China: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. గతంలో లాగానే ఈసారి కూడా చైనా (China)పై కయ్యానికి కాలు రువ్వుతున్నారు. ఆ దేశం నుంచి దిగుమతయ్యే వస్తువుపై అధిక సుంకాలు విధిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల అమెరికన్ కాంగ్రెస్ లో మాట్లాడిన ట్రంప్.. ఆ దేశంపై ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార పన్నులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. అటు చైనా కూడా తగ్గేదే లే అన్నట్లు అమెరికా వస్తువులపై 10-15 శాతం అధిక పన్నులు విధించనున్నట్లు ప్రకటించింది. ఈ వివాదం నడుస్తున్న క్రమంలో చైనా విదేశాంగ మంత్రి.. భారత్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విరోధం లేకుండా రెండు దేశాలు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు.
‘పరస్పర మద్దతు అవసరం’
అమెరికాతో వాణిజ్య యుద్ధం (USA Trade War) కొనసాగుతున్న వేళ.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ (Wang Yi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ – బీజింగ్ పరస్పరం శత్రుత్వం పెంచుకునే కంటే భాగస్వాముల్లా కలిసి పనిచేయడం ఉత్తమమని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. చైనా – భారత్ జట్టుగా ఉండి పరస్పర విజయానికి సహకరించుకోవాలని సూచించారు. ఇరుదేశాలు ఒకరినొకరు నొప్పించుకునే బదులు మద్దతు నిలబడాలని పిలుపునిచ్చారు. ఇది ఇరుదేశాల ప్రజలకు లాభం చేకూరుస్తుందని అన్నారు. ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వాంగ్ యీ అన్నారు.
‘గ్లోబల్ సౌత్ ను బలోపేతం చేద్దాం’
భారత్ – చైనా మధ్య దౌత్య సంబంధాలు మెరుగైతే అది ప్రపంచానికి సైతం మంచి చేకూరుస్తుందని డ్రాగన్ విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు. ముఖ్యంగా ఇది గ్లోబల్ సౌత్ దేశాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ వేదికలపై గ్లోబల్ సౌత్ దేశాల స్థానాన్ని భారత్ – చైనా సంబంధాలు శక్తివంతం చేస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య నెలకొన్న వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకతను వాంగ్ యీ గుర్తు చేశారు. చర్చలతో సమసిపోని సమస్యలు, సహకారంతో అందుకోని లక్ష్యాలు లేవని వాంగ్ యీ అన్నారు.
Also Read: Womens Day: దేశ చరిత్రలో తొలిసారి.. మహిళా పోలీసులతో ప్రధానికి భద్రత
చైనాలో మార్పునకు కారణం అదేనా!
ట్రంప్ తో వాణిజ్య యుద్ధం నేపథ్యంలోనే భారత్ తో మెరుగైన సంబంధాలను చైనా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ కారణం చేతనే ప్రస్తుతం ఎలాంటి సందర్భం లేనప్పటికీ భారత్ గురించి మాట్లాడుతూ స్నేహా హస్తాన్ని అందిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ ను సైతం వదలకుండా అధిక సుంకాలు విధిస్తానని హెచ్చరిస్తున్నారు. అటు చైనాపై కూడా ముందు నుంచి ట్రంప్ వైఖరి కఠువుగానే ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాతో చేసే వాణిజ్య యుద్ధంలో భారత్ ను సైతం భాగస్వామిని చేసుకోవాలని చైనా భావిస్తోంది. రెండు బలమైన దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా స్వరం అందుకుంటే అది అధ్యక్షుడు ట్రంప్ ను కచ్చితంగా పునరాలోచించేలా చేస్తుందని చైనా భావిస్తోంది. మరి చైనా విదేశాంగ మంత్రి ఇచ్చిన పిలుపుపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.