Home Remedies: వాతావరణం మారుతున్నప్పుడు జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే, ఉష్ణోగ్రత మారినప్పుడు రోగనిరోధక శక్తి బలహీనమై, వైరల్ ఇన్‌ఫెక్షన్‌లు వస్తాయి. ఈ సమయంలో చాలా మంది మందులపై ఆధారపడతారు. కానీ, అవి పూర్తిగా తగ్గించలేవు. మందులపై ఆధారపడకుండానే కొన్ని సహజమైన పానీయాలు తాగడం వలన ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
1. అల్లం–తులసి టీ
అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు గొంతు నొప్పి, కఫం, ముక్కు దిబ్బడను తగ్గిస్తాయి. తులసి ఆకులు రోగనిరోధక శక్తిని పెంచి వైరల్ ఇన్‌ఫెక్షన్‌ల నుంచి కాపాడాతాయి.
తయారు చేసే విధానం: ఒక కప్పు నీటిలో కొన్ని తులసి ఆకులు, చిన్న ముక్క అల్లం వేసి 5–7 నిమిషాలు మరిగించండి. ఆ తర్వాత వడకట్టి ఒక టీ స్పూన్ తేనె వేసి వేడిగా తాగండి.
2. పసుపు పాలు
పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే పదార్థం యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది ఇన్‌ఫెక్షన్‌లను తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తుంది.
తయారు చేసే విధానం: వేడి పాలలో అర టీస్పూన్ పసుపు, చిటికెడు మిరియాల పొడి వేసి రాత్రి పడుకునే ముందు తాగండి. ఇది గొంతు నొప్పిని తగ్గించడమే కాకుండా మంచి నిద్రకు కూడా సహాయపడుతుంది.
3. తేనె–నిమ్మరసం
నిమ్మలో ఉండే విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తేనె గొంతును సున్నితంగా కప్పి ఇర్రిటేషన్ తగ్గిస్తుంది.
తయారు చేసే విధానం: ఒక గ్లాస్ వేడి నీటిలో 1/2 టీ స్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఉదయం ఖాళీ కడుపుతో తాగితే ఆరోగ్యం మంచిగా ఉంటుంది.
4. దాల్చినచెక్క–లవంగ కషాయం
దాల్చినచెక్క, లవంగం యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి శ్వాస సంబంధిత ఇన్‌ఫెక్షన్‌లను నుంచి మనల్ని కాపాడతాయి.
తయారు చేసే విధానం: నీటిలో చిన్న దాల్చిన చెక్క ముక్క, 2–3 లవంగాలు, కొన్ని మిరియాలు, చిన్న అల్లం ముక్క వేసి 10 నిమిషాలు మరిగించాలి. తర్వాత వడకట్టి వేడిగా తాగండి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ బాధ్యత వహించదని గమనించగలరు.
