Muhammad Riaz: యువతకు స్ఫూర్తిగా నిలిచే వ్యక్తుల్లో క్రీడాకారులు ఒకరు. అంతర్జాతీయ వేదికలపై మాతృదేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ తమ విజయం ద్వారా యావత్ ప్రజలకు కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తుంటారు. క్రికెట్, బాడ్మింటన్, ఫుట్ బాల్, వాలీబాల్, టెన్నిస్, కబడ్డి ఇలా ఏ క్రీడకు చెందిన వారైన తమ తమ రంగాల్లో రాణించడం ద్వారా తమ ప్రాంతానికి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వాలు సైతం వారి ప్రతిభను గుర్తించి పోత్సహిస్తుంటాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తుంటాయి. అయితే ఓ ఇంటర్నేషనల్ క్రీడాకారుడికి మాత్రం ఇవేమి లభించలేదు. జాతీయ జట్టులో స్థానం లేక, ప్రభుత్వం కల్పించిన ఉపాధి కోల్పోయి రోడ్డు పక్కన ఓ జిలేబి కొట్టు పెట్టుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే…
దయాది దేశం పాకిస్థాన్ కు చెందిన మహమ్మద్ రియాజ్ (Muhammad Riaz).. ఫుట్ బాల్ ప్లేయర్ (Pakistan footballer) గా రాణించాడు. 2018లో జరిగిన ఆసియా గేమ్స్ లో ఆ దేశానికి ప్రాతినిథ్యం సైతం వహించారు. ఫుట్ బాల్ లో ఎంతో ప్రతిభ కనబరిచిన మహ్మద్ రియాజ్ కు ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లభించలేదు. దీంతో అతడు బతుకు దెరువు కోసం ఖైబర్ పంక్తువా ప్రావిన్స్ లోని హంగు ప్రాంతంలో రోడ్డు పక్కన ఓ జిలేబీ కొట్టు పెట్టుకున్నాడు. ఎంతో ఇష్టంగా నేర్చుకున్న క్రీడను 29 ఏళ్లకే పక్కకు పెట్టి బతుకు జీవుడా అంటూ కష్టపడుతున్నాడు.
ప్రభుత్వ ఉపాధి కోల్పోయి..
క్షేత్రస్థాయిలో యువ క్రీడకారులను ప్రోత్సహించేందుకు పాక్ ప్రభుత్వం (Pakistan Government) గతంలో క్లబ్ ఆధారిత నమూనాను తీసుకొచ్చింది. అందులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన అథ్లెట్లను కోచ్ నియమించి యువ క్రీడాకారులను తీర్చిదిద్దే బాధ్యతను వారికి అప్పగించింది. అయితే గత కొంతకాలంగా దేశంలో క్రికెట్ కు ఆదరణ పెరుగుతుండటం, ఇతర క్రీడలకు ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించకపోవడంతో 2018లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రిక్-ఈ-ఇన్సాఫ్ (Pakistan Tehreek-e-Insaf) ప్రభుత్వం.. ఆ విధానాన్ని రద్దు చేసింది. దీంతో వందలాది మంది అథ్లెట్లు తమ ఉపాధిని కోల్పోయి ఆర్థిక సమస్యల్లో చిక్కుకుపోయారు. వారిలో మహ్మద్ రియాజ్ కూడా ఉండటం గమనార్హం.
ఎదురు చూపులు
ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్.. క్లబ్ ఆధారిత నమూనాను డిపార్ట్ మెంటల్ స్పోర్ట్స్ (Departmental Sports) విధానాన్ని తిరిగి తీసుకొస్తానని ఇటీవల ప్రకటించారు. దీంతో మహమ్మద్ రియాజ్ కు ప్రాణం లేచి వచ్చినట్లు అయ్యింది. పాక్ ప్రభుత్వం ఆ విధానాన్ని తిరిగి తీసుకొస్తే తనకు తిరిగి ఉపాధి లభిస్తుందని పాక్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో మహమ్మద్ రియాజ్ అన్నారు. ప్రస్తుతం జిలేబి వ్యాపారం చేసుకుంటూ చాలి చాలని డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నట్లు చెప్పారు. డిపార్ట్ మెంటల్ స్పోర్ట్స్ విధానాన్ని ప్రభుత్వం తిరిగి తీసుకురావాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు. తనలా ఎంతో నైపుణ్యం కలిగిన క్రీడాకారుల సేవలను భవిష్యత్ తరాలకు అందించాలని పాక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read: Star Heroine: ప్రేమలో పడ్డ స్టార్ హీరోయిన్? ప్రేమ పాఠాలు అతనితోనే?
క్రికెట్ సైతం అంతంత మాత్రమే
పాకిస్థాన్ క్రీడల విషయానికి వస్తే.. ఆ దేశంలో ప్రస్తుతం క్రికెట్ సైతం సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటోంది. నాణ్యమైన క్రికెటర్ల కొరత ఆ దేశాన్ని వేధిస్తోంది. ఇటీవల ఐసీసీ నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)కి పాకిస్థానే ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తూ.. కనీసం లీగ్ స్టేజీని సైతం దయాది జట్టు దాటలేకపోయింది. ముఖ్యంగా టీమిండియా చేతిలో పాక్ జట్టు ఘోరంగా ఓడిపోయింది. దీంతో మాజీలు జట్టులోని పాక్ క్రికెటర్లను బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.