అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ మధ్య శ్వేతసౌధం వేదికగా జరిగిన వాగ్వాదం (Trump Zelensky controversy) యావత్ ప్రపంచాన్ని ఉలికిపాటుకు గురి చేసింది. రష్యాతో యుద్ధాన్ని నిలిపివేయడంతో పాటు ఉక్రెయిన్ లోని విలువైన ఖనిజాలను తవ్వుకునే అంశంపై జరిగిన ఈ భేటి అర్థాంతరంగా ముగిసింది. భవిష్యత్తులో రష్యా తిరిగి దాడి చేయదని గ్యారంటీ ఇస్తారా? ఒక వేళ అదే జరిగితే ఆ సమయంలో రక్షణగా నిలుస్తారా? అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వేసిన ప్రశ్నలకు ట్రంప్ సహా అమెరికా ఉపాధ్యాక్షుడు జె.డి వాన్స్ లకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు సాయపడుతున్న దేశంతో మాట్లాడే పద్దతి ఇది కాదంటూ మండిపడ్డారు. ఇదిలా ఉంటే ట్రంప్ – జెలెన్ స్కీ మధ్య జరిగిన ఈ భేటిపై రష్యా షాకింగ్ కామెంట్స్ చేసింది. ట్రంప్ ను ఆకాశానికెత్తుతూనే జెలెన్ స్కీపై ఘాటు విమర్శలు చేసింది.
‘ట్రంప్ సంయమనం పాటించడం అద్భుతం’
శ్వేతసౌధం వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ మధ్య జరిగిన మాటల యుద్ధంపై రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా స్పందించారు. అగ్రరాజ్యం అధ్యక్షుడితో మాట్లాడుతున్నానన్న విచక్షణ కోల్పోయి జెలెన్ స్కీ దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. జెలన్ స్కీ ప్రవర్తన విషయంలో ట్రంప్ సంయమనం పాటించడం అద్భుతమని కొనియాడారు. అన్నం పెట్టిన చేతినే జెలెన్ స్కీ నరుకుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు.
Also Read- Posani Krishnamurali : సజ్జల చెప్పినందుకే పవన్ ను తిట్టా.. పోసాని కృష్ణమురళి సంచలనం..
‘జెలెన్ స్కీ హింసను ప్రేరేపిస్తున్నారు’
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఉక్రెయిన్ ప్రెసిడెంట్ పై రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ (Security Council of Russia) డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా పరిణామాలు ఉక్రెయిన్ కు చెంపపెట్టులాంటివని అభివర్ణించారు. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వ్యవహారశైలి హింసను ప్రేరేపించేలా ఉందని రష్యా అంతర్జాతీయ సహకార సంస్థ డైరెక్టర్ యెవ్జెనీ ప్రిమాకోవ్ అన్నారు. అటు హంగేరియన్ ప్రధాని విక్టర్ ఓర్బన్ సైతం ఈ వ్యవహారంలో అమెరికాకే మద్దతు తెలియజేశారు. శాంతి కోసం ట్రంప్ ఎంతో ధైర్యంగా నిలబడ్డారని ప్రశంసించారు.
జెలెన్ స్కీ అతి చేశారు: ట్రంప్
ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీతో భేటి అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో జెలెన్ స్కీ కాస్త అతి చేసినట్లు అనిపించిందని విలేకరులతో అన్నారు. తాము రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి కోసం ప్రయత్నిస్తుంటే.. జెలెన్ స్కీ అందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించలేదని చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు మరొకటి ఏదో ఆశిస్తున్నట్లు ట్రంప్ అభిప్రాయపడ్డారు. తాము మాత్రం ఉక్రెయిన్ లో శాంతి స్థాపనకే కట్టుబడి ఉన్నట్లు మరోమారు స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం ఇదే కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు షాక్ ; కాంగ్రెస్ నుంచి సస్పెండ్