Power Banks on Flights: మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉపయోగించే పవర్ బ్యాంకులు (Power Banks), లిథియం బ్యాటరీలపై పనిచేసే పరికరాలను విమానాల్లో వినియోగించడంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల్లో పవర్ బ్యాంకుల వినియోగంపై నిషేధం విధిస్తూ మార్గదర్శకాలను రూపొందించింది. విమాన ప్రయాణ భద్రతా నిబంధనలను కఠినతరం చేసింది. ప్రపంచవ్యాప్తంగా లిథియం బ్యాటరీలు వేడెక్కడం, లేదా మంటలు చెలరేగుతున్న వరుస ఘటనలను దృష్టిలో ఉంచుకొని నూతన మార్గదర్శకాలను రూపొందించింది.
ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను ఛార్జింగ్ పెట్టేందుకు పవర్ బ్యాంకులను వినియోగించడానికి వీల్లేదని (Power Banks on Flights) స్పష్టం చేసింది. అంతేకాదు, విమానాల్లో సీట్ల వద్ద ఉండే పవర్ అవుట్‌లెట్ల ద్వారా కూడా పవర్ బ్యాంకులను వాడకూదని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు నవంబర్‌లో జారీ చేసిన ‘డేంజరస్ గూడ్స్ అడ్వైజరీ సర్క్యులర్’లో మార్గదర్శకాలను డీజీసీఏ అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. నూతన నిబంధనల ప్రకారం, పవర్ బ్యాంకులు, విడి బ్యాటరీలను కేవలం హ్యాండ్ బ్యాగుల ద్వారా తీసుకొచ్చేందుకు మాత్రమే అనుమతిస్తారు. విమానంలోని ఓవర్‌హెడ్ బిన్‌లలో (సీట్ల పైన ఉండే లగేజీ అరలు) ఉంచకూడదని డీజీసీఏ స్పష్టం చేసింది. ఎందుకంటే, ఓవర్ హెడ్ బిన్‌లలో మంటలు అంటుకుంటే వాటిని గుర్తించడం, మంటలను ఆర్పివేయడం కష్టమని వివరించింది.
లిథియం బ్యాటరీలతో ప్రమాదం
భద్రతాపరంగా లిథియం బ్యాటరీలు ప్రమాదకరమైనవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ బ్యాటరీల నుంచి శక్తి ఎక్కువ విడుదలవుతుందని, వాటంతట అవే మండిపోతుంటాయని చెబుతున్నారు. కొన్నిసార్లు మంటలు కూడా చెలరేగుతాయని, ఎలక్ట్రానిక్ పరికరాలు పేలిపోతుంటాయని వార్నింగ్ ఇచ్చారు. లిథియం బ్యాటరీలు తీవ్రంగా వేడెక్కడం, ఎక్కువగా ఛార్జింగ్ పెట్టడం, బ్యాటరీ నలిగిపోవడం, క్వాలిటీ సరిగా లేకపోవడం, పాత బ్యాటరీలు ఇలాంటి వాటితో మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. ఇక విమానంలోని ఓవర్‌హెడ్ బిన్‌లలో ఈ బ్యాటరీలు పేలితే వెంటనే గుర్తించడం కూడా సాధ్యపడదని నిపుణులు చెబుతున్నారు. మంటలు గుర్తించే లోపు తీవ్ర ప్రమాదానికి దారితీసే అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు.
భయపెడుతున్న లిథియం బ్యాటరీలు
విమానయాన రంగంలో లిథియం బ్యాటరీలపై కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. వీటివల్ల జరుగుతున్న ప్రమాదాలు పెరుగుతుండడమే ఇందుకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో మార్గదర్శకాలను జారీ చేసినట్టుగా డీజీసీఏ పేర్కొంది. విమాన ప్రయాణికులు, సర్వీసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇదే సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం కూడా సర్వసాధారణంగా మారిపోయింది. కాబట్టి, బ్యాటరీల ముప్పు పొంచివుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ముందుగా అప్రమత్తంగా ఉండడం మంచిదని డీజీసీఏ భావించింది. అందుకే నూతన మార్గదర్శకాలు తీసుకొచ్చింది. పవర్ బ్యాంకులను గుర్తించేందుకు ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు చేపట్టాలని, సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేసింది. అంతేకాదు, ప్యాసింజర్లకు కూడా అవగాహన కల్పించాలని స్పష్టం చేసింది.

