Indiramma indlu: ఇందిరమ్మ ఇండ్ల పంపిణీకి సంబంధించి గృహనిర్మాణం, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు. రాబోయే 3 ఏళ్లలో అర్హులైన వారందరికీ ఇందరిమ్మ ఇండ్లు ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టమైనా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే ఉన్నామని పొంగలేటి అన్నారు. పేదలకు అండగా నిలవడం తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం
మంగళవారం పాలేరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాయకన్‌గూడెం గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించిన పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. నర్సింహులగూడెం గ్రామంలో రూ. 1.33 కోట్లతో కిష్టాపురం–నర్సింహులగూడెం పీఆర్ రోడ్డుకు, కిష్టాపురం గ్రామంలో రూ. 1.61 కోట్లతో కిష్టాపురం–పోచారం పీఆర్ రోడ్డుకు, రూ. 2.40 కోట్లతో కిష్టాపురం–ముత్యాలగూడెం పీఆర్ రోడ్డుకు శంకుస్థాపనలు చేశారు. జుజ్జులరావుపేటలో రూ. 88 లక్షలతో జుజ్జులరావుపేట ఆర్ అండ్ బి రోడ్డును మల్లాయిగూడెం పీఆర్ రోడ్డుతో కలిపే బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కూసుమంచి జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు.
తక్కువ ధరకే ఇసుక
కూసుమంచి తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాండ్ బజార్‌ను సైతం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకే ఒక టన్ను గోదావరి ఇసుకను రూ. 1100కు, ఇతర అవసరాలకు టన్ను రూ. 1300కు అందుబాటులో ఉంచాం’ అని మంత్రి తెలిపారు.
కళ్యాణ లక్ష్మీ చెక్కులు అందజేత
అనంతరం కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నేలకొండపల్లి మండలానికి చెందిన 42, ఖమ్మం రూరల్ మండలానికి చెందిన 82 మొత్తం 124 మందికి కాటమయ్య రక్షక కిట్లు పంపిణీ చేశారు. కూసుమంచి మండలానికి చెందిన 18 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన 20 మంది క్రైస్తవ మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు.
Also Read: Nepal GenZ Protests: నేపాల్‌లో అల్లకల్లోలం.. రాష్ట్రపతి భవన్‌కు నిప్పు.. ప్రధాని ఇల్లు ధ్వంసం
4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ
ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాలను ఉద్దేశించి మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… “గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎనిమిది లక్షల 15 వేల కోట్ల రూపాయల అప్పు చేసి పేదలపై భారాలు మోపింది. పేదలకు ఇళ్లు కడితే కమిషన్లు రావని వదిలేసింది. కానీ వేల కోట్లు దండుకోవచ్చని కాళేశ్వరం ప్రాజెక్టును అతి తక్కువ ఖర్చుతో కట్టారు. ప్రస్తుత ఇందిరమ్మ ప్రభుత్వం మాత్రం భిన్నంగా పేదల కోసం నిజాయితీగా పనిచేస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం” అని గుర్తు చేశారు. ఇల్లు అవసరమైన ప్రతి అర్హుడి కల నెరవేర్చే వరకు ప్రభుత్వం వెనుకడుగు వేయదని పొంగులేటి భరోసా ఇచ్చారు.