Louvre Museum: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, చారిత్రక కళాఖండాలకు నిలయమైన పారిస్‌లోని లౌవ్రె (Louvre Museum) మ్యూజియంలో ఆదివారం భారీ చోరీ జరిగింది. నెపోలియన్ కాలం నాటి విలువైన ఆభరణాలు దొంగిలించుకుపోయినట్టుగా ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే, ఈ ఘటనపై మ్యూజియం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, దొంగలు చిన్నపాటి చైన్‌సా (చెయిన్ రంపాలు) తీసుకొని ఒక స్కూటర్‌పై వచ్చినట్టుగా చెబుతున్నారు. నిర్మాణంలో ఉన్న ప్రదేశంలో ఉన్న ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన తెర (వల వంటిది) చీల్చుకొని మ్యూజియంలోకి ప్రవేశించారని చెబుతున్నారు. దొంగల టార్గెట్‌గా ఎంచుకున్న గదికి చేరుకోవడానికి ఒక గూడ్స్ లిఫ్ట్‌ను ఉపయోగించారు. మ్యూజియం భవనంలోని అపోలో గ్యాలరీలోని గదికి చేరుకున్నాక, కిటికీలను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఈ దొంగలు నెపోలియన్, ఒక రాణికి చెందిన తొమ్మిది ఆభరణాలను దొంగిలించినట్లు ఫ్రెంచ్ వార్త పత్రిక ‘లే పారిసియన్’ కథనం పేర్కొంది. కాగా, చోరీ ఘటనపై ప్యారీస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫీస్ దర్యాప్తు చేపడుతోంది. దొంగతనానికి గురైన వస్తువుల విలువను అంచనా వేస్తున్నట్టు వివరించారు.
Read Also- Perth ODI: ఆసీస్‌తో తొలి వన్డేలో టీమిండియా ఓటమి.. రోహిత్, కోహ్లీ ఎలా ఆడారంటే?
తాత్కాలికంగా మూసివేత
అనూహ్య రీతిలో చోరీ జరగడంతో ఒక్కరోజు పాటు (ఆదివారం) మ్యూజియాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. కారణాన్ని ప్రత్యేకంగా పేర్కొనకుండా, ‘అసాధారణ కారణాలు’ వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం మ్యూజియం తెరిచే సమయంలో చోరీ జరిగిందని ఫ్రాన్స్ సాంస్కృతిక శాఖ మంత్రి రచిడా దతి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మ్యూజియం సిబ్బంది, పోలీసులతో కలిసి తాను ఘటనా స్థలంలోనే ఉన్నానని, దర్యాప్తు జరుగుతోందని ఆమె వెల్లడించారు. కాగా, ఈ చోరీ కేవలం 7 నిమిషాల్లోనే జరిగిందని, అమూల్యమైన ఆభరణాలను అపహరించుకుపోయారని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ న్యూనెజ్ వెల్లడించారు.
లౌవ్రె మ్యూజియానికి చాలా విశిష్టత
ప్యారిస్‌లో ఉన్న లౌవ్రె మ్యూజియం ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. ప్రపంచంలోనే అత్యధిక మంది సందర్శించే మ్యూజియం ఇదే. ప్రతిరోజూ దాదాపుగా 30,000 మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఈ మ్యూజియంలో 33,000కు పైగా కళాఖండాలు ఉన్నాయి. వీటిలో మోనాలిసా, వీనస్ డి మిలో, ది వింగ్డ్ విక్టరీ ఆఫ్ సమోత్రేస్ వంటి అద్భుతమైన కళాఖండాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. చోరీకి గురైన ఆభరణాలను అపోలో గ్యాలరీలోని ఫ్రెంచ్ క్రౌన్ జ్యువల్స్‌లో ప్రదర్శిస్తారు. కాగా, గతంలో కూడా లౌవ్రె మ్యూజియంలో దొంగతనాలు జరిగాయి. 1911లో, లియోనార్డో డావిన్సీ గీసిన మోనాలిసా పెయింటింగ్‌ను నాటి ఉద్యోగి దొంగిలించాడు. ఆ కళాఖండాన్ని రెండు సంవత్సరాల తర్వాత ఫ్లోరెన్స్‌లో తిరిగి గుర్తించారు. చివరిగా 1983లో పెద్ద దొంగతనం 1983లో జరిగింది. పునరుజ్జీవన కాలం (యూరప్‌లో 14-16వ శతాబ్దం) నాటి రెండు కవచాలను దొంగిలించగా, 2021లో తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
