Mysterious Object: అమెరికాలో 36 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఓ విమానానికి ఊహించని ఘటన ఎదురైంది. సడెన్‌గా గుర్తుతెలియని ఓ వస్తువు వచ్చి (Mysterious Object) ఢీకొట్టింది. దీంతో విమానం విండ్‌షీల్డ్ పగిలిపోయింది. ఈ ఘటనలో ఒక పైలట్‌కు గాయాలు కూడా అయ్యాయి. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం డెన్వర్ నుంచి లాస్ ఏంజెల్స్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. విండ్‌షీల్డ్ పగిలిపోవడంతో పైలెట్లు తక్షణమే ప్రతిస్పందించి, ప్రొటోకాల్ ప్రకారం విమానం ఎత్తును 36 వేల అడుగుల నుంచి 26 వేల అడుగులకు తగ్గించారు. ఆ తర్వాత సమీపంలోని ఎయిర్‌పోర్టులో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
ఈ ఘటన జరిగిన సమయంలో యునైటెడ్ ఫ్లైట్ 1093లో 134 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అక్టోబర్ 16న ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. విమానం 36,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో గుర్తుతెలియని వస్తువు సడెన్‌గా ఢీకొట్టిందన్నారు. ఆ తాకిడికి బహుళ-పొరల అద్దం పగిలిపోయిందని, పైలెట్‌కు గాయాలై, రక్తం కూడా కారిందన్నారు. పగిలిన గాజు ముక్కలు కాక్‌పిట్ అంతటా పడ్డాయని వివరించారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పైలట్ చేయిపై గాజు పెంకులు కోసుకుపోయి గాయాలు, రక్తస్రావం కనిపిస్తోంది. పగిలిన గాజు ముక్కలు డాష్‌బోర్డ్, కాక్‌పిట్ అంతటా కనిపిస్తున్నాయి. అయితే, ఈఘటనకు నిర్దిష్ట కారణం ఏంటనేది యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఇప్పటివరకు వెల్లడించలేదు.
Read Also- Riaz Encounter: కానిస్టేబుల్ హత్య కేసులో సెన్సేషన్.. నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్
విండ్‌షీల్డ్ పగిలిపోవడంతో దానిని సరిచేయడానికి సాల్ట్ లేక్ సిటీలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని మాత్రమే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ప్యాసింజర్లను మరో విమానంలో లాస్ ఏంజెల్స్‌కు పంపించినట్టు ఓ ఛానల్ ఇంటర్వ్యూలో విమానయాన సంస్థ ప్రతినిధి తెలిపారు. ప్రయాణికుల కోసం ప్రత్యమ్నాయ విమానాన్ని ఏర్పాటు చేశామని, దెబ్బతిన్న విమానాన్ని తిరిగి సర్వీసులోకి తీసుకొచ్చేందుకు తమ బృందం కృషి చేస్తోందని చెప్పారు. కాగా, ఏదైనా ఒక పొరకు నష్టం జరిగినా, రక్షణ కోసం మరిన్ని లేయర్లు ఉంటాయని, అయినప్పటికీ అవి డ్యామేజీ అయ్యాయని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి పేర్కొన్నారు.
ప్రమాదానికి కారణం ఏమై ఉండవచ్చు?
ప్రస్తుతానికి ఈ ఘటనకు కారణం ఏంటనేది స్పష్టంగా తెలియరాలేదు. పైలెట్‌కు ఈ తరహా గాయాలు కావడం చాలా అరుదు అని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) నిపుణులు చెబుతున్నారు. అంతరిక్ష శిథిలాల కారణంగా ఈ ప్రమాదం జరిగిందేమోనని అనుమానిస్తున్నారు. సాధారణంగా పక్షులు, వడగళ్లు, ఇతర వస్తువులు తక్కువ ఎత్తులో విమానాలను ఢీకొంటాయి. కానీ, బోయింగ్ 737 మ్యాక్స్ విమానం 36,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న సమయంలో ఇది జరగడం అసాధారణమని అంటున్నారు.
