Indigo Airlines: డిసెంబర్ నెలలో దేశీయ విమాన ప్యాసింజర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఎయిర్‌లైన్స్ సంస్థ ‘ఇండిగో’కు (Indigo Airlines) కేంద్ర ప్రభుత్వం (Central Govt) తగిన బుద్ధి చెప్పింది. సరైన ప్లానింగ్ లేకుండా, విమాన సర్వీసుల్లో అంతరాయం, వేల సంఖ్యలో సర్వీసులు రద్దు చేసి ఆ సంస్థకు ఏకంగా రూ.22 కోట్ల భారీ జరిమానాను కేంద్రం విధించింది. సంస్థ సిబ్బందిపై మితిమీరిన పనిభారం, సరైన ప్లానింగ్ లేకుండా కార్యకలాపాలను నడిపించడం, కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలను సరిగ్గా అమలు చేయకపోవడాన్ని కారణాలుగా చూపించింది. ప్యాసింజర్లకు కలిగిన తీవ్ర అసౌకర్యాన్ని పరిగణనలోకి తీసుకొని, విచారణ జరిపిన అనంతరం ఈ భారీ జరిమానా విధించింది.
Read Also- Maoist Encounter: మరో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు పాపారావు మృతి
సంస్థకు చెందిన సిబ్బందిని వారి సామర్థ్యానికి మించి, అస్సలు ఖాళీ లేకుండా ఉపయోగించుకోవడం కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తాయని దర్యాప్తులో కేంద్రం తేల్చింది. ఇండిగో యాజమాన్యం అనుసరించిన ఓవర్-ఆప్టిమైజ్డ్ విధానమే ఇందుకు కారణంగానే డిసెంబర్ నెలలో ప్యాసింజర్లు నానాఅవస్థలు ఎదుర్కొన్నారని తేల్చింది. సిబ్బంది అలసటను దృష్టిలో ఉంచుకోకుండా మితిమీరి వాడారని, అందుకే, అంతరాయం ఏర్పడినా ఏమీచేయలేని పరిస్థితికి దారితీసిందని వివరించింది.
సిబ్బంది సేవలను గరిష్ట సమయంపాటు వినియోగించుకునే విధంగా రోస్టర్ల రూపొందించినట్టు విచారణలో వెల్లడైంది. సిబ్బందికి విశ్రాంతి తీసుకునే సమయం దొరకకపోవడం, ఇతర ప్రతికూల పరిస్థితుల కారణంగా రోస్టర్ బ్యాలెన్స్ తప్పిందని పేర్కొంది. పైగా, నిబంధనలకు సంబంధించి ముందస్తు సన్నద్ధత లేకపోవడం, సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలు, కార్యాచరణలో వైఫల్యాలు ఇవన్నీ తీవ్ర అంతరాయానికి దారితీశాయని విచారణ కమిటీ పేర్కొంది. కాగా, సవరించిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనలను
సరైన రీతిలో అమలు చేయడంలో ఇండిగో సంస్థ విఫలమైంది. ఫలితంగా సుమారు 15 రోజుల పాటు వేలాది విమానాల రాకపోకలు దెబ్బతిన్నాయి. అనూహ్య రీతిలో ఎదురైన అంతరాయంతో విమాన ప్యాసింజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

