Tejas Fighter Crash: దుబాయిలో జరుగుతున్న ఎయిర్ షోలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. భారత్ కు చెందిన తేజస్ యుద్ధ విమానం (Tejas Fighter Jet).. విన్యాసాలు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలింది. స్థానిక కాలమానం ప్రకారం మ.2.10 ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఫైట్ జెట్ కుప్పకూలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో ఎయిర్ షోకి వచ్చిన వారంతా షాక్ కు గురయ్యారు. ఈ ఘటనలో పైలెట్ ప్రాణాలు కోల్పోయారు.
హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అభివృద్ధి చేసిన సింగిల్ సీటర్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (LAC) ఈ ప్రమాదంలో కుప్పకూలినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై భారత వైమానిక దళం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం దుబాయిలో జరుగుతున్న ఎయిర్ షో.. తాము రూపొందించిన తేజస్ లైట్ వెయిట్ ఫైటర్ జెట్ ను ప్రదర్శించాలని HAL భావించింది. ఇందులో భాగంగా LAC తన విన్యాసాలు ప్రారంభించింది. విన్యాసం ప్రారంభమైన కొద్దిసేపటికే ఫైటర్ జెట్ కుప్పకూలడం అందరినీ షాక్ కు గురిచేసింది.
దుబాయి లో నిర్వహిస్తున్న ఎయిర్ షోలో అపశృతి
కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ pic.twitter.com/rwES4kL19P
— BIG TV Breaking News (@bigtvtelugu) November 21, 2025
యుద్ధ విమానం కూలడానికి జి- ఫోర్స్ (G- Force) కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. భూ గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో ఉండే ఈ బలాన్ని వైమానిక పరిభాషలో జి-ఫోర్స్ అంటారు. దీనిని నియంత్రించడలో పైలెట్ విఫలమై ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే తేజస్ యుద్ధ విమానం కుప్పకూలడం.. గత రెండేళ్లలో ఇది రెండోసారి. 2024 మార్చిలో రాజస్థాన్ లోని జైసల్మేర్ లో తేజస్ యుద్ధ విమానం తొలిసారి కుప్పకూలింది. 2001లో తేజస్ ఫైటర్ జెట్ ను తొలిసారి పరీక్షించగా.. ఆ తర్వాత జరిగిన ప్రమాదం గతేడాదిదే కావడం గమనార్హం. 23 ఏళ్ల తేజస్ యుద్ధ విమాన చరిత్రలో ఇప్పటివరకూ రెండే ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
