BJP Telangana: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పూర్తిగా వారికే ఇవ్వాలనే డిమాండ్‌తో బీజేపీ మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టనుంది. ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చేపడుతున్న ఈ ధర్నాకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. అలాగే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ జాతీయ, రాష్ట్ర కార్యవర్గసభ్యులు పాల్గొననున్నారు.
Also Read: Hyderabad Police: ఉద్యోగాల పేర మోసాలు.. సైబర్ క్రిమినల్స్ తో జతకట్టి నిందితున్ని అరెస్ట్ చేసిన సైబర్ క్రైం
కాగా, ధర్నాకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం బీజేపీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, ఆనంద్ గౌడ్, ఎన్వీ సుభాశ్ సందర్శించారు. ఈ సందర్భంగా కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కాదు, ముస్లిం డిక్లరేషన్ అంటూ ఫైరయ్యారు. 10 శాతం ముస్లింలను బీసీల్లో కలిపి విచ్ఛిన్నం చేసే కుట్ర అంటూ మండిపడ్డారు. రిజర్వేషన్లు పూర్తిగా బీసీలకే ఇవ్వాలని, ముస్లింలకు 10 శాతం ఇవ్వొద్దని అన్నారు. కాంగ్రెస్ వైఖరికి నిరసనగా మహాధర్నా చేపడుతున్నట్లు చెప్పారు. ధర్నా పేరుతో ఢిల్లీలో కాంగ్రెస్ చేసే కపట నాటకాన్ని బయటపెడతామని పేర్కొన్నారు.