New Year Tragedy: నూతన సంవత్సరం 2026 (New Year 2026) తొలి రోజునే తీవ్ర విషాదం (New Year Tragedy) చోటుచేసుకుంది. స్విట్జర్లాండ్‌లోని (Switzerland) క్రాన్స్ మోంటానాలో ఘోర అగ్నిప్రమాదం (Bar Fire Accident) జరిగింది. ‘లే కాన్‌స్టెలేషన్’ అనే బార్‌లో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ఏకంగా 40 మంది మృత్యువాతపడ్డారు. బార్‌లో న్యూఇయర్ వేడుకలు జరుగుతున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బార్‌లో మొత్తం 100 మందికిపైగా ఉన్నట్టుగా తెలుస్తోంది. భారీ అగ్నీ కీలలు ఎగసిపడడంతో చాలామంది గాయపడ్డారని సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం, న్యూఇయర్ ప్రారంభమైన గంటన్నర తర్వాత, అంటే రాత్రి 1.30 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు ప్రకటించారు. అయితే, ప్రమాదానికి కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. టూరిస్టులకు ఈ బార్ చాలా ఫేమస్ అని ఆయన వివరించారు. న్యూఇయర్ కావడంతో బార్ కిక్కిరిసిపోయిందని పోలీసులు వివరించారు. తొలుత ఉగ్రదాడి జరిగిందేమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఇది ఉగ్రదాడి కాదని పోలీసులు ప్రకటించారు. బార్‌లో జరిగిన విషాద ఘటనగా అభివర్ణించారు.
మృతుల్లో టూరిస్టులే అధికం
మృతి చెందినవారిలో అత్యధికులు పర్యాటకులేనని భావిస్తున్నామని, మృతుల వివరాలను నిర్దారించాల్సి ఉందని పోలీసు అధికారి ఒకరు ప్రకటించారు. హాలిడే సీజన్ గడిపేందుకు క్రాన్-మోంటానా వచ్చినట్టుగా తెలుస్తోందన్నారు. అగ్నిప్రమాద సమయంలో 100 మందికిపై ఉన్నారని చెప్పారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉందని, బార్‌లో ఉన్నది ఎక్కువ మంది పర్యాటకులేననే విషయం మాత్రం ప్రాథమికంగా తెలిసిందని అధికారులు వివరించారు. డజన్ల సంఖ్యలో మరణ సంభవించాయని ఘటనా స్థలంలోని ఓ డాక్టర్ చెప్పారంటూ స్విట్జర్లాండ్‌కు చెందిన వార్త సంస్థ ‘బ్లిక్’ ఒక కథనాన్ని ప్రచురించింది. 40 మందికిపైగా చనిపోయారంటూ మరో స్థానిక వార్త సంస్థ కథనాన్ని ప్రచురించింది.
గాయపడినవారిని హాస్పిటల్స్‌కు తరలించేందుకు హెలీకాప్టర్లను రంగంలోకి దించారు. బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకుగానూ ప్రత్యేక ఫోన్ నంబర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఘటనా స్థలాన్ని పూర్తిగా మూసివేశామని, నో ఫ్లై జోన్‌గా ప్రకటించామని పోలీసులు తెలిపారు. బాణాసంచా కాల్చే సమయంలో ప్రమాదం జరిగివుండొచ్చంటూ స్థానిక మీడియా అనుమానం వ్యక్తం చేసింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన చాలా వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ప్రమాదం జరిగిన క్రాన్స్-మోంటానా సిటీ ఆల్ప్స్ పర్వతాల మధ్యలో ఉండే ‘వలైస్’ ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో లగ్జరీ రిసార్టులు ఉంటాయి. ముఖ్యంగా, బ్రిటిష్ పౌరులు ఎక్కువగా ఇక్కడ పర్యటిస్తుంటారు.

