Pakistan Army General: మహిళా జర్నలిస్టు పట్ల పాక్ ఆర్మీ ఉన్నతాధికారి అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా రిపోర్టర్ ను చూసి ఆయన కన్నుకొట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఆయన తీరును తప్పుబడుతూ నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
వైరల్ అవుతున్న వీడియోను గమనిస్తే మహిళా రిపోర్టర్ అబ్సా కోమల్ (Absa Komal).. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురించి ఆర్మీ అధికారిని ప్రశ్నించారు. పాకిస్థాన్ దేశ భద్రతకు ముప్పు, దేశ వ్యతిరేకి, దిల్లీ చేతుల్లో ఉన్నారంటూ ఇమ్రాన్ మీద వస్తున్న ఆరోపణల గురించి అహ్మద్ షరీఫ్ ను ప్రశ్నించారు. ‘ఇది గతంలో జరిగిన దానికంటే ఎలా భిన్నంగా ఉంది. లేదంటే భవిష్యత్తులో ఏదైనా మార్పును ఆశించవచ్చా?’ అని లేడీ రిపోర్టర్ అన్నారు. దీనికి షరీఫ్ వ్యంగ్యంగా స్పందిస్తూ ‘మీ ప్రశ్నలకు మరో పాయింట్ ను కూడా చేర్చాలి. ఇమ్రాన్ ఒక ‘జెహ్నీ మరీజ్’ (మానసిక రోగి) అని అన్నారు. అలా చెబుతూనే మహిళా జర్నలిస్టు వైపు చూసి అభ్యంతరకరంగా కన్నుకొట్టారు. ఇందుకు సంబంధించి దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఏకిపారేస్తున్న నెటిజన్లు
మహిళా రిపోర్టర్ పట్ల పాక్ ఆర్మీ ప్రతినిధి చూపించిన హావాభావాలపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతడు ‘ప్రొఫెషనల్ సైనికుడు కాదు’ అని పలువురు మండిపడుతున్నారు. సైనికులు ఇంత అన్ ప్రొఫెషనల్ గా ప్రవర్తించరని విమర్శిస్తున్నారు. పాక్ సైనికుల క్రమశిక్షణ లేమికి, బాధ్యతారాహిత్యానికి ఇది ఉదాహరణ అని దుయ్యబడుతున్నారు. పాక్ ఆర్మీలో ఇలాంటి వారు ఉన్నారు కాబట్టే ఆ దేశం పరిస్థితి ఇంత దారుణంగా ఉందని ఓ నెటిజన్ మండిపడ్డాడు. సదరు మహిళా రిపోర్టర్ కు భేషరతుగా అహ్మద్ షరీఫ్ చౌదరి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పాక్ మీడియా సైతం.. అహ్మద్ షరీఫ్ తీరును తప్పుబడుతూ వార్తలు ప్రసారం చేసింది.
Believe me, he is a top rank army officer in uniform…. pic.twitter.com/GDjduiCY8m
— OsintTV 📺 (@OsintTV) December 9, 2025
Also Read: TGSRTC: టీజీఎస్ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. 373 కొత్త కాలనీలకు ఆర్టీసీ బస్సులు
ఆర్మీ అధికారిగా వివాదాస్పదం
ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ పాక్ ఆర్మీ ప్రతినిధిగా అహ్మద్ షరీఫ్ చౌదరి వ్యవహార శైలి విమర్శలకు తావిస్తోంది. మీడియా సమావేశంలో భారత్ పట్ల అసత్యాలను వ్యాప్తి చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆర్మీ అధికారికగా అహ్మద్ షరీఫ్ నేపథ్యం కూడా వివాదస్పదమే. కరుడు గట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కు అత్యంత సన్నిహితుడు, ఉగ్రవాదిగా ప్రకటించబడ్డ సుల్తాన్ బషీరుద్దీన్ కు అహ్మద్ షరీఫ్ స్వయానా కుమారుడు. అటువంటి వ్యక్తికి పాక్ ఆర్మీలో ఉద్యోగం లభించడం, సైన్యంలో ఉన్నతాధికారి స్థానంలో అతడు కొనసాగుతుండటంపై విమర్శలు ఉన్నాయి.

