Balendra Shah: నేపాల్ లో తలెత్తిన హింసాత్మక ఘటన నడుమ.. ప్రధాని కేపీ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. ఈనేపథ్యంలో తదుపరి ప్రధాని అతడేనంటూ బలేంద్ర షా (బాలెన్) పేరు బలంగా వినిపిస్తోంది. నిరసన కారులు సైతం.. బలేంద్ర షా తమ తర్వాతి ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. అటు బలేంద్ర షా కూడా నిరసన కారులకు మద్దతు తెలుపుతూ పెట్టిన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తాజా పరిణామాలు చూస్తుంటే బలేంద్ర షా.. నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నిరసనలపై బాలెన్ ఏమన్నారంటే?
వృత్తి రిత్యా రాపర్ లేదా సింగర్ అయిన బలేంద్ర షా.. రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం నేపాల్ రాజధాని ఖాట్మాండ్ కు మేయర్ గా వ్యహరిస్తున్నారు. అయితే గత రెండ్రోజులుగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న నిరసనకారులకు బలేంద్ర షా తన మద్దతు తెలియజేశాడు. ‘నేను వయసు పరిమితి (28 లోపు ఉన్నవారే జెన్-జడ్) కారణంగా హాజరు కాలేకపోయాను. కానీ వారి స్వరాన్ని వినడం అత్యంత అవసరం’ అని అన్నారు. ‘ఈ ఉద్యమం సహజమైన జెన్-జడ్ స్వచ్ఛమైన పోరాటం. రాజకీయ పార్టీలు, నేతలు, కార్యకర్తలు తమ ప్రయోజనాల కోసం దీన్ని వాడుకోకూడదు’ అని సూచించారు. తన పూర్తి మద్దతు యువత పక్షానే ఉంటుందని స్పష్టం చేశారు.
‘బాలెన్ ప్రధాని కావాలి’
సోషల్ మీడియాపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసిన తర్వాత.. నిరసనకారుల ఆగ్రహం మరో స్థాయికి చేరింది. రాష్ట్రపతి, ప్రధాని ఇళ్లను నిరసనకారులు తగలబెట్టారు. అటు సోషల్ మీడియాలోనూ ప్రభుత్వ వ్యతిరేక గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఇదే క్రమంలో ‘బాలెన్ ఫర్ పీఎం’ అనే హ్యాష్ ట్యాగ్ ను నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. ‘బంగ్లాదేశ్, శ్రీలంకతో నేపాల్ కు ఉన్న తేడా ఏంటంటే మన దగ్గర దేశం కోసం వ్యక్తిగత ప్రయోజనం లేకుండా పని చేసే ఒక ప్రధానమంత్రి అభ్యర్థి ఉన్నాడు. అతడే బాలెన్. ఆయనే తదుపరి ప్రధాని కావాలి’ అని ఓ నిరసనకారుడు పోస్ట్ పెట్టాడు. ’19 మంది ప్రాణాలను త్యాగం చేసిన ఈ ఉద్యమం చాలా పెద్దది. ఉద్యమానికి బాలెన్ లాంటి నాయకుడు కావాలి’ అని మరొకరు రాసుకొచ్చారు.
Also Read: Heavy Rains: తెలంగాణకు బిగ్ అలెర్ట్.. తుఫాను హెచ్చరిక జారీ.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!
బలేంద్ర షా ఎవరు?
బలేంద్ర షా వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆయన 1990లో ఖాట్మాండ్ లో జన్మించాడు. ఆయన భార్య పేరు సబినా కఫ్లే. సివిల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందిన ఆయన.. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ (విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ, భారత్) చేశారు. రాజకీయాలకు రాకముందు అండర్‌గ్రౌండ్ హిప్‌హాప్ రాపర్ & లిరిసిస్ట్ గాను పేరు సంపాదించాడు. తన పాటలతో అవినీతి, అసమానతకు వ్యతిరేకంగా గళం విప్పాడు. 2022 ఎన్నికల్లో ఖాట్మాండ్ మేయర్‌గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రధాన పార్టీల అభ్యర్థులను ఓడించారు.