Sathupalli Medical Scam: సత్తుపల్లిలో మెడికల్ షాపుల పేరుతో సాగుతున్న అనధికార ‘సిండికేట్’ దందా పైకి కనిపిస్తున్నదానికన్నా లోతుగా పాతుకుపోయిన వ్యవస్థగా మారిందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తొలి కథనం వెలువడిన తరువాత ప్రజల్లో చర్చ తీవ్రతరం కావడంతో పాటు, క్షేత్రస్థాయి సమాచారం మరిన్ని సంచలన అంశాలను వెలుగులోకి తీసుకొస్తోంది. సత్తుపల్లిలో మెడికల్ షాపులు(Medical Shops) విడివిడిగా ఉన్న స్వతంత్ర వ్యాపార యూనిట్లుగా కాకుండా, ఒక కేంద్రబిందువు చుట్టూ తిరిగే ‘నెట్‌వర్క్’లా పనిచేస్తున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొత్తగా మెడికల్ షాపు ప్రారంభించాలంటే అనధికార అనుమతి తీసుకోవాల్సిందే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎవరితో వ్యాపారం చేయాలి, ఏ డిస్ట్రిబ్యూటర్ వద్ద నుంచి స్టాక్ తీసుకోవాలి, ఏ మందులు ఎక్కువగా విక్రయించాలి అన్న అంశాలన్నీ ‘సూచనల’ రూపంలో వస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
డ్రగ్స్ కంట్రోల్ శాఖ తనిఖీలు
ఈ వ్యవహారంలో మందుల సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్ల పాత్రపై కూడా అనుమానాలు పెరుగుతున్నాయి. కొద్ది మంది డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే సత్తుపల్లిలో ఆధిపత్యం చెలాయిస్తూ, ఇతర కంపెనీల మందులకు మార్కెట్ దూరం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్రక్రియలో భారీ కమీషన్లు చేతులు మారుతున్నాయన్న ప్రచారం సాగుతుండగా, ఈ కమీషన్లలో కొంత భాగం ‘రక్షణ కవచం’గా మారుతోందన్న ఆరోపణలు ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి. డ్రగ్స్ కంట్రోల్ శాఖ తనిఖీలు నిజంగానే జరుగుతున్నాయా? లేక అవి కాగితాలకే పరిమితమయ్యాయా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సత్తుపల్లిలో సంవత్సరాలుగా పెద్ద ఎత్తున తనిఖీలు జరగలేదన్న ఆరోపణలు వినియోగదారుల నుంచే కాకుండా, కొందరు వ్యాపార వర్గాల నుంచీ వినిపిస్తున్నాయి. ఎప్పుడైనా తనిఖీలు వస్తే ముందుగానే సమాచారం చేరుతుందన్న ఆరోపణలు పరిస్థితి తీవ్రతను మరింత స్పష్టం చేస్తున్నాయి.
కాలం చెల్లిన మందులు
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే యాంటీబయాటిక్స్(Antibiotics) విక్రయం జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలం చెల్లిన మందుల రీసైక్లింగ్ అనుమానాలు, సరైన నిల్వ ప్రమాణాలు పాటించకపోవడం వంటి అంశాలు నేరుగా ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మందులు కొనడానికి వెళ్లే పేద, మధ్యతరగతి ప్రజలు తెలియకుండానే ఈ దందాకు బలులవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు ముందుకొచ్చే చిన్న మెడికల్ షాపుల నిర్వాహకులు పేరు చెప్పడానికి వెనకాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. “మాట్లాడితే సరఫరా ఆపేస్తారు, తనిఖీల పేరుతో ఇబ్బందులు పెడతారు” అన్న భయమే ఇందుకు కారణమని వారు చెబుతున్నారు. ఇది ఈ సిండికేట్ ప్రభావం ఎంత లోతుగా పాతుకుపోయిందో తెలియజేసే సూచికగా మారుతోంది.
ఇది నిర్లక్ష్యమా? లేక..
ఇన్ని ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పటికీ జిల్లా ఔషధ నియంత్రణ శాఖ (డిస్టిక్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్) నుంచి ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇది నిర్లక్ష్యమా? లేక తెలిసీ తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారా? అన్న ప్రశ్నలు సామాన్య ప్రజల్లో తలెత్తుతున్నాయి. ప్రజారోగ్య శాఖ, డ్రగ్స్ కంట్రోల్, విజిలెన్స్ – ఈ వ్యవహారంలో ఎవరి బాధ్యత ఏమిటన్నది స్పష్టంగా తేలాల్సిన అవసరం ఉందన్న వాదన బలపడుతోంది.ఈ నేపథ్యంలో ప్రజా సంఘాలు, వినియోగదారుల సంఘాలు ఈ వ్యవహారంపై విజిలెన్స్, ఏసీబీ స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. బ్యాంక్ లావాదేవీలు, డిస్ట్రిబ్యూటర్ ఒప్పందాలు, తనిఖీల రికార్డులను సమగ్రంగా పరిశీలిస్తే అసలు నిజం బయటపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సత్తుపల్లిలో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే – “ఇక్కడ నిజంగా మందులు అమ్ముతున్నారా? లేక నోరు మూయిస్తున్నారా?” అంటూ నియోజకవర్గం కోడై కూస్తుంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ వ్యవస్థపై అధికారులు ఎప్పుడు స్పందిస్తారు? ఈ దందాకు తెరపడుతుందా? లేక మౌనం మరింత లోతుగా మారుతుందా? అన్న ప్రశ్నలు మిగిలిపోయాయి.
ఈ వ్యవహారంపై మరిన్ని సంచలన నిజాలతో ‘స్వేచ్ఛ’ త్వరలో మరో స్ట్రింగ్ ఆపరేషన్ కథనాన్ని తీసుకురానున్నట్లు సమాచారం.
Also Read: Inter Caste Marriages: కులాంతర వివాహాల్లో ఆ జిల్లానే టాప్.. ఒక్కో జంటకు రూ. 2.50 లక్షల ప్రోత్సాహకం!

