Dhaka Airport: భారత పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌లో శనివారం తీవ్ర అగ్ని ప్రమాదం జరిగింది. ఆ దేశ రాజధాని నగరం ఢాకాలో ఉన్న హజ్రత్ షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో (Dhaka Airport) పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. విమానాశ్రయంలోని కార్గో సెక్షన్‌లో జరిగిన ఈ భారీ అగ్నిప్రమాదంతో ఆకాశంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. పర్యావసానంగా ఎయిర్‌పోర్టు ఆవరణలో విజిబిలిటీ సరిగా లేకపోవడంతో విమాన సర్వీసులు అన్నింటినీ తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతానికి ప్రాణనష్టం, లేదా పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగినట్టుగా ఎలాంటి సమాచారం లేదు.
అగ్నిప్రమాదం ప్రదేశం నుంచి దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించడం చాలా దూరం వరకు కనిపించింది. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎనిమిదవ గేటుకు సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని ఎయిర్‌పోర్టు అధికారులు వివరించారు. ప్రమాదానికి కారణం ఏంటనేదానిపై దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు. అగ్నిప్రమాదం తీవ్రమైనది కావడంతో వెంటనే పెద్ద ఎత్తున అత్యవసర సహాయక చర్యలను ప్రారంభించినట్టు వెల్లడించారు.
Read Also- Election Arrangements: జూబ్లీహిల్స్ ఎన్నికల ఏర్పాట్ల పై కాంట్రాక్టర్ల తర్జనభర్జన.. ఎందుకంటే?
ప్రభుత్వ విభాగాల సమన్వయం
మంటలను అదుపులోకి తీసుకొచ్చే ఆపరేషన్‌లో పలు సంస్థలు సమన్వయంతో పనిచేశాయని బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ, ఫైర్ సర్వీస్, బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు అగ్నిమాపక యూనిట్లు ఈ ఆపరేషన్‌లో పాలుపంచుకున్నాయని వివరించారు. బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్‌కి (BGB) చెందిన రెండు ప్లాటూన్ల బలగాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. విమానాశ్రయం లోపల, చుట్టుపక్కల భద్రతను నిర్ధారించడానికి, పర్యవేక్షించేందుకుగానూ నౌకాదళం (Navy) కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్టు బంగ్లాదేవ్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
Read Also- Sundar Pichai: నేను చూశాను.. వైజాగ్‌కు సుందర్ పిచాయ్ కితాబు.. ఏమన్నారో తెలుసా?
ఘటనను గుర్తించిన వెంటనే అగ్నిమాపక చర్యలు చేపట్టామని ఎయిర్‌పోర్ట్ ఫైర్ సర్వీస్ ప్రతినిధి తల్హా బిన్ జషిమ్ చెప్పారు. తొలుత తొమ్మిది ఫైరింజన్లను ఘటనా స్థలానికి పంపించామని, ఆ తర్వాత మరింటిని పంపించామని, మొత్తం 28 ఫైరింజన్లను మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు రంగంలోకి దిగాయని వెల్లడించారు. అదనపు ఫైరింజన్లను సైతం సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఇక అగ్ని ప్రమాదం జరిగినప్పటికీ, విమానాలన్నీ సురక్షితంగానే ఉన్నాయని అధికారులు ధృవీకరించారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరికొన్ని అప్‌డేట్‌లను పరిస్థితిని బట్టి అందజేస్తామని ఎయిర్‌పోర్ట్ ప్రతినిధులు తెలిపారు.
