US bombs Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నంత పని చేశారు. ఇరాన్‌పై యుద్ధంలో ఇజ్రాయెల్‌తో చేతులు కలిపారు. ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా బాంబులతో విరుచుకుపడింది. బీ-2 స్పిరిట్ బాంబర్లతో ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై (US bombs Iran) దాడులు చేసింది. అమెరికా గతంలో ఎప్పుడూ ఉపయోగించని జీబీయూ-57 బంకర్ బస్టర్ (GBU-57 bunker buster) బాంబులను ఉపయోగించింది. బీ-2 స్టెల్త్ బాంబర్ విమానాలను వినియోగించి అమెరికా మిలిటరీ ఈ దాడులు చేసింది.
బాంబులు వేసి.. ట్రంప్ శాంతి మంత్రం
ఇరాన్‌లోని అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడులను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ధారించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా కీలక ప్రకటన చేశారు. ‘‘ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలైన ఫోర్డో, నటంజ్, ఇస్ఫాహన్‌లపై మేము విజయవంతంగా దాడి చేశాం. మా విమానాలన్నీ ప్రస్తుతం ఇరాన్ గగన తలానికి వెలుపలకు వచ్చేశాయి. ఇరాన్ ప్రధాన అణు కేంద్రమైన ఫోర్డోపై ఫుల్లుగా లోడ్ చేసిన బాంబులు జారవిడిచాం. మా విమానాలన్నీ సురక్షితంగా వెనుదిరిగి వస్తున్నాయి. అమెరికా గొప్ప యోధులకు నా అభినందనలు. ఈ పని చేయగలిగే ఆర్మీ ప్రపంచంలో మరొకటి లేదు. ఇప్పుడిక శాంతికి సమయం!. ఈ అంశాన్ని శ్రద్ధతో ఆలపించినందుకు మీకు ధన్యవాదాలు’’ అని ట్రంప్ రాసుకొచ్చారు. మరో పోస్టు చేసిన ట్రంప్, ఇంటెలిజెన్స్ రిపోర్టుల ప్రకారం ఫోర్డో అణుకేంద్రం ధ్వంసమైందని చెప్పారు. ఇజ్రాయెల్ వైమానిక సైన్యంతో కలిసి దాడి చేశామని పేర్కొన్నారు.
Read this- Tollywood: 40 ఏళ్లు దాటిన తెలుగు హీరోతో పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. కొత్త జంట ఫొటోలివే
అత్యంత శక్తిమంతం
అమెరికా ఆయుధ బాంఢాగారంలోని అత్యంత శక్తిమంతమైన బాంబులలో జీబీయూ-57 బాంబు ఒకటి. భూమి లోపలికి ఏకంగా 200 అడుగుల లోపలికి చొచ్చుకుపోగలవు. లేదా, 60 అడుగుల వరకు కాంక్రీటులోకి కూడా చొచ్చుకుపోగలవు. భూగర్భంలో అత్యంత పటిష్టంగా నిర్మించిన ఇరాన్‌లోని ఫోర్డో అణుకేంద్రాన్ని ధ్వంసం చేయాలనే లక్ష్యంతో అమెరికా ఈ బాంబులను ఉపయోగించింది. కాగా, ఇరాన్‌పై దాడి చేసే అంశంపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటానని ఇటీవలే ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్, రెండు రోజులు కూడా తిరగక ముందే దాడి చేశారు. 1979లో ఇరాన్ రివల్యూషన్ సమయంలో చివరిసారిగా అమెరికా ఇరాన్‌లో దాడులు చేసింది. ఆ తర్వాత, మళ్లీ దాడి చేయడం ఇదే మొదటిసారి. కాగా, శనివారం రాత్రే యూఎస్‌లోని వైట్‌మన్ ఎయిర్ బేస్ నుంచి బీ-2 స్పిరిట్ బాంబర్లు, 8 కేసీ-135 స్ట్రాటో ట్యాంకర్లు ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని డియాగో గార్సియా వైపు బయల్దేరి చేరుకున్నాయి.
ఇరాన్‌పై జరిగిన ఈ దాడితో అమెరికా యుద్ధంలోకి ప్రవేశించింది. అమెరికా ప్లానింగ్‌కు పూర్తిగా సహకారం అందించినట్టు ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు. కాగా, ఫోర్డో అణుకేంద్రం క్వామ్ అనే నగరానికి అత్యంత దగ్గరలోనే ఉంది. భారీ బాంబులు పేలడంతో భారీ శబ్దాలు రావడంతో భయభ్రాంతులకు గురయ్యారు. అత్యంత కీలకమైన ఈ అణు కేంద్రాన్ని ఇరాన్ అత్యంత పటిష్టంగా నిర్మించింది. అక్కడ ఉన్న భారీ పర్వతాన్ని తొలిచివేసి కొన్ని వందల అడుగుల లోతులో ఈ అణుకేంద్రాన్ని నిర్మించారు. 1981లో ఇరాక్ అణుకేంద్రాలను ఇజ్రాయెల్ ఎఫ్15, ఎఫ్16 యుద్ధ విమానాల సాయంతో ధ్వంసం చేసిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పకడ్బందీ జాగ్రత్తలతో ఈ అణుకేంద్రాన్ని నిర్మించారు.