Hindu Widow Attacked: పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో (Bangladesh) మైనారిటీ వర్గంగా ఉన్న హిందువులపై (Hindu Minority) ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. వరుసగా ముగ్గురు హిందూ వ్యక్తుల హత్యోదంతాల తర్వాత మరో దారుణాతి దారుణ ఘటన వెలుగుచూసింది. 40 ఏళ్ల వయసున్న ఓ హిందూ వితంతువుపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి (Hindu Widow Attacked) పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని ఓ చెట్టుకు కొట్టేసి ఆమె జట్టును కత్తిరించారు. నిర్ఘాంతపరుస్తున్న ఈ ఘటన సెంట్రల్ బంగ్లాదేశ్‌లోని ఝోనైదా జిల్లాలోని కాళీగంజ్‌లో జరిగింది. శనివారం సాయంత్రం జరిగిన ఈ దారుణం సోమవారం వెలుగులోకి వచ్చింది.
దాదాపు రెండున్నరేళ్లక్రితం కాళీగంజ్ మునిసిపాలిటీలో షాహీన్ అనే మహిళ, ఆమె సోదరుడికి చెందిన 1.2 గుంటల భూమిని బాధితురాలు కొనుగోలు చేసింది. 2 మిలియన్ టాకాలకు కొనగా, అందులో రెండంతస్తుల ఓ బిల్డింగ్ కూడా ఉంది. అయితే, కొనుగోలు పూర్తయిన ఇంతకాలం తర్వాత, విక్రయించిన వ్యక్తులు అసంబద్ధమైన ప్రతిపాదనలు చేశారు. అదనంగా డబ్బు అడిగినట్టుగా తెలుస్తోంది. అయితే, అందుకు బాధితురాలు ససేమిరా అని చెప్పడంతో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారంటూ స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. భూమి విషయంలో బాధితురాలు వేధిస్తూ వచ్చారని తెలిపాయి.
Read Also- Medaram Jathara: అసెంబ్లీలో మేడారం సందడి.. ఆహ్వాన పత్రిక అందజేత
శనివారం సాయంత్రం ఘటన
బాధితురాలిపై శనివారం సాయంత్రం (జనవరి 3) సామూహిక అత్యాచారం జరిగింది. బాధితురాలి గ్రామానికి చెందిన ఇద్దరు బంధువులు ఆమె ఇంటికి వచ్చిన సమయంలో షాహీన్, ఆమె కుటుంబానికి చెందినవారు మృగాల మాదిరిగా ప్రవర్తించారు. ఒక్కసారిగా దాడికి తెగబడి బాధితురాలిని మానభంగం చేశారు. అనంతరం 50 వేల టాకాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. భారతీయ కరెన్సీలో ఈ విలువ రూ.37 వేలుగా ఉంటుంది. అయితే, డబ్బు ఇవ్వలేనంటూ బాధితురాలు చెప్పడంతో మరింత కర్కశంగా ప్రవర్తించారు. బాధితురాలి బంధువులను అక్కడి నుంచి తరిమికొట్టారు. బాధితురాలు తీవ్ర భయంతో గట్టిగట్టిగా కేకలు వేసింది. అయినప్పటికీ, జాలి చూపకుండా ఆమెను తీసుకెళ్లి ఓ చెట్టుకు కట్టేసి జట్టు కత్తిరించారు. అంతేకాదు, ఈ తతంగాన్ని వీడియోను తీసి వీడియోను సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేశారు. జట్టు కత్తిరించిన తర్వాత కూడా బాధితురాలిని నిందిత వ్యక్తులు టార్చర్ చేశారు. దాంతో, ఆమె స్పృహతప్పి పడిపోయింది. ఆ తర్వాత స్థానిక వ్యక్తులు ఝెనైదా సర్దార్ హాస్పిటల్‌కు తరలించారు.
బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. మొస్తాఫిజుర్ రెహ్మాన్ స్పందిస్తూ, జరిగిన ఘటన గురించి బాధితురాలు తమకు చెప్పలేదన్నారు. ఆమె దాడి జరిగిన విషయం మెడికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాత తేలిందన్నారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. షాహీన్, హసన్ అనే వ్యక్తులను నిందితులుగా పేర్కొంది. సంచలనం రేపుతున్న ఈ ఘటనపై ఝెనైదా ఏఎస్పీ హోసెన్ స్పందించారు. బాధితురాలిని పోలీస్ స్టేషన్‌కు పిలిచి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకున్నామని చెప్పారు. దర్యాప్తు అనంతరం నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

