Posani Krishnamurali : నటుడు పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల ఎదుట జరిగిన విషయాలను మొత్తం ఒప్పుకున్నాడు నటుడు పోసాని. గతేడాది కులాలు, వర్గాలపై చేసిన తీవ్ర వ్యాఖ్యలను పోసాని ఒప్పుకున్నాడు. అయితే వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rmakrishna) చెప్పినందుకే అలా చేశానని చెప్పాడు. హైదరాబాద్ ప్రెస్ మీట్ లో కూడా పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా తిట్టడం వెనకాల సజ్జల రామకృష్ణారెడ్డి రాసిచ్చిన స్క్రిప్టు ఉందన్నాడు. సజ్జల రాసిచ్చిన స్క్రిప్టు ప్రకారమే తాను మాట్లాడానన్నాడు.
తాను ఎఫ్ డీసీ చైర్మన్ గా ఉండి వైసీపీకి సహకరించినట్టు చెప్పుకొచ్చాడు. వైసీపీ సోషల్ మీడియా చైర్మన్ సజ్జల భార్గవ్ రెడ్డి ప్లాన్ ప్రకారమే తాను మాట్లాడేవాడిని అని.. తాను మాట్లాడిన వాటిని భార్గవ్ రెడ్డి సోషల్ మీడియాలో వైరల్ చేయించేవాడన్నారు. తాను ఉద్దేశ పూర్వకంగా ఎవరినీ తిట్టలేదని.. అదంతా స్క్రిప్టులో భాగమేనని పోసాని చెప్పడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. పోసానికి ప్రస్తుతం 14 రోజుల పాటు రిమాండ్ రిపోర్టు విధించారు. దాంతో ఆయన్ను రాజంపేట సబ్ జైలులో ఉంచారు.
పోసాని ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ రెడ్డిలను కూడా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కేసులో ముందస్తు బెయిల్ కోసం పోసాని ప్రయత్నిస్తున్నారు. అంతే కాకుండా తన మీద పెట్టిన కేసులను కొట్టేయాల్సిందిగా పిటిషన్లు వేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.