BJP Caste Politics: సామాజిక సమీకరణాల్లో బీజేపీ వెనుకపడిందా? కులాల వారీగా లీడర్లను తయారుచేసుకోవడంలో కాషాయ పార్టీ నెమ్మదించిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఎందుకంటే పొలిటికల్‌గా సామాజిక సమీకరణాలకు అంతటి ప్రాధాన్యత ఉంటుంది. పొలిటికల్ పార్టీల్లో పదవుల కేటాయింపుల్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ కొందరికి కలిసివస్తాయి. ఆయా ప్రాంతాల్లో కుల జనాభా ఆధారంగా రాజకీయ పార్టీలు టికెట్లను కేటాయిస్తాయి. కాంగ్రెస్ తెలంగాణలో బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకుంది. ముఖ్యమంత్రి పీఠం రెడ్డి వర్గానికి అప్పగించింది. అలా అని మిగతా వర్గాలను దూరం పెట్టకుండా సామాజిక లెక్కల్లో ప్రాధాన్యత కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో నలుగురు దళితులకు అవకాశం దక్కింది.
గౌడ సామాజిక వర్గం నుంచి మహేశ్ కుమార్ గౌడ్‌ను పీసీసీ చీఫ్‌గా నియమించారు. పొన్నం ప్రభాకర్ గౌడ్ ను మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఇక ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి శ్రీహరికి క్యాబినెట్‌లో స్థానం దక్కింది. మరో మంత్రి కొండా సురేఖ బీసీ వర్గం నుంచి మంత్రివర్గంలో కంటిన్యూ అవుతున్నారు. మరోవైపు కులగణన పేరుతో కాంగ్రెస్ బీసీల మనుసుదోచే ప్రయత్నం చేసింది. ఇక ఇలాంటి సమీకరణాలు బీజేపీలో కనిపించడం లేదనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. సామాజిక లెక్కల్లో తెలంగాణ కమలనాథులు ఏ ఒక్క వర్గాన్ని ఓన్ చేసుకోలేకపోతున్నారనే విమర్శలు ఎదురవుతున్నాయి.
కమలం పార్టీ ఫెయిలైందనే విమర్శలు
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని కాషాయపార్టీ ప్రకటించింది. 2023 ఎన్నికల్లో మున్నూరు కాపు సామాజికవర్గం నుంచి బండి సంజయ్, ముదిరాజ్ సామాజిక వర్గానికి నుంచి ఈటల రాజేందర్ ను బీజేపీ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసినా సఫలీకృతం కాలేదు. అయితే బీసీల్లో ఈ రెండు కులాలు ధృడంగా ఉన్నట్లుగా బీసీల్లోని ఇతర కులాల్లో బలమైన నేతను తయారుచేసుకోవడంలో కమలం పార్టీ ఫెయిలైందనే విమర్శలు వస్తున్నాయి. బీజేపీలో గౌడ, యాదవ, దళిత, గిరిజన వర్గాల నుంచి చెప్పుకోదగ్గ స్థాయి నేతలు లేకపోవడం గమనార్హం.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కొనసాగుతున్న రెడ్డి సామాజికవర్గం బీజేపీని ఓన్ చేసుకోలేకపోతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్నూరుకాపు సామాజికవర్గం నుంచి కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్, ఎంపీలుగా డాక్టర్ లక్ష్మణ్, ధర్మపురి అరవింద్ తదితర నేతలున్నారు. బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో మున్నూరుకాపు వర్గం కొంత అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బలమైన సామాజికవర్గంగా చెప్పుకునే ముదిరాజ్ వర్గం నుంచి ఈటల రాజేందర్ కు బీజేపీ ప్రాధాన్యత కల్పిస్తున్నా ముదిరాజ్ వర్గం ఓన్ చేసుకోలేకపోతోంది.
Also Read: Solar Power Plants: రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు.. ప్రతి జిల్లాకు రెండు
బలమైన నేతల కోసం ఎదురు చూపులు
తెలంగాణకు చెందిన దళిత నేత బంగారు లక్ష్మణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా గతంలో పనిచేశారు. ఆ తర్వాత దళిత వర్గం నుంచి ఆ స్థాయిలో నేతలను కమలనాథులు సిద్ధం చేసుకోలేకపోతున్నారని టాక్. బీఆర్ అంబేద్కర్ జయంతిని నిర్వహించడం, రాజ్యాంగ పరిరక్షణ కోసం అవగాహన సదస్సులు పెట్టినా బీజేపీకి పెద్దగా మైలేజ్ రాలేదనే చర్చ పార్టీలో ఉంది. మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణ, మంద కృష్ణ మాదిగతో బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో లబ్ధిపొందినా ఆ వర్గం నుంచి బీజేపీలో బలమైన నేతలు కరువయ్యారు. గిరిజనవర్గం నుంచి లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్న గోడెం నగేశ్ పార్టీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు.
పార్టీలో బలమైన గిరిజన నేతలను తయారు చేసుకోలేకపోతుందనే విమర్శలను మూటకట్టుకుంటున్నారు. ఎన్నికల సమయంలో బలమైన నేతల కోసం ఆయా సామాజికవర్గాల నుంచి పక్కపార్టీల్లో నేతలను వెతుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది. అలా వచ్చిన నేతలు ఎన్నికలు కాగానే మళ్లీ వెళ్లిపోతున్నారు. దీంతో పార్టీలో కొన్ని సామాజికవర్గాల నుంచి బలమైన నేతలు తయారుకాలేకపోతున్నారనే విమర్శలున్నాయి. బలహీన నాయకత్వం ఉన్న సామాజికవర్గాల నేతలకు నామినేటేడ్ పోస్టులు అప్పగించి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సొంత పార్టీ నేతలను రెడీ చేసుకుంటే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు. ఈ సమస్యను కమలనాథులు ఎలా అధిగమిస్తారనేది చూడాలి.
Also Read: Boora Narsaiah Goud: రాహుల్ గాంధీపై.. బూర నర్సయ్య గౌడ్ సంచలన కామెంట్స్