Elon Trump News: తనతోనే కయ్యానికి కాలు దువ్వుతున్న ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు (Elon Musk) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గట్టి వార్నింగ్ ఇచ్చారు. గత ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఆర్థిక సాయం చేసిన మస్క్, ఒకవేళ తన మనసు మార్చుకొని డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థులకు సహాయం చేస్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. 2024 ఎన్నికల్లో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ ఇద్దరు అమెరికా ప్రభావవంత వ్యక్తులు ఇప్పుడు బహిరంగ ఘర్షణకు దిగిన నేపథ్యంలో ట్రంప్ వార్నింగ్ వచ్చింది.
అమెరికాకు చెందిన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ పార్టీ సభ్యుల మద్దతుతో ఇటీవల రూపొందించిన వ్యయాల బిల్లుపై మస్క్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ట్రంప్ స్పందించారు. ‘‘ మస్క్ అలా చేస్తే దాని పర్యవసానాలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.చాలా తీవ్రమైన పరిణామాలను చూడాల్సి ఉంటుంది’’ అని అన్నారు. అయితే, ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నది మాత్రం ట్రంప్ చెప్పలేదు.
Read this- Bengaluru Stampede: కొడుకు సమాధిని వీడని తండ్రి.. గుండెలు పిండేసే దృశ్యం
నా సాయం లేకుంటే గెలిచేవారు కాదు
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిత వ్యయాల బిల్లుపై మస్క్ విమర్శలు గుప్పించడం ఇద్దరి మధ్య వివాదానికి దారితీసింది. ‘‘ట్రంప్ బాగా అందమైన బిల్లును ప్రతిపాదించారులే. అసహ్యకరంగా ఉంది. సమాఖ్య వ్యవస్థను నిర్లక్ష్యం చేసేలా వ్యయాలను ప్రోత్సహించే విధంగా ఈ బిల్లు ఉంది. అధ్యక్ష ఎన్నికలు-2024లో నేను ఆర్థిక సహాయం చేయకుంటే విజయం సాధ్యమయ్యేది కాదు. నేను ఇచ్చిన వందల మిలియన్ డాలర్ల విరాళాలు లేకుంటే, ట్రంప్‌కు అవకాశం ఉండేదే కాదు’’ అని కూడా మస్క్ వ్యాఖ్యానించారు.
250 మిలియన్ డాలర్ల విరాళం
అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024లో డొనాల్డ్ ట్రంప్ ప్రాతినిధ్యం వహించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు ఎలాన్ మస్క్ ఏకంగా 250 మిలియన్ల డాలర్లకు పైగా విరాళం అందించినట్టు ఫెడరల్ గణాంకాలు చెబుతున్నాయి. రిపబ్లికన్ పార్టీకి సెనేట్‌లో 53-47 మెజారిటీ, హౌస్‌ను గెలుపొందడానికి మస్క్ ఇచ్చిన విరాళాలు ఎంతగానో దోహదపడ్డాయి. అయితే, మస్క్ విమర్శల నేపథ్యంలో, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేస్తారేమోననే విశ్లేషణలు మొదలయ్యాయి. దీంతో, రిపబ్లికన్ పార్టీలో ఆందోళనలు మొదలయ్యాయి. వ్యయాల బిల్లుకు మద్దతిచ్చే రిపబ్లికన్ పార్టీ సభ్యులను శిక్షించాలని మస్క్ అనడం చూస్తుంటే ట్రంప్‌తో సంబంధాలు ఎంతగా దెబ్బతిన్నాయో అర్థం చేసుకోవచ్చు.
Read this- Akkineni Amala on Zainab: అక్కినేని వారి కొత్త కోడలికి కండిషన్లు పెట్టిన అమల.. తట్టుకోగలదా?
మస్క్‌తో మాట్లాడాలనుకోవడం లేదు
ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్‌కు ఎలాన్ మస్క్ బహిరంగంగా మద్దతిచ్చారు. ఎన్నికల ప్రచారంలో కూడా విస్తృతంగా పాల్గొన్నారు. అయితే, ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ వివాదంపై ట్రంప్ మాట్లాడుతూ, అగౌరవపరిచే వ్యక్తిగా మస్క్‌ను అభివర్ణించారు. ఆయనతో సంబంధాలను సరిదిద్దు్కునే ఉద్దేశం తనకు లేదని ట్రంప్ చెప్పారు. మస్క్‌తో మాట్లాడాలని తాను కోరుకోవడం లేదన్నారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.