ibomma Warning: తెలుగు చిత్ర పరిశ్రమను ఆర్థికంగా చిన్నాభిన్నం చేస్తున్న పైరసీ భూతంపై హైదరాబాద్ పోలీసులు యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశంలోని అతిపెద్ద పైరసీ గుట్టును ఇటీవల పోలీసులు రట్టు చేశారు. ఈ క్రమంలోనే త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులను సైతం పట్టుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఐబొమ్మ ఒక బహిరంగ ప్రకటనను విడుదల చేసింది. టాలీవుడ్ సహా హైదరాబాద్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది. తమ మీద ఫోకస్ పెడితే తాము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తామంటూ హెచ్చరించింది.
భారీ రెమ్యూనరేషన్లు అవసరమా?
ఐబొమ్మ విడుదల చేసిన బహిరంగ ప్రకటనలో టాలీవుడ్ పై సంచనల ఆరోపణలు చేసింది. హీరో, హీరోయిన్ల భారీ రెమ్యూనరేషన్ల గురించి సూటిగా ప్రశ్నించింది. ‘హీరోలకు అంత రెమ్యూనరేషన్ అవసరమా?. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వాళ్లు ఏమైపోతారో అని కబుర్లు చెప్పకండి. వాళ్లకి మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసినా వస్తాయి. కానీ మీ హీరోకి హీరోయిన్ కి వస్తాయా?. సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం రెమ్యూనరేషన్స్, విదేశాలలో షూటింగ్స్, ట్రిప్స్ కి ఖర్చు పెడుతున్నారు. ఇండియాలో షూటింగ్స్ చేస్తే ఖర్చు తగ్గుతుంది కదా. ఇక్కడి వాళ్లకి ఉపాధి కలుగుతుంది కదా’ అని ఐబొమ్మ నిలదీసింది.
Also Read: Bank Holidays 2025: బిగ్ అలెర్ట్.. అక్టోబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు.. ఈ తేదీల్లో అస్సలు వెళ్లొద్దు!
‘మేమంతా మంచి వాళ్లం కాదు’
సినిమా కోసం అనవసర బడ్జెట్ పెట్టి.. దాని రికవరీ కోసం ప్రేక్షలపై అదనపు భారం మోపుతున్నారు. ‘డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ ను కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు. చివరికి మధ్యతరగతి వాడే బాధపడుతున్నాడు. మా వెబ్ సైట్ పై ఫోకస్ చేయడం ఆపండి. లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ పైరసీ వెబ్ సైట్లపై దృష్టి పెట్టండి. ఐబొమ్మ అనేది సిగరేట్ నుంచి ఈ-సిగరేట్ కు యూజర్స్ ను మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్ కు నా రియాక్షన్ ఉంటుంది’ అని హెచ్చరించింది. ‘మేమంతా మంచి వాళ్లం కాదు. బురదలో రాయి వేయకండి. మేము ఏ దేశంలో ఉన్న తెలుగు వారికోసం ఆలోచిస్తాం’ అంటూ రాసుకొచ్చింది.