Swetcha Effect: దాదాపు 54 రోజులు మల్టీనేషనల్ మొక్కజొన్న క్రాస్ బ్రీడ్ విత్తన కంపెనీల ఆర్గనైజర్ల మోసాలపై ‘స్వేచ్ఛ’ వరుస కథనాలను ప్రచురించింది. వాటిపై రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ నడిచింది. ఈ క్రమంలోనే రైతులను మోసగించిన ఆర్గనైజర్లపై పీడీ యాక్ట్ కేసులు పెట్టాలని డిమాండ్లు సైతం వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే వారిపై సీడ్ యాక్ట్, ఎస్సీ ఎస్టీ కేసులు సైతం నమోదు అయ్యాయి. అయితే, వారంతా మండల కేంద్రాలను వదిలి హైదరాబాద్ చేరుకొని వివిధ నాయకుల ద్వారా పైరవీలు కొనసాగించారు.
లాబీయింగ్ గుట్టురట్టు
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారులు మనీ లాండరింగ్ కేసులకు సంబంధించి ఆర్గనైజర్లకు నోటీసులు అందజేశారు. దీనిపైనా ‘నోటీసుల డ్రామా’ శీర్షికతో ‘స్వేచ్ఛ’ కథనాన్ని ప్రచురించింది. సీడ్ బాంబ్ కథనాలు విపరీతమైన ప్రకంపనలు రేపడంతో ఆర్గనైజర్లు రాజకీయ నాయకుల వద్దకు వెళ్లి తమపై నమోదైన కేసులను తీసివేసేందుకు సైతం ప్రయత్నాలు సాగించారు. తెలంగాణ రాష్ట్రంలోనే అతి పురాతనమైన ప్రపంచ ఖ్యాతి పొందిన రామప్ప టూర్‌కు వచ్చిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వరకు కూడా ‘స్వేచ్ఛ’ ప్రచురించిన కథనాలతో రైతులు, ఆదివాసీ నవనిర్మాణ సేన సభ్యులు తీసుకెళ్లారు. ల్యాబ్ టు ల్యాండ్ పేరుతో ‘స్వేచ్ఛ’ ఇచ్చిన కథనంతో ఆర్గనైజర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.
Also Read: Samvidhan Hatya Diwas: బీజేవైఎం ఆధ్వర్యంలో యువజన సమ్మేళనాలు.. మనోహర్ రెడ్డి
ముందు నుంచి ‘స్వేచ్ఛ’ వరుస కథనాలు
ఓవైపు ఆర్గనైజర్లు తమ ఆరాచకాలను కొనసాగిస్తూనే వచ్చారు. ఈ క్రమంలో రైతులు కచ్చులపు చందర్రావు, లేఖం మధు కృష్ణ ఆత్మహత్య చేసుకున్నారు. వారికి కూడా ప్రభుత్వం నుంచి పరిహారం అందడంతో పాటు, విత్తన కంపెనీల ద్వారా పరిహారం చెల్లించాలని ‘స్వేచ్ఛ’ వరుస కథనాలు ప్రచురించింది. ఈ మేరకు స్థానిక మంత్రి ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడంపైనా ప్రశ్నించింది. తర్వాత నామమాత్రంగా చెక్కులను మంజూరు చేసి ఇంతవరకు వాటికి సంబంధించిన డబ్బులను బాధితులకు అందజేయలేదు. 2178 ఎకరాలలో రైతులకు తీవ్రమైన నష్టం జరిగిందని, రాజకీయ ఒత్తిళ్లతో స్థానిక కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు లేకుండా సమావేశమా అని ప్రశ్నిస్తూ కథనాలు ఇచ్చింది స్వేచ్ఛ. మొక్కజొన్న క్రాస్ బ్రీడ్ మల్టీ నేషనల్ కంపెనీల ఆగడాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చింది. ఈ విషయంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా పడకేసినా, ధైర్యంగా వార్తలు ఇచ్చింది. చివరకు ప్రభుత్వానికి అందెని నివేదిక ఆధారంగా 4 కంపెనీలు నష్టపరిహారం భరించాల్సిందేనని తేల్చారు. ఎట్టకేలకు ఆ కంపెనీలు పది రోజుల్లో రైతులకు పరిహారం అందించనున్నాయి. నష్టానికి తగ్గట్టు ఎకరానికి రూ.15 నుంచి రూ.85 వేల వరకు పరిహారం చెల్లించనున్నాయి.