Elon Musk: కెనడా దేశ వైద్య వ్యవస్థపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 44 ఏళ్ల భారత సంతతి వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంపై ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అతడు చేసిన పోస్టు ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భారత సంతతి వ్యక్తి మృతిపై మస్క్ తీవ్రంగా స్పందించడంతో భారత్ లోనూ మస్క్ పెట్టిన పోస్టు వైరల్ గా మారుతోంది.
వివరాల్లోకి వెళ్తే..
కెనడాలోని ఎడ్మంటన్ ప్రాంతంలో జీవిస్తున్న 44 ఏళ్ల భారత సంతతి వ్యక్తి ప్రశాంత్ శ్రీకుమార్ తీవ్ర ఛాతి నొప్పి రావడంతో స్థానిక గ్రేనన్స్ కమ్యూనిటీ ఆస్పత్రికి వెళ్లారు. అయితే అతడికి సకాలంలో అత్యవసర వైద్యం లభించలేదు. దాదాపు 8 గంటల పాటు చికిత్స అందించకుండా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా ఛాతి నొప్పి తీవ్రమై హార్ట్ అటాక్ తో ప్రశాంత్ శ్రీకుమార్ మృతి చెందినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
మస్క్ ఏమన్నారంటే..
ప్రశాంత్ మృతికి సంబంధించి అతడి భార్య పంచుకున్న వీడియో కెనడా సహా ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆస్పత్రిలో తన భర్తకు ఎదురైన ఛేదు అనుభవం, వైద్యుల నిర్లక్ష్యం గురించి ఆమె పూసగుచ్చినట్లు చెప్పారు. దీంతో నెట్టింట కెనడా ఆస్పత్రిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మస్క్ సైతం ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తే అవి డీఎంవీ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ మోటర్ వెహికల్స్) లాగానే ఉంటాయి’ అని మస్క్ వ్యాఖ్యానించారు. పనితీరు లేమికి పేరొందిన అమెరికా మోటార్ వాహనాల విభాగంతో పోల్చుతూ కెనడా ఆరోగ్య వ్యవస్థను ఆయన తీవ్రంగా మండిపడటం గమనార్హం.
When the government does medical care, it is about as good as the DMV https://t.co/kRdlL3idyF
— Elon Musk (@elonmusk) December 26, 2025
ఆ రోజున ఏం జరిగిందంటే
మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం డిసెంబర్ 22 మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో ప్రశాంత్ శ్రీకుమార్‌ను గ్రే నన్స్ కమ్యూనిటీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. మధ్యాహ్నం 12.20 నుంచి రాత్రి 8.50 గంటల వరకు ఆయన ట్రయాజ్ (ప్రాథమిక పరిశీలన) ప్రాంతంలోనే ఉంచారు. ఈ సమయంలో ప్రశాంత్ పలుమార్లు తీవ్రమైన ఛాతి నొప్పికి గురయ్యారని చెప్పారు. ఆయన రక్తపోటు 210 వరకు పెరిగిందని పేర్కొన్నారు. అయినప్పటికీ అతడికి కేవరం టైలోనాల్ టాబ్లెట్ మాత్రమే ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ॐ shanti 🙏
44-year-old Prashant Sreekumar died in the emergency waiting room at Grey Nuns Hospital in Edmonton, leaving behind his wife & three childrenA damning indictment of 🇨🇦’s so-called “free healthcare.” A young life was lost due to systemic failure.
Respect & strength… pic.twitter.com/SUBmGSbPJy
— Ruchi Wali 🇨🇦 (@WaliRuchi) December 25, 2025
Also Read: Panchayat Grants: తెలంగాణ గ్రామ పంచాయతీలకు తీపి కబురు.. సీఎం కీలక ప్రకటన
కెనడా ప్రభుత్వానిదే బాధ్యత: భారత్
గ్రే నన్స్ ఆసుపత్రి సిబ్బంది ఛాతి నొప్పిని అత్యవసర పరిస్థితిగా ఏమాత్రం పరిగణించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అది గుండె సంబంధిత సమస్య కాదని తొలుత చెప్పారని పేర్కొన్నారు. తాము అత్యవసర చికిత్సకు ఎంతగా డిమాండ్ చేసినప్పటికీ ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోలేదని వాపోయారు. తాము తీవ్రంగా ఒత్తిడి చేయడంతో 8 గంటల జాప్యం తర్వాత అత్యవసర గదికి తమ బిడ్డను తీసుకెళ్లారని ప్రశాంత్ తండ్రి కుమార్ తెలిపారు. అయితే గదిలోకి తీసుకెళ్లిన నిమిషాల వ్యవధిలోనే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన వాపోయారు. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ కూడా స్పందించింది. ఈ కేసుపై కెనడా ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరినట్లు తెలిపింది. ముగ్గురు పిల్లల తండ్రి అయిన ప్రశాంత్ శ్రీకుమార్ మృతితో ఆయన భార్య, పిల్లలు తీవ్ర విషాదంలో మిగిలిపోయారు.

