Khamenei – Trump: ప్రజాగ్రహ జ్వాలలో ఇస్లామిక్ దేశమైన ఇరాన్ అట్టుడుకుతోంది. పెరిగిన ధరలు, కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ, అధిక ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కారు. ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛ కల్పించాలంటూ వీధుల్లో రణరంగం సృష్టిస్తున్నారు. అయితే ఈ నిరసనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారంటూ ఖమేనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశంలో వాషింగ్టన్ అశాంతిని సృష్టించిందని ఆరోపించారు. అహంకారంతో పాలించే నాయకులు తప్పనిసరిగా పతనమవుతారంటూ ట్రంప్ ను ఉద్దేశించి హెచ్చరించారు.
‘నీ పతనం ఖాయం’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను నేరుగా ప్రస్తావిస్తూ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఎక్స్ వేదికగా వరుస పోస్టులు పెట్టారు. చరిత్ర చూసుకుంటే నిరంకుశులు, అహంకార పాలకులు అత్యున్నత స్థాయిలో ఉన్నప్పటికీ పతనమయ్యారని ఖమేనీ అన్నారు. ఈ విషయాన్ని ట్రంప్ గుర్తించాలని చెప్పారు. ప్రస్తుతం శిఖరాగ్ర స్థాయిలో ఉండి.. అధికారం చెలాయిస్తున్న ట్రంప్ కూడా పతనం కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఇరాన్ లో డిసెంబర్ 28న సాధారణంగా మెుదలైన నిరసనలు.. రెండో వారానికి మహోగ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అమెరికా అండతోనే..
మరోవైపు ఇరాన్ లో జరుగుతున్న నిరసనలను అగ్రరాజ్యం అమెరికా ప్రోత్సహిస్తోందని ఖమేనీ ఆరోపించారు. నిరసన వెనుక ఉన్న ఇరాన్ నేతలు.. దేశం గురించి బాధతో కాకుండా అమెరికా అనుగ్రహం పొందేందుకు పాటుపడుతున్నారని మండిపడ్డారు. ట్రంప్ మెప్పు పొందేందుకు ఆందోళన కారులను మరింతగా రెచ్చగొడుతున్నారని ఖమేనీ తన వరుస ఎక్స్ పోస్టుల్లో పేర్కొన్నారు. ఇరాన్ లోని పలు నగరాల్లో గల ప్రభుత్వ భవనాలను నిరసనకారులు ధ్వంసం చేస్తున్నారని చెప్పారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటే ఆందోళన కారుల పక్షాన ఉంటామని అమెరికా అధ్యక్షుడు బహిరంగంగా చెప్పడం సిగ్గుచేటని ఖమేనీ మండిపడ్డారు. ట్రంప్ తన సొంత దేశంలో జరుగుతున్న ఘటనలను పట్టించుకుంటే మంచిదని హితవు పలికారు.
Also Read: India-US Trade Deal: మళ్లీ నోరుపారేసుకున్న అమెరికా.. ఈసారి గట్టిగా ఇచ్చిపడేసిన భారత్!
టెహ్రాన్‌కు ట్రంప్ వార్నింగ్
గత కొద్ది రోజుల్లో ట్రంప్ పలుమార్లు ఇరాన్ ను హెచ్చరించారు. ఇటీవల ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిరసనకారులను ఇరాన్ నిరంకుశంగా అణిచివేస్తే.. అమెరికా జోక్యం చేసుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ ప్రజలకు ఏదైనా చెడు చేస్తే.. తీవ్రంగా దెబ్బతీస్తామని పరోక్షంగా ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీని ఉద్దేశించి హెచ్చరించారు. మరోవైపు తన సోషల్ మీడియా పోస్టులోనూ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాచరిక పాలనను కూలదోసేందుకు ఇరాన్ ప్రజలు చూపిస్తున్న ఉత్సాహం చాలా అద్భుతంగా ఉందంటూ కవ్వించే ప్రయత్నం చేశారు.

