US Shutdown: అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ లోకి వెళ్లిపోయింది. దాదాపు ఆరేళ్ల తర్వాత షట్ డౌన్ లోకి వెళ్లిపోవడంతో.. ప్రభుత్వ కార్యకలాపాలు బుధవారం నుంచి నిలిచిపోయాయి. నిధుల విడుదలకు సంబంధించిన రెండు బిల్లులను సెనేట్ లోని ప్రతిపక్ష డెమోక్రాట్లు తిరస్కరించడంతో ఇలాంటి ఆత్యయిక పరిస్థితి తలెత్తింది. ఫెడరల్ ఉద్యోగాల్లో మరోమారు కోత విధిస్తానంటూ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో డెమోక్రాట్లు ఈ విధంగా ప్రతిస్పందించడం గమనార్హం.
షట్ డౌన్ ప్రభావం..
సెనెట్ ఓటింగ్ లో 55-45 ఫలితంతో బిల్లు ఆమోదం పొందకపోవడంతో బుధవారం ఉదయం 12.01 గంటలకు అమెరికాలో షట్ డౌన్ మెుదలైంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు ఈ ప్రక్రియ అమల్లోకి వచ్చింది. షట్ డౌన్ కారణంగా అమెరికాలోని దాదాపు అన్ని ప్రభుత్వ సేవలు నిలిచిపోనున్నాయి. విమాన ప్రయాణాలు తగ్గిపోనున్నాయి. శాస్త్రీయ పరిశోధనలు ఆగిపోవడం.. అమెరికన్ సైనికులకు జీతం ఆలస్యం కావడం వంటి సమస్యలు తలెత్తనున్నాయి. అంతేకాదు షట్ డౌన్ మూలానా 7.5 లక్షల ఫెడరల్ ఉద్యోగులు తాత్కాలిక సెలవుల్లోకి వెళ్లిపోనున్నారు. దీని వల్ల ప్రభుత్వానికి రోజుకి సుమారు 400 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లనుంది.
షట్‌డౌన్ అంటే ఏమిటి?
అమెరికా ప్రభుత్వం రోజువారి ఖర్చులకు అవసరమైన నిధులకు ఆమోదం లభించకపోతే అన్ని విభాగాల పనులు నిలిపివేయబడతాయి. ఇలాంటి స్థితిని అమెరికాలో షట్ డౌన్ గా అభివర్ణిస్తారు. దీని ప్రభావం సోషల్ సెక్యూరిటీ, విమాన ప్రయాణాలు, నేషనల్ పార్క్‌లు వంటి రంగాలపై పడుతుంది. ప్రభుత్వం ఆధీనంలోని చాలా వరకూ ఏజెన్సీలు కాంగ్రెస్ ఆమోదించిన బడ్జెట్ లేకుండా పనిచేయలేవు. నిధులు లేకపోతే ఆ విభాగాలు ఆటోమేటిక్ గా మూతపడతాయి. ఉద్యోగుల జీతాలకు అవసరమైన నిధులు కూడా అందుబాటులో ఉండని పరిస్థితుల కారణంగా చాలా మంది కార్యాలయాలకు రారు. వారి జీతం కూడా కొద్దిరోజుల పాటు హోల్డ్ లో పడిపోతుంది.
షట్‌డౌన్‌లో ఏం జరుగుతుంది?
చట్టం ప్రకారం నిధులు నిలిచిపోయిన తర్వాత అత్యవసరం కానీ ఉద్యోగులను తాత్కాలిక సెలవులపై పంపేస్తారు. అయితే ప్రాణ, ఆస్తులను రక్షించే ఉద్యోగులు (ఉదా: వైద్య సిబ్బంది, పోలీసులు, ఆర్మీ) మాత్రం షట్ డౌన్ అమల్లో ఉన్న సమయంలోనూ పనిచేస్తారు. కానీ వారికి షట్‌డౌన్ పూర్తయిన తర్వాతే జీతం లభిస్తుంది. షట్ డౌన్ ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలను మేనేజ్ మెంట్ అండ్ బడ్జెట్ వైట్ హౌస్ కార్యాలయం విడుదల చేస్తుంది. తాజా పరిస్థితులకు సంబంధించిన ఉత్తర్వులు మంగళవారం సాయంత్రమే జారీ చేయబడ్డాయి. ఈ షట్ డౌన్ ప్రక్రియ.. రోజుకు 7.5 లక్షల మంది ఉద్యోగులపై ప్రభావం చూపనుందని కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీసు అంచనా వేసింది.
Also Read: Bigg Boss 9 Telugu Promo: తనూజ మూతిపై దాడి.. హోస్‌లో మళ్లీ రచ్చ రచ్చ.. ప్రోమో చూస్తే గూస్ బంప్సే!
షట్‌డౌన్‌లో కూడా కొనసాగే సర్వీసులు
FBI దర్యాప్తుదారులు, CIA అధికారులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, విమానాశ్రయ భద్రతా అధికారులు పని చేస్తూనే ఉంటారు. సైనికులు కూడా విధులు నిర్వర్తిస్తారు. మాండేటరీ ఖర్చుతో నడిచే కార్యక్రమాలు (ఉదా: సోషియల్ సెక్యూరిటీ, మెడికేర్) కొనసాగుతాయి. వృద్ధులకు మెడికేర్ ద్వారా వైద్య సేవలు అందుతూనే ఉంటాయి. వెటరన్స్ అఫైర్స్ (VA) ఆరోగ్య సేవలు, ఆసుపత్రులు, ఔట్‌పేషంట్ క్లినిక్‌లు, లాభాలు, జాతీయ సమాధి స్థలాల్లో అంత్యక్రియలు కూడా నిరాటంకంగా కొనసాగుతాయి.