USA – India: భారత్ లో జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ నివసించే అమెరికన్లు లేదా పర్యాటకులకు ట్రంప్ సర్కార్ (Donald Trump Govt) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన లెవెల్ 2 ట్రావెల్ అడ్వైజరీ(Level 2 travel advisory)ని కొనసాగిస్తున్నట్లు యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ (US Department of State) తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో ఇచ్చిన అడ్వైజరీకి కొత్తగా కొన్ని అంశాలను జత చేసి.. భారత్ లో ముప్పు శాతం పెరిగినట్లు పేర్కొంది. భారత్ లో ఉగ్రవాద ముప్పు, నేరాల్లో గణనీయ పెరుగుదల కారణంగా అత్యంత అప్రమత్తత అవసరమని అమెరికన్ పౌరులను హెచ్చరించింది.
అత్యాచారం కేసులు పెరుగుతున్నాయి: అడ్వైజరీ
ట్రంప్ పాలనలోని అధికారులు, మహిళలు భారత్ లో ఒంటరిగా పర్యటించడం మానుకోవాలని యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ జారీ చేసిన లెవెల్ 2 అడ్వైజరీ సూచించింది. నేరాలు, ఉగ్రవాదం కారణంగా భారత్ లో అధిక జాగ్రత్తను పాటించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ‘అత్యాచారం కేసులు భారత్ లో గణనీయంగా పెరుగుతున్నాయి. పర్యాటక స్థలాలు, ఇతర ప్రాంతాల్లో హింసాత్మక నేరాలు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయి’ అని అడ్వైజరీ పేర్కొంది. జూన్ 16న నిర్వహించిన సాధారణ సమీక్ష నేపథ్యంలో ఇవి తమ దృష్టికి వచ్చాయని.. ఇందుకు అనుగుణంగా లెవెల్ 2 అడ్వైజరీని నవీకరిస్తున్నట్లు యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ వెల్లడించింది.
కశ్మీర్‌లో పర్యటించవద్దు
విదేశాల్లో పర్యటించే తమ పౌరుల క్షేమం కోసం యూస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్.. లెవల్ 2 అడ్వజరీ (అధిక జాగ్రత్తను పాటించండి)ని జారీ చేస్తుంది. ఈ క్రమంలో 2022లో తొలిసారి భారత్ లో పర్యటించే అమెరికన్లకు సైతం ఈ అడ్వైజరీ జారీ చేశారు. దీని ప్రకారం 2022 మార్చి 28, జులై 25, అక్టోబర్ 5న హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. 2023, 2024లోనూ లెవెల్ 2 వార్నింగ్స్ కొనసాగాయి. ఇటీవల చోటుచేసుకున్న పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో మరోమారు లెవెల్ 2 ట్రావెల్ అడ్వైజరీని యూఎస్ ప్రభుత్వం జారీ చేసింది. ముఖ్యంగా జమ్ము కశ్మీర్ లోని పర్యాటక ప్రాంతాలకు యాత్ర చేయవద్దని సూచించింది.
అమెరికన్ స్త్రీలు జాగ్రత్త
జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడులు, హింసాత్మక దాడుల వల్లే కలిగే అశాంతికి అవకాశముందని లెవెల్ 2 అడ్వైజరీ పేర్కొంది. కాశ్మీర్ లోయలోని పర్యాటక ప్రాంతాలైన శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గాం వంటి ప్రాంతాల్లో ఉగ్రదాడులకు అవకాశముందని అంచనా వేసింది. భారత ప్రభుత్వం సైతం విదేశీ పర్యాటకులను ఎల్ఓసీ వెంబడి ఉన్న కొన్ని ప్రాంతాలకు అనుమతించదని గుర్తుచేసింది. మరోవైపు అమెరికన్ స్త్రీలు.. గ్రామీణ ప్రాంతాలను విజిట్ చేసినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని అడ్వైజరీ నొక్కి చెప్పింది. అక్కడ ఏమైనా సమస్యలు తలెత్తితే అత్యవసర సేవలు అందించే సామర్థ్యం పరిమితంగా ఉంటుందని పేర్కొంది.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. ఏజెన్సీ రైతుల కష్టాలు తీరినట్లే.. త్వరలోనే పరిహారం!
మావోయిస్టుల గురించి కూడా..
భారత్ లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను సైతం లెవల్ 2 అడ్వైజరీ ప్రస్తావించింది. మావోయిస్టు తీవ్రవాద గ్రూపులు లేదా నక్సలైట్ల ముప్పు.. తూర్పు మహారాష్ట్ర నుండి ఉత్తర తెలంగాణ మీదుగా బెంగాల్ వరకూ విస్తరించి ఉందని పేర్కొంది. బిహార్, జార్ఖండ్, చత్తీస్ గఢ్, మేఘాలయ, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉందని అమెరికన్ పౌరులకు తెలిపింది. ప్రస్తుతం భారత్ లో ఉన్న పౌరులు.. జాగ్రత్తగా ఉండాలని.. తమ యాత్ర ప్రణాళికలను సమీక్షించుకోవాలని, ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సలహా ఇచ్చింది. చెల్లుబాటు అయ్యే వీసా లేటా ఈ-టూరిస్ట్ వీసాను కలిగి ఉండటం, పచ్చి ఆహారం లేదా ఫిల్టర్ చేయని నీటిని తీసుకోకపోవడం, ప్రజా రవాణాలో జాగ్రత్తగా ఉండటం ఉత్తమమని సూచించింది.