Pig Kidney Transplant: వైద్య రంగంలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. అమెరికన్ వైద్యులు ఓ అరుదైన చికిత్సను విజయవంతంగా నిర్వహించి.. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. హ్యుమన్ ట్రైల్స్ లో భాగంగా న్యూ హాంప్‌షైర్ (New Hampshire)కు చెందిన బిల్ స్టీవర్ట్ (54) అనే వ్యక్తికి.. పంది మూత్రపిండంను విజయవంతంగా అమర్చారు. మనుషుల ప్రాణాలు కాపాడేందుకు జంతువుల అవయవాలు ఏ విధంగా ఉపయోగపడతాయే చెప్పేందుకు ఈ ప్రయోగం ఒక ఉదాహరణకు నిలుస్తుందని వైద్యులు దీమా వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
ఈ అరుదైన వైద్య చికిత్స.. 2025 జూన్ లో మాసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి (Massachusetts General Hospital)లో జరిగింది. ప్రస్తుతం బిల్ స్టీవర్ట్ (Bill Stewart) ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అటు బిల్ సైతం దీనిపై స్పందించారు. ‘నేను విజ్ఞాన శాస్త్రానికి కొంత సహాయం చేయాలనుకున్నాను. అందుకే ఏమాత్రం సంకోచించకుండా పంది మూత్రపిండాన్ని అమర్చుకున్నా’ అని బిల్ స్టీవర్ట్ తెలిపారు.
రెండేళ్లుగా డయాలసిస్..
బిల్ అనారోగ్యం విషయానికి వస్తే.. అతడు దీర్ఘకాలంగా అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతడి రెండు కిడ్నీలు క్రమంగా దెబ్బతినడం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో 50 ఏళ్లు వచ్చేసరికి అవి పూర్తిగా పనిచేయడం మానేశాయి. దీంతో దాత కోసం కుటుంబ సభ్యులు, వైద్యులు ఎంతగానో ఎదురుచూశారు. ఒకరిద్దరు ముందుకు వచ్చినా అది బిల్ కు సరిపోలేదు. దీంతో గత రెండేళ్లుగా డయాలసిస్ ద్వారా జీవిస్తున్నాడు.
దరఖాస్తు చేసుకొని..
ఈ క్రమంలో పంది కిడ్నీని మనుషులకు అమర్చే ప్రయోగాల గురించి బిల్ తెలుసుకున్నాడు. దీంతో తన మీదనే ఆ ప్రయోగం చేయవచ్చని మసాచుసెట్స్ ఆస్పత్రి వైద్యులకు దరఖాస్తు చేసుకున్నాడు. అతడి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న వైద్యులు.. బిల్ కు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. పంది కిడ్నీ అతడికి సరిపోతుందని నిర్ధారించుకున్న తర్వాతనే ఆపరేషన్ చేశారు. కాగా, మాసాచుసెట్స్ ఆస్పత్రి వైద్యులు.. గతంలోనూ టిమ్ ఆండ్ర్యూస్ అనే రోగికి పంది మూత్రపిండం అమర్చారు. దీంతో అతడు 7 నెలల పాటు డయాలసిస్ లేకుండా జీవనం సాగించగలిగాడు.
FDA అనుమతితోనే..
అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA).. పంది మూత్ర పిండాన్ని మానవులకు అమర్చే క్లినికల్ ట్రయల్ కు అనుమతిచ్చింది. ఇలా మానవేతర జీవుల అవయవాలను మనిషికి అమర్చడాన్ని వైద్య పరిభాషలో జీనో ట్రాన్స్ ప్లాంట్ అంటారు.
కొన్ని సవాళ్లు తప్పదు..
జంతువుల అవయవాలను మానవులకు అమర్చినప్పుడు వారి శరీరం విపరీత మార్పులకు లోనయ్యే ప్రమాదముంది. రోగ నిరోధక శక్తి ఆ అవయవంపై పనిచేయకపోవడం వంటి సమస్యలు ఎదురు కావచ్చు. అలాగే జంతువుల అవయవం నుంచి వచ్చే వ్యాధులు నివారించాల్సి ఉంటుంది. అయితే ఇది ఎంత వరకూ శ్రేయస్కరమో నిర్ధారించేందుకు విస్తృత ప్రయోగాలు జరగాల్సి ఉంది. మానవ అవయవాలకు సరితూగే పరిమాణం పందులకు ఉండటంతో వాటిని ప్రయోగాలకు ఎంపిక చేస్తున్నారు.
Also Read: Indian Railways: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి 22 ప్రత్యేక రైళ్లు.. ఇదిగో లిస్ట్!
కిడ్నీ సమస్య తీవ్రత..
అమెరికాలో 1 లక్ష మందికి పైగా అవయవ మార్పిడి జాబితాలో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది మూత్రపిండం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి సంవత్సరం వేల మంది అవయవం కోసం ఎదురుచూస్తూనే మరణిస్తున్నారు. ఈ కొరతను తీర్చేందుకు శాస్త్రవేత్తలు జన్యుమార్పిడి చేసిన పందుల అవయవాలను ప్రత్యామ్నాయంగా ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల పందులకు సంబంధించిన రెండు గుండెలు, రెండు మూత్రపిండ మార్పిడులు జరగ్గా.. అవి రోగులపై సఫలీకృతం కాలేదు. మరి వారు బతికే ఉన్నారా? చనిపోయారా? అన్న విషయాన్ని మాత్రం పరిశోధకులు వెల్లడించలేదు.