Jogulamba Gadwal: భూతగాదాలతో ఓ వ్యక్తిపై దారుణంగా దాడి చేసిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం మల్దకల్ మండలం మద్దెలబండ గ్రామంలో కొందరు మరణాయుధాలతో దాడి చేశారని తీవ్రంగా గాయపడ్డ మురళీధర్ తెలిపారు. తనకున్న పొలం పంచాయతీని తీరుస్తానని తన దగ్గర మల్దకల్ మండలానికి చెందిన ఓ లీడర్ 10 లక్షల డిమాండ్ చేయగా ఎనిమిది లక్షలకు ఒప్పుకొని ఐదు లక్షలు అడ్వాన్స్ ఇచ్చానని తెలిపాడు. తన పొలానికి రక్షణ కల్పించి ఫెన్సింగ్ వేయిస్తానని భరోసాన్నిచ్చాడని, ఎస్సై కు సైతం లక్ష రూపాయలు ఇచ్చానని బాధితుడు కర్నూల్ లో చికిత్స పొందుతూ వీడియోలో తెలిపాడు.
నాతో ఒప్పందం చేసుకున్నప్పటికీ తన ప్రత్యర్థి వర్గంతో చేతులు కలిపి వారితో ఎక్కువ రేటుకు ఒప్పందం చేసుకొని తనపై విచక్షణ రహితంగా తమ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ప్రోద్బలంతో తనపై ఇనుపరాడ్ , కర్రెలు, రాళ్లతో విచక్షణారహితంగా సమూహంగా ఏర్పడి దాడి చేశారని, ఆ దాడిలో వెన్నెముకతో పాటు గుండె కింద ఎముకలు విరిగి కాళ్ళు ఫ్యాక్చర్ అయిందన్నారు. నేను చనిపోయానని భావించి వెళ్లారని, మల్దకల్ మండలానికి చెందిన లీడర్ తో పాటు మద్దెలబండ తాజా మాజీ సర్పంచ్ నుంచి నాకు ప్రాణహాని ఉందని ఈ మేరకు తనకు రక్షణ కల్పించాలని వీడియో ద్వారా ఎస్పీకి విన్నవించారు.నాపై దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలన్నారు.
మద్దెల బండ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 5 లో సైతం ఐదేళ్ల క్రితం ఒక ఎకరా పొలాన్ని కొని వెంచర్ వేయగా అందులో సైతం పొలం హద్దుల విషయంలో గెట్లు జరిగారని గొడవ పెట్టుకున్నారన్నారు. అదేవిధంగా సర్వేనెంబర్ 31 లోని 7.38 ఎకరాల విషయంలో మా దాయదుల మధ్య నెలకొన్న సమస్య కోర్టులో ఉందని, దీనిని ఆసరాగా చేసుకుని, నా ఎదుగుదలను ఓర్వలేక రాజకీయంగా సమస్యలు వస్తాయని మండల లీడర్ తో కుట్రపన్ని ప్రస్తుత మాజీ సర్పంచ్ తనపై దాడికి ఉసిగొల్పాడన్నారు. ఈ విషయమై మల్దకల్ మండల ఎస్సై వివరణ కోరగా భూతగాదాలో జరిగిన దాడిపై కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నామన్నారు.

