmedabad Civil Hospital)లో మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఆ క్రమంలో ఆస్పత్రి వర్గాలు కీలక ప్రకటన చేశాయి.
92 బాడీలు గుర్తింపు
మృతుల గుర్తింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్న వేళ అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి సూపరిండెంట్ డా. రజనీశ్ పటేల్ (Dr. Rajnish Patel) మీడియాతో మాట్లాడారు. విమాన ప్రమాదంలో మరణించిన 274 మందిలో 92 మందిని గుర్తించినట్లు స్పష్టం చేశారు. అందులో 47 బాడీలను వారి కుటుంబ సభ్యులకు అందించినట్లు పేర్కొన్నారు. వారంతా అహ్మదాబాద్, వడోదర, ఖేడా, బోటాడ్, తదితర ప్రాంతాలకు చెందిన వారని వివరించారు. మృతుల కుటుంబాల నుంచి ఇప్పటివరకూ 250కి పైగా బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
నేడు విజయ్ రూపానీ అంత్యక్రియలు
అహ్మాదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ (Vijay Rupani) మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతదేహాన్ని సైతం డీఎన్ఏ టెస్ట్ (DNA Test) ఆధారంగా వైద్యులు గుర్తించారు. అనంతరం ఆయన పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా ఇవాళ ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నేడు గుజరాత్ (Gujarat) వ్యాప్తంగా సంతాప దినం నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. విజయ్ రూపానీ అంత్యక్రియలకు రాజ్ కోట్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
Also Read: Bomb Threat: హైదరాబాద్ బయల్దేరిన విమానానికి ముప్పు.. అత్యవసర ల్యాండింగ్!
హాస్టల్‌పై పడటంతో మరిన్ని మరణాలు
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 274 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో ఎయిర్ ఇండియా విమానంలో 242 ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 241 మంది ప్రాణాలు కోల్పోగా ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. విమానంలో 169 మంది భారత పౌరులు, 55 మంది బ్రిటన్ కు చెందిన వారు ఉన్నారు. అయితే విమానం బీజే వైద్య కళాశాల మెడికోల వసతి గృహంపై కుప్పకూలడంతో మరణాలు సంఖ్య మరింత పెరిగింది. హాస్టల్ లోని 24 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.