Israeli Iran War: ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తలు తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఫలితంగా ఈ దాడుల్లో రెండు దేశాల్లోని అమాయక ప్రజలు బలవుతున్నారు. ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడులకు సంబంధించి తాజాగా ఇరాన్ (Iran) కీలక ప్రకటన చేసింది. ఆ దేశం జరిపిన వైమానిక దాడుల్లో 224 మంది చనిపోయినట్లు వెల్లడించింది. 1200 మందికి పైగా గాయపడినట్లు ఇరాన్ కు చెందిన రివల్యూషనరీ గార్డ్ (Iran’s Revolutionary Guard) ఎక్స్ వేదికగా వెల్లడించింది.
మృతుల్లో మహిళలు, చిన్నారులు
ఇజ్రాయెల్ గత 65 గంటలుగా జరిపిన దాడుల్లో భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు ఇరాన్ ప్రకటించింది. మరణించిన 224 మంది మృత్యువాత పడగా.. 1,277 గాయపడినట్లు రివల్యూషనరీ గార్డ్ (Iran’s Revolutionary Guard) తన ఎక్స్ పోస్ట్ లో స్పష్టం చేసింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు వెల్లడించింది. మరణించిన వారిలో 90 శాతం మంది ఇరాన్ పౌరులే ఉన్నట్లు వివరించింది. అంతేకాకుండా దేశ నిఘా వ్యవస్థ (intelligence chief) మహమ్మద్ కాజెమి (Mohammad Kazemi) సహా మరో ఇద్దరు జనరల్ సైతం ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం చేసింది.
యుద్ధం కొనసాగుతుంది: ఇజ్రాయెల్
మరోవైపు ఇజ్రాయెల్ సైతం ఇరాన్ దాడుల్లో మృతి చెందిన వారి సంఖ్యను ప్రకటించింది. శుక్రవారం నుంచి జరుగుతున్న దాడుల్లో ఇప్పటివరకూ 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం చేసింది. 390 మంది గాయపడినట్లు తెలిపింది. ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ (Benjamin Netanyahu) ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఇరాన్ పై సైనిక చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఆ దేశం అణ్వాయుధాలను విడిచిపెట్టే వరకూ ఇజ్రాయెల్ (Israeli) వెనక్కి తగ్గబోదని పేర్కొన్నారు. బాలిస్టిక్ క్షిపణి – అణు బాంబు వల్ల తమ దేశానికి ఎలాంటి ముప్పు లేదని స్పష్టత వచ్చే వరకూ ఈ పోరు కొనసాగుతుందని వివరించారు.
Also Read: KTR: నేడు ఏసీబీ ఎదుటకు కేటీఆర్.. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ!
యుద్ధాన్ని ఆపుతా: ట్రంప్
ఇరాన్ – ఇజ్రాయెల్ ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)మరోమారు స్పందించారు. యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఇరు దేశాలు ఓ అంగీకారానికి రావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఆ దిశగా తానూ ప్రయత్నిస్తున్నట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తన మీడియేషన్ తో చాలా దేశాల మధ్య శాంతి నెలకొల్పానని.. కానీ క్రెడిట్ ను ఎప్పుడూ తీసుకోలేదని ట్రంప్ అన్నారు. అయితే ఇటీవల భారత్ – పాక్ (India vs Pak War) మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలోనూ తానే ఇరుదేశాల మధ్య యుద్ధాన్ని ఆపానని ట్రంప్ ప్రకటించుకున్నారు. కానీ, ఆ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ కొట్టిపారేయడం గమనార్హం.