Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్ అంతరంగిక వ్యవహారాల్లో తలదూరుస్తూ గత కొన్ని రోజులుగా కీలక వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన మరోమారు సంచలన కామెంట్స్ చేశారు. రష్యా నుంచి భారత్.. చమురు కొనుగోలును శనివారం నుంచి ఆపేసిందని ట్రంప్ అన్నారు. అదే నిజమైతే ‘మంచి నిర్ణయం’ అని పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ పై పెనాల్టీ విధిస్తామంటూ అమెరికా ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ట్రంప్ ఏమన్నారంటే?
‘భారత్ ఇకపై రష్యా నుండి చమురు కొనబోవడంలేదు అని నేను విన్నాను. అది నిజమా? కాదా? నాకు తెలియదు. కానీ అది ఒక మంచి అడుగు. ఏమి జరుగుతుందో చూద్దాం’ అని ట్రంప్ విలేకరులతో అన్నారు. అయితే శుక్రవారం భారత విదేశాంగ మంత్రిత్వశాఖ (MEA) స్పందిస్తూ భారత దేశం చమురు కొనుగోలు నిర్ణయాలు.. మార్కెట్ పరిస్థితులు, జాతీయ ప్రయోజనాల ఆధారంగా ఉంటాయని స్పష్టం చేసింది. రష్యా నుండి చమురు దిగుమతులు ఆపివేసినట్టు ఏదైనా ప్రత్యేక సమాచారం తమ వద్ద లేదని తెలియజేసింది. గత వారం రోజులుగా రష్యా నుండి భారత రిఫైనరీలు చమురు కొనుగోలు చేయడం లేదన్న ప్రచారం నేపథ్యంలో MEA ప్రతినిధి రంధీర్ జైస్వాల్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
#WATCH | “I understand that India is no longer going to be buying oil from Russia. That’s what I heard, I don’t know if that’s right or not. That is a good step. We will see what happens…” says, US President Donald Trump on a question by ANI, if he had a number in mind for the… pic.twitter.com/qAbGUkpE12
— ANI (@ANI) August 1, 2025
చమురుపై రాయితీలు తగ్గింపు!
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకపోవడం వెనక కొన్ని కారణాలు ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. గత కొంతకాలంగా చమురుపై భారత్ కు ఇస్తున్న రాయితీలను రష్యా తగ్గిస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు రష్యా నుండి చమురు కొనుగోలు చేయవద్దని అమెరికా హెచ్చరించడంతో భారత్ వెనక్కి తగ్గినట్లు కూడా ట్రేడ్ నిపుణులు అంచనావేస్తున్నారు. ఇదిలా భారత్.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతి దారుగా ఉంది. సముద్ర మార్గం ద్వారా రష్యా నుంచి చమురును కొనుగోలు చేసే అతిపెద్ద దేశం కూడా భారత్ కావడం గమనార్హం.
అమెరికా హెచ్చరికలు
ఇదిలా ఉంటే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని తొలి నుంచి అమెరికా వ్యతిరేకిస్తూ వస్తోంది. అధ్యక్షుడు ట్రంప్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో భారత్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు సైతం చేశారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ.. భారత్ తక్కువ ధరకు రష్యా చమురు కొనుగోలు చేస్తోందని విమర్శించారు. ఈ క్రమంలోనే భారత్ పై 25% ప్రతీకార సుంకాలు విధించడంతో పాటు రష్యా నుంచి చమురు దిగుమతి చేస్తున్నందుకు పెనాల్టీ సైతం విధిస్తామని ట్రంప్ బహిరంగంగా ప్రకటించారు.
Also Read: R. Krishnaiah: బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అడ్డుపడుతుందా? ఆర్. కృష్ణయ్య రియాక్షన్ ఇదే!
రష్యాకు నో ఆర్డర్స్!
అంతర్జాతీయ మీడియా రాయిటర్స్ కథనం ప్రకారం.. దేశంలోని ప్రభుత్వ రిఫైనరీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, మంగళూరు రిఫైనరీ పెట్రోకెమికల్ లిమిటెడ్.. గత వారం రష్యా నుండి చమురు కొనుగోలు ఆర్డర్లు ఇవ్వలేదు. దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ సమాధానాన్ని రాయిటర్స్ కోరగా సంబంధిత అధికారులు స్పందించలేదని తెలుస్తోంది. ఈ నాలుగు ప్రభుత్వ రిఫైనరీలు సాధారణంగా రష్యా చమురును ‘డెలివరీ బేసిస్’ పై కొనుగోలు చేస్తాయి. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మధ్యప్రాచ్యం చమురు (అబుదాబీ ముర్బాన్ క్రూడ్) పశ్చిమ ఆఫ్రికా చమురు వంటి స్పాట్ మార్కెట్ వనరులపై ఆయా సంస్థలు చూస్తున్నట్లు తెలుస్తోంది.