Russia Ukraine War: ఉక్రెయిన్ – రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ నౌకదాళానికి చెందిన గూఢచార నౌకను రష్యా పేల్చేసి ఆ దేశాన్ని చావుదెబ్బ కొట్టింది. శత్రుదేశానికి చెందిన ‘సిమ్పెరోపోల్’ యుద్ధ నౌకను కూల్చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ అధికారికంగా ప్రకటించింది. తమ డ్రోన్ దాడిలో అది ధ్వంసమై నీటమునిగిందని తెలిపింది. అయితే ఉక్రెయిన్ నౌకదళంలోని అతిపెద్ద యుద్ధనౌక ఇదేనని తెలుస్తోంది.
డ్రోన్‌తో ఇదే తొలిసారి
లాగూనా తరగతికి చెందిన సిమ్పెరోపోల్ యుద్ధ నౌకను.. రేడియో, ఎలక్ట్రానిక్, రాడార్, ఆప్టికల్ గూఢచర్యం కోసం ఉక్రెయిన్ వినియోగించుకుంటోంది. అయితే ఈ నౌక ఉక్రెయిన్ ఒడెస్సా ప్రాంతంలోని డాన్యూబ్ నది డెల్టాలో ఉండగా పేల్చేసినట్లు రష్యా ప్రకటించింది. సముద్ర డ్రోన్ ను ఉపయోగించి రష్యా ఒక యుద్ధనౌకను నాశనం చేయడం ఇదే తొలిసారని రక్షణశాఖ నిపుణులు చెబుతున్నారు.
#Breaking: Around midnight, the Russian Navy struck Ukraine’s largest naval ship—reconnaissance vessel Simferopol—with remote-controlled sea drones in southern Odesa. Ukrainian Navy officials confirm the loss, with one killed, several injured, and search operations ongoing for… pic.twitter.com/ygs9AkEMML
— Defence Chronicle India ™ (@TheDCIndia) August 29, 2025
ఉక్రెయిన్ రియాక్షన్
మరోవైపు ఈ డ్రోన్ దాడిని ఉక్రెయిన్ సైతం ధ్రువీకరించింది. యుద్ధ నౌకను పేల్చేసిన ఘటనలో ఒకరు మరణించగా.. పలువురు గాయపడ్డారని కీవ్ నౌకదళ ప్రతినిధి ఒకరు తెలిపారు. ‘దాడి అనంతర పరిణామాలను ఎదుర్కొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఎక్కువ మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. అయితే దాడి తర్వాత కనిపించకుండా పోయిన సిబ్బంది కోసం శోధన కొనసాగుతోంది’ అని ఆ ప్రతినిధి వివరించారు.
Also Read: Ponguleti Srinivas reddy: నష్టపోయిన జిల్లాకు అదనపు నిధులు.. మంత్రి పొంగులేటి!
2014 తర్వాత.. అతిపెద్ద నౌక
సిమ్ఫెరోపోల్ యుద్ధనౌక విషయానికి వస్తే 2019లో దీని నిర్మాణం ప్రారంభమైంది. 2021లో ఉక్రెయిన్ నౌకాదళంలో దీన్ని చేర్చారు. వార్‌గోంజో టెలిగ్రామ్ ఛానల్ ప్రకారం.. 2014 తర్వాత కీవ్ ప్రవేశపెట్టగలిగిన అతిపెద్ద నౌక ఇదే కావడం గమనార్హం. ఇదిలా ఉంటే గత కొద్ది కాలంగా రష్యా సముద్ర డ్రోన్లు, మానవ రహిత వ్యవస్థల తయారీ రంగంపై ఫోకస్ పెట్టింది. వీటిని ఉపయోగించుకొనే యుద్ధంలో వ్యూహాత్మకంగా ఉక్రెయిన్ పై రష్యా ఆధిపత్యం చెలాయించగలుగుతోంది.
Also Read: Barrelakka: వెక్కి వెక్కి ఏడ్చిన బర్రెలక్క.. నాకు ఆ సమస్య ఉందంటూ కన్నీళ్లు.. ఏమైందంటే?
598 డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా
ఇదిలా ఉంటే ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై గురువారం రష్యా విరుచుకుపడింది. ఏకంగా 598 డ్రోన్లు, 31 తేలికపాటి క్షిపణులతో తమపై దాడి జరిగినట్లు ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. 48 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారని పేర్కొన్నారు. శాంతిని కోరుకునే యావత్ ప్రపంచం ఈ ఘటనపై స్పందించాలని కోరుతూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
102 డ్రోన్లు నేలకూల్చిన రష్యా
మరోవైపు గురువారం ఉక్రెయిన్ ప్రయోగించిన 102 డ్రోన్లను తమ రక్షశాఖ నేలకూల్చిందని రష్యా ప్రకటించింది. రష్యా నైరుతి భాగమే టార్గెట్ గా ఈ దాడులు జరిగినట్లు పేర్కొంది. ఓ డ్రోన్ కారణంగా క్రాస్ నోడార్ లోని అఫిప్ స్కీ చమురుశుద్ధి కేంద్రంలో మంటలు సైతం చెలరేగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అగ్నిమాక సిబ్బంది సకాలంలో స్పందించి.. వాటిని అదుపు చేయడంతో పెను ముప్పు తప్పిందని వివరించారు.